Homeకార్మికులపై చావుదెబ్బ

కార్మికులపై చావుదెబ్బ

- Advertisement -

. నాలుగు లేబర్‌కోడ్‌ల అమలు
. ఇకపై పాత 29 కార్మిక చట్టాలుండవు
. కార్పొరేట్‌ యాజమాన్యాలు చెప్పిందే వేదం
. కార్మిక సంస్కరణల పేరుతో హక్కుల కోత
. కేంద్ర కార్మిక సంఘాల ఆగ్రహం

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదునుచూసి దెబ్బకొట్టింది. ప్రతి కార్మికుడికి గౌరవాన్ని కల్పించాలన్న పేరుతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం నుండి దేశంలో నాలుగు కార్మిక స్మృతులను (లేబర్‌ కోడ్‌లను) అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దవుతాయి. పాత చట్టాలను హేతుబద్ధీకరిస్తామని చెప్పడం ఒక సాకుమాత్రమే. ఇకముందు కార్పొరేట్‌ యాజమాన్యాలు చెప్పిందే వేదం కానున్నది. కార్మిక సంస్కరణల పేరుతో హక్కులకు కోతపడనున్నది. వేతనాల కోడ్‌-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020, సామాజిక భద్రత కోడ్‌-2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌-2020 అనే నాలుగు కార్మిక కోడ్‌ల పేరిట సరికొత్త కార్మిక నిబంధలను తీసుకువచ్చింది. ఈ కొత్త కార్మిక చట్టాలు పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమైనవిగా ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. పైగా ఏఐటీయూసీతో సహా పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ కోడ్‌లను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. బీహార్‌ ఎన్నికల విజయంతో ఏ చట్టాలు అమలు చేసినా తిరుగులేదన్న భావంతో బీహార్‌లో ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజే ఈ నాలుగు కార్మిక కోడ్‌లను అమల్లోకి తెచ్చింది. కాగా, ఈ కార్మిక కోడ్‌లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇలా దొడ్డిదారిన అమలు చేయడం కార్మికులకు విద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించాయి. వీటి అమలును అడ్డుకుంటామని, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.
కార్మిక నిబంధనలను ఆధునీకరించడం, కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న పని ప్రపంచంతో కార్మిక పర్యావరణ వ్యవస్థను సమలేఖనం చేయడం ద్వారా, నేటి శ్రామిక శక్తిని భవిష్యత్‌ కోసం తయారు చేయడమే ఈ కోడ్‌ల లక్ష్యమని, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం కార్మిక సంస్కరణలను నడిపించే బలీయమైన పరిశ్రమలకు ఈ కోడ్‌లు పునాది వేస్తుందని కార్మిక శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.
కార్మికులకు మరిన్ని హక్కులను కల్పించడం, మహిళా కార్మికులకు నైట్‌ షిఫ్ట్‌ పనితోపాటు మరింత భద్రత చేకూర్చడం, 40 ఏళ్లు దాటిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, పాన్‌-ఇండియా ఈఎస్‌ఐ కవరేజి పేరుతో ప్రమాదకర ప్రాసెసింగ్‌ యూనిట్లకూ ఈఎస్‌ఐసీని వర్తింపజేయడం, కంపెనీలకు సింగిల్‌ రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌, రిటర్న్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వంటి ఎన్నో సంస్కరణలు ఇందులో ఉన్నాయని కార్మిక శాఖ ప్రకటించింది.
భారతదేశంలోని అనేక కార్మిక చట్టాలు స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్ర ప్రారంభదశలో అంటే 1930-1950 మధ్య రూపొందాయని, ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని ప్రపంచం ప్రాథమికంగా భిన్నంగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన నివేదిక పేర్కొంది. ఇటీవలి దశాబ్దాలలో చాలా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తమ కార్మిక నిబంధనలను నవీకరించి, ఏకీకృతం చేసినప్పటికీ, భారతదేశం 29 కేంద్ర కార్మిక చట్టాలలో విస్తరించి ఉన్న విచ్ఛిన్నమైన, సంక్లిష్టమైన, అనేక భాగాలలో పాత నిబంధనల కింద పనిచేయాల్సి వస్తున్నదని తెలిపింది. అందుకే వీటన్నింటినీ క్రోడీకరించి, నాలుగు కొత్త స్మృతులుగా తీసుకువస్తున్నట్లు వివరించింది. పాత చట్టాలు మారుతున్న ఆర్థిక వ్యవస్థల వాస్తవాలకు, అభివృద్ధి చెందుతున్న ఉపాధి రూపాలకు అనుగుణంగా లేవని, కార్మికులు, పరిశ్రమ రెండిరటికీ అనిశ్చితిని, భారాన్ని పెంచుతున్నాయని తెలిపింది. నాలుగు కార్మిక కోడ్‌ల అమలు వలసరాజ్యాల యుగం నిర్మాణాలను దాటి ఆధునిక ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ఉండవలసిన ఈ దీర్ఘకాల అవసరాన్ని పరిష్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కోడ్‌లు కార్మికులు, సంస్థలు రెండిరటినీ శక్తివంతం చేస్తాయని, రక్షిత, ఉత్పాదక, అభివృద్ధి చెందుతున్న పని ప్రపంచంతో అనుసంధానం చేసి సరికొత్త శ్రామిక శక్తిని నిర్మిస్తాయని, మరింత పోటీతత్వంతో, స్వావలంబనతో కూడిన దేశానికి మార్గం సుగమం చేస్తాయని మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.
దేశ స్వావలంబన కోసమే: మంత్రి మాండవీయ
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేస్తూ, ప్రతి కార్మికుడికి గౌరవం కల్పించేందుకు నేటి నుండి, దేశంలో కొత్త కార్మిక కోడ్‌లు అమలులోకి వచ్చాయని, ఇది ప్రభుత్వ హామీ అని పేర్కొన్నారు. కార్మికులందరికీ సకాలంలో కనీస వేతనాల హామీ, యువకులకు నియామక పత్రాల అందజేత, మహిళలకు సమాన వేతనం, గౌరవ హామీ, 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత హామీ, ఒక సంవత్సరం ఉద్యోగం తర్వాత స్థిర-కాలిక ఉద్యోగులకు గ్రాట్యుటీ హామీ, 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల హామీ, ఓవర్‌టైమ్‌కు రెట్టింపు వేతనాల హామీ వంటి ఎన్నో హామీలు ఈ కోడ్‌లు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దానితో పాటు, ప్రమాదకర రంగాలలోని కార్మికులకు 100 శాతం ఆరోగ్య భద్రత, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం హామీని కూడా ఈ కోడ్‌లు నిర్ధారిస్తాయని మాండవీయ చెప్పారు. ఈ సంస్కరణలు కేవలం సాధారణ మార్పులు మాత్రమే కాదని, శ్రామిక శక్తి సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ప్రధాన అడుగు అని ఆయన ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఈ కొత్త కార్మిక సంస్కరణలు స్వావలంబన భారతదేశం వైపు ఒక ముఖ్యమైన అడుగు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యానికి కొత్త ఊపునిస్తాయి’’ అని అన్నారు. ద్విసభ్య ట్రిబ్యునల్స్‌ ద్వారా వివాదాల సత్వర పరిష్కారానికి యంత్రాంగం, భద్రత ప్రమాణాల పరిశీలనకు జాతీయ వృత్తి భద్రత, ఆరోగ్య (ఓఎస్‌హెచ్‌) బోర్డు ఏర్పాటు వంటి అంశాలూ ఇందులో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం సవివరమైన నిబంధనలు, పథకాల రూపకల్పనకు సంప్రదింపులను ప్రారంభిస్తుందని, ఈ క్రమంలో అవసరమైన చోట ప్రస్తుతం అమల్లో ఉన్న పాత చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. అయితే పాత చట్టాలు రద్దయినట్లేనని కార్మిక శాఖ ప్రకటనలో స్పష్టంగా ఉంది. సామాజిక భద్రత కవరేజి 2015లో 19 శాతం ఉండగా, 2025లో అది 64 శాతానికి పెరిగిందని మంత్రి మాండవీయ తెలిపారు.
కార్మికులకు గొప్ప శక్తినిస్తుంది: ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్మిక కోడ్‌లపై వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేసింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఒకటి. ఇది మన కార్మికులకు గొప్పగా శక్తినిస్తుంది. ఇది పనినీ, పని సంస్కృతిని గణనీయంగా సులభతరం చేస్తుంది. అదే సమయంలో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) అని మోదీ పేర్కొన్నారు. ఈ కోడ్‌లు సార్వజనీన సామాజిక భద్రతకు బలమైన పునాదినిస్తాయన్నారు.
సకాలంలో వేతనాల చెల్లింపు, సురక్షిత పని ప్రదేశాలను కల్పించడంతోపాటు మన ప్రజలకు, ముఖ్యంగా నారీ శక్తి, యువ శక్తికి వేతన అవకాశాలకు బలమైన పునాదిగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది కార్మికుల హక్కులను పరిరక్షించే, భారతదేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది. ఈ సంస్కరణలు ఉద్యోగ సృష్టిని పెంచుతాయి. ఉత్పాదకతను పెంచుతాయి. వికసిత్‌ భారత్‌ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు