Homeకదం తొక్కుతూ… పదం పాడుతూ…

కదం తొక్కుతూ… పదం పాడుతూ…

- Advertisement -

ఎర్రసంద్రమైన ఒంగోలు

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు: సీపీఐ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా ఒంగోలు ఎరుపెక్కింది. కామ్రేడ్లు కదం తొక్కారు. భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 28వ మహాసభలను పురస్కరించుకుని శనివారం ఒంగోలు నగరంలో నిర్వహిం చిన భారీ ప్రదర్శన సీపీఐ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కదం తొక్కుతూ, పదం పాడుతూ మహాప్రదర్శనలో పాల్గొన్నారు. నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌ లోని మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన భారీ ప్రదర్శన కలెక్టరేట్‌, ట్రంకు రోడ్డు, అద్దంకి బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌, కొత్త కూరగాయల మార్కెట్‌ మీదుగా సభా ప్రాంగణం వరకు సాగింది. ఈ ర్యాలీకి రాష్ట్ర నలుమూల నుంచి సీపీఐ, ప్రజా సంఘాలకు చెందిన శ్రేణులు పోటాపోటీగా తరలివచ్చారు. పురుషులు ఎర్ర చొక్కాలు, మహిళలు ఎరుపు చీరలు ధరించి ప్రదర్శనలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కొందరు మహిళలు చంటి పిల్లలను ఒక చేత్తో ఎత్తుకొని, మరోచేత్తో ఎర్రజెండా చేతబూని ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఉత్తేజపరిచింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీపీఐ జిందాబాద్‌, ఎర్రజెండా వర్థిల్లాలి అనే నినాదాలతో నగర వీధులు మారుమోగాయి. నగరంలో ఎటు చూసినా ఎర్రజెండాలు, అరుణ పతాకాలు, ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లతో ఎరుపుమయమైంది. కిలోమీటర్ల పొడవునా ముందుభాగాన సాగిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు, పార్టీ మహాసభల సంఖ్యను సూచిస్తూ 28 సీపీఐ పార్టీ పతా కాలతో సాగిన రెడ్‌ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రజలను ఆకర్షించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, ఏఐకేఎస్‌ ప్రధానకార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జల్లి విల్సన్‌, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, హరినాథరెడ్డి, రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్‌, జంగాల అజయ్‌కుమార్‌, డేగా ప్రభాకర్‌, జగదీశ్‌, సినీ నటుడు మాదాల రవి, ప్రజాసంఘాల నాయకులు తదిత రులు ప్రదర్శన అగ్రభాగాన నిలిచారు. వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ కార్యదర్శులు వారి జిల్లాలకు సంబంధించిన ప్రధాన డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేబూని ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాలకు చెందిన శ్రేణులు, వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన వారు కూడా ప్రత్యేక డిమాండ్లతో కూడిన బ్యానర్లతో ప్రదర్శనలో పాల్గొన్నారు. కంకి కొడవలి గుర్తుతో మహిళలు ధరించిన గొడుగులు, యంగ్‌ కమ్యూనిస్ట్‌ మార్చ్‌ పేరుతో యువజనుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. డప్పుల దరువు, కనకతప్పెట్లు, కోలాటాలతో పురవీధులు మారుమోగాయి. కొమ్ముల నృత్యాలు, దింసా నృత్యం, జానపద, గురవయ్యలు, వివిధ ప్రాంతాలకు, గిరిజన తండాలకు సంబంధించిన సంప్రదాయ నృత్యాలు ప్రదర్శ నకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీపీఐ శత వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని దాదాపు 1000 మంది ప్రజానాట్య మండలి కళాకారులు వంద డప్పులు, వంద పాటలు, వంద గొంతుకల ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకు న్నాయి. రెండు లైన్లుగా అత్యంత క్రమశిక్షణతో సాగిన ఈ ప్రదర్శనకు ముందుభాగాన భారత లౌకిక వ్యవస్థ, మత సామరస్యతను చాటిచెపుతూ హిందూ, క్రిస్టియన్‌, ముస్లింల వేషధారణ, మరోవైపు ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత లెనిన్‌ వేషధారణతో కూడిన ప్రజానాట్య మండలి కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దారిపొడవునా కమ్యూనిస్టు పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు సీపీఐ నేతలపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కమ్యూనిజం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, మార్క్సిజం, లెనినిజం అజరామరం అంటూ ప్రదర్శనకారులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మోదీ, చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రేణులు చేసిన నినాదాలు ప్రజలను ఆలోచింపజేశాయి. వేలాదిమందితో సాగిన ఈ ప్రదర్శన ఒక పాయింట్‌ దాటడానికి గంట సమయం పట్టింది. అనంతరం కామ్రేడ్‌ గుజ్జుల యలమందారెడ్డి,సరళాదేవి సభా ప్రాంగణంలో బహిరంగసభ నిర్వహించగా, పార్టీ శ్రేణులతో పాటు రాజకీయపార్టీల కతీతంగా ఈసభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాల పరిణామాలు, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కమ్యూనిస్టుపార్టీ శ్రేణుల కర్తవ్యాలను వివరిస్తూ సీపీఐ నేతలు దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు