Homeకదలి రండి... మార్పుతోనే దేశానికి రక్ష

కదలి రండి… మార్పుతోనే దేశానికి రక్ష

- Advertisement -
  • 1న దిల్లీలో భారీ ర్యాలీ
  • ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి దిశగా బద్లావ్ జరూరీ హై
  • సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

న్యూఢిల్లీ: రాజకీయంగా మార్పు తెద్దాం… దేశాన్ని కాపాడుకుందామంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న ఆర్థిక దుస్థితి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యంపై దాడులు, సమాఖ్య వ్యవస్థకు ముప్పు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ‘బద్లావ్ జరూరీ హై’ ప్రచారోద్యమం లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నిర్మాణం దిశగా ప్రజలను చైతన్యపరుస్తున్నామని చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగా ఎన్నికల సంస్కరణలు, మహిళా రిజర్వేషన్, కార్మిక హక్కులు, ఎంఎస్‌పీకి చట్టబద్ధత, రామమందిరం చందాల పారదర్శకత తదితర అంశాలపై బుక్‌లెట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. దళితులపై వివక్ష, గిరిజనుల హక్కులు, కార్పొరేట్‌ల చేతుల్లో అటవీ భూములు వంటి అంశాలపైనా మరిన్ని ప్రచురణలు శుక్రవారం తీసుకురానున్నట్లు తెలిపారు. ఇవి కేవలం చదవడానికే కాకుండా రాజకీయ చర్చలకు దోహదపడేలా రూపొందించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌లో గురువారం పార్టీ కార్యదర్శులు రామకృష్ణ పాండా, డి.గిరీశ్ శర్మ, అనీరాజాతో కలిసి డి.రాజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబరు 1న దిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ‘బద్లావ్ జరూరీ హై’ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. పార్లమెంటు రబ్బర్ స్టాంప్‌గా మారకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, ప్రతిపక్షం గట్టి పట్టుదల, కృతనిశ్చయంతో వ్యవహరిస్తేనే ఇది సాధ్యమని డి.రాజా స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న నిరుద్యోగం, అధిక ధరలు, తగ్గుతున్న కొనుగోలు శక్తి, అసమానతలు, బలహీనపడుతున్న ప్రజాస్వామిక వ్యవస్థలు వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ వంటి ప్రతిపాదనలు దేశ సమాఖ్య వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని డి.రాజా అన్నారు. ఈ ప్రతిపాదనలను సీపీఐ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం పెరగడం, ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చే ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షాలను బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పార్లమెంటును రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మార్చొద్దని హితవు పలికారు. డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు వంటి ప్రతిపాదనల ఆమోదానికి, రాజకీయ-సంస్థాగత ఆధిపత్యానికి పార్లమెంటును బీజేపీ వినియోగిస్తోందని డి.రాజా ఆరోపించారు. ప్రతిపక్షం గట్టి పట్టుదలతో ఉంటే పార్లమెంటు రబ్బర్ స్టాంప్‌గా మారకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, జవాబుదారీగా నిలబెట్టే వ్యవస్థగా పార్లమెంటు పనిచేయాలని డి.రాజా అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని డి.రాజా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు తగినంత నిధులు అందకపోవడంతో పేద, శ్రామిక వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్య, పరీక్షలకు సంబంధించిన వివాదాలకు పరిష్కారం చూపడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. దిల్లీ, జార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమాలపై పోలీసు చర్యలను ఖండించారు. తమ హక్కుల కోసం ఆందోళన చేసే విద్యార్థులు నిర్బంధాలు, పోలీసు దాడులు, గాయాల భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ కొనసాగుతోందని డి.రాజా తెలిపారు. కార్మికుల్లో అభద్రతా భావం పెరుగుతోంద న్నారు. హక్కుల కోసం గొంతెత్తుతున్న విద్యార్థులు, యువత పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాలు వివక్షకు గురవుతున్నాయని, వారిలో అభద్రతా భావం పెరుగుతోందన్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సెప్టెంబరు 1న జరగనున్న ర్యాలీని అడ్డుకునేందుకు బీజేపీ యంత్రాంగాలు ప్రయత్నిస్తున్నాయని డి.రాజా తెలిపారు. కేరళ, తమిళనాడు నుంచి బుక్ చేసిన రైళ్లు రద్దు చేశారని, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణుల ఇళ్లకు అర్ధరాత్రి సమయాల్లో వెళ్లి వేధింపులకు పాల్పడుతున్నారని, భయపెడుతున్నారన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు సీపీఐ లొంగబోదని అన్నారు. ‘బద్లావ్ జరూరీ హై’ ప్రచారోద్యమం కొనసాగుతుందని డి.రాజా స్పష్టం చేశారు. భారత్‌లో రాజకీయ మార్పు అనివార్యమని సీపీఐ బలంగా విశ్వసిస్తోందని, అందుకోసం తన వంతు కృషి చేస్తోందన్నారు. సెప్టెంబరు 1న దిల్లీ ర్యాలీ కేవలం దేశ రాజధానికి పరిమితం కాకుండా యావత్ భారతాన్ని కదిలించేలా ఉండాలని డి.రాజా ఆకాంక్షించారు. విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరిపాలనా మార్పు దిశగా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ముక్తకంఠంతో డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటును జవాబుదారీ వ్యవస్థగా పునరుద్ధరించడం, ఫెడరలిజాన్ని బలోపేతం చేయడం, రాజ్యాంగ హక్కులు కాపాడటం, ప్రభుత్వ విద్య-ఆరోగ్య రంగాలకు నిధులు పెంచడం, సామాజిక-ఆర్థిక న్యాయానికి హామీ కల్పించడం, రైతులు-కార్మికులకు రక్షణ కల్పించడం, దేశంలోని సంస్థలు మతోన్మాద సిద్ధాంతాలకు దూరంగా స్వతంత్రంగా పనిచేసేలా చూడటం వంటి అంశాలే పాలనా మార్పు లక్ష్యాలని డి.రాజా వివరించారు. ప్రజల ఆకాంక్షలను అణచివేయడం, దుష్ప్రచారం చేయడం, మతపరమైన విభజనలకు పాల్పడటం, భయోత్పాతం సృష్టించడం, సంస్థాగత ఒత్తిళ్లతో అణచివేయాలని చూడటం వంటివి ఆగిపోవాలన్నారు. విద్యార్థుల ఆగ్రహం, రైతులు-కార్మికుల డిమాండ్లు, దళితులు-ఆదివాసీల సమస్యలు, మైనారిటీల ఆందోళనలు, ప్రజాస్వామిక జవాబుదారీతనం కోసం జరుగుతున్న పోరాటాలన్నీ మార్పు కోసం పెరుగుతున్న విస్తృత డిమాండ్‌లో భాగంగా ఆయన అభివర్ణించారు. ‘బద్లావ్ జరూరీ హై’ ర్యాలీ మార్పు కోసం ప్రజల డిమాండ్‌కు శక్తిమంతమైన ప్రకటనగా నిలుస్తుందని డి.రాజా స్పష్టంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు