Homeకూటమి ‘స్థానిక’ రాజకీయం

కూటమి ‘స్థానిక’ రాజకీయం

- Advertisement -
  • తెరపైకి 2024 ఎన్నికల ఫార్ములా
  • టీడీపీ నుంచి జనసేనలోకి వంగవీటి రాధా
  • అప్పట్లో జనసేన, బీజేపీలోకి వలసలు
  • గెలుపు గుర్రాలే లక్ష్యంగా వ్యూహం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో కూటమి రసవత్తరమైన రాజకీయాలు, వ్యూహాలకు పదును పెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రయోగిస్తోందన్న ప్రచారముంది. తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ… జనసేనలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమయింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాధాకృష్ణ రాజకీయంగా ఆశించిన స్థాయిలో క్రియాశీలకంగా కనిపించకపోవడం, పార్టీలో ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యంపై అనుచర వర్గాల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్తో రాధాకృష్ణ భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. అంతకుముందు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ వరుస భేటీల అనంతరం జనసేనలో చేరికపై ప్రచారం ముందస్తుగానే ఊపందుకుంది. రాధా చేరిక ముందు విజయవాడ నగరంలో పెద్దఎత్తున జనసేన స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత వంగవీటి మోహన్ రంగా వారసుడిగా రాధాకృష్ణకు నగరంలో రాజకీయ ప్రాధాన్యం ఉంది. గతంలో రాధాకృష్ణ మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జనసేనలో చేరికపై ప్రచారం తెరపైకి రావడంతో ఆయనకు భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపైనా ఆసక్తి నెలకొంది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన తరపున విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీలో రాధాకృష్ణకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదనే అసంతృప్తి ఆయన అనుచర వర్గాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరిలో ఉందనే చర్చ సాగుతోంది. జనసేనలో చేరితే సామాజిక పరంగాను మరింత రాజకీయ ప్రాధాన్యం లభిస్తుందనే అంచనాతో ఆయన ఆ పార్టీ వైపు మొగ్గుచూపారనే ప్రచారం ఉంది. రాధాకృష్ణ పార్టీ మార్పు అంశాన్ని 2024 ఎన్నికల సమయంలో కూటమి అనుసరించిన రాజకీయ వ్యూహాలను మునిసిపల్ ఎన్నికల్లోనూ ప్రవేశపెడుతోంది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ నామినేషన్లకు ముందు ఆ పార్టీలో చేరడం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన సుజనా చౌదరి బీజేపీలో చేరి విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ బీజేపీ తరపున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీతో గతంలో రాజకీయ సంబంధాలున్న నిమ్మక జయకృష్ణ, అరవ శ్రీధర్ వంటి నేతలు జనసేన తరపున టికెట్లు పొందగా, ఎన్.ఈశ్వరరావు బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పరిణామాలు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న తీరును ప్రతిబింబిస్తున్నాయి. వంగవీటి రాధాకృష్ణతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ జనసేన పార్టీలో చేశారు. విజయవాడలో జనసేనకు రాజకీయంగా మరింత బలం చేకూర్చడం, కాపు సామాజిక వర్గంలో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడం, వంగవీటి కుటుంబానికి ఉన్న స్థానిక రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకోవడం వంటి అంశాలు ఈ చర్యకు నేపథ్యంగా కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ జనసేనలో చేరితే విజయవాడ మేయర్ ఎన్నికలతో పాటు ఆ పార్టీకి అదనంగా రాజకీయ బలం పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయవాడ మేయర్ పదవికి టీడీపీ పక్షాన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్ధార్థను అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టారు. దీంతో రాధాకృష్ణ జనసేనలో చేరడంతో… ఆయన గానీ, వంగవీటి కుటుంబం నుంచి గానీ మేయర్ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో వైసీపీ కైవసం చేసుకున్న విజయవాడ మేయర్ పీఠాన్ని ఈ సారి కూటమి పరం అయ్యేలా చాకచక్యంగా నేతలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరికకు బలం చేకూరుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు