చిట్టీత పండెరుపు చిలక ముక్కెరుపు పసిపాప నవ్వెరుపు పాల బుగ్గెరుపు
తొలిచూపు వలగొన్న ఎలనాగ చెక్కిట సిగ్గు దొంతరలెరుపు సిందూర మెరుపు
పగడాల దండెరుపు ప్రత్యూష మెరుపు రానున్న రేపెరుపు ప్రాణ కాంతెరుపు
మూడు లోకాలలో మూడు కాలాల నినదించు నిజమెరుపు నిండు మనసెరుపు
శ్రమ ఎరుపు క్షమ ఎరుపు శాంతి సుఖమెరుపు పాటుపడు వారి పోరాటాలు ఎరుపు
పాటుపడు వారి పోరాటాలలో నుంచి పైపైకి ఎగిరేటి బావుటా ఎరుపు …
…. ….. ….
ఆర్వీ రామారావు
గత గురువారం మొదలైన ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా ఖామేనీ అంతిమ యాత్రలో అసంఖ్యాకంగా కనిపించిన ఎర్ర జెండాలు చూస్తే ఆరు దశాబ్దాల కిందట “విశాలాంధ్ర”లో రాంభట్ల కృష్ణమూర్తి రాసిన ఈ పాట గుర్తొచ్చింది. ఆ సందర్భం వేరు కావొచ్చు. కానీ ప్రస్తుతం ఖామేనీకి కడసారి వీడ్కోలు పలికే సమయంలో అసంఖ్యాక జనం చేతుల్లో ఎర్ర జెండాలు కనిపించడంలో మర్మం ఏమిటి అని ఆలోచించాల్సిందే. ఏ లెక్కన చూసిన ఇరాన్ వామపక్ష భావజాలానికి చెందిన రాజ్యం కాదు. అది ఇస్లామిక్ రిపబ్లిక్. కానీ అంతిమ యాత్రలో అధిక సంఖ్యలో కనిపించింది మాత్రం ఎర్రజెండాలే. దాని మీద సుత్తీ కొడవలి లేవు. అంటే ఖామేనీ ఇరాన్ అగ్రనాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద ప్రజలకు అంతోఇంతో అసమ్మతి ఉన్న మాట వాస్తవమే. అదే అదునుగా ఇరాన్ ప్రభుత్వాన్ని పడదోయడానికి ఇస్రాయెల్ యుద్ధ పిపాసి నెతన్యాహూ పోరు పడలేక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనసాగించిన యుద్ధం అనూహ్యంగా ఇరాన్ ప్రజలను ఏకం చేసింది. ఇరాన్ వీధుల్లో రెపరెపలాడుతున్న ఎర్ర జెండా కమ్యూనిస్టు భావజాలంతో సంబంధం లేకపోవచ్చు. తమ నాయకుడు ఖామేనీని అంతం చేసిన యుద్ధోన్మాద ఇస్రాయెల్, అమెరికాకు బుద్ధి చెప్పడానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేయడానికి ఎర్రజెండానే సంకేతంగా నిలిచింది. ఇరాన్లో అరుణ పతాకం యుద్ధోన్మాదుల ప్రతీకారేచ్ఛకు ప్రతీక. ఖామేనీ వీరమరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక ప్రతీ ఇరానీ పౌరుడి గుండెలో రగులుతోంది. ఇరాన్లో ఎగురుతున్న ఎర్రజెండా ఇస్రాయెల్, అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక. అన్యాయంగా రుద్దిన యుద్ధాన్ని వ్యతిరేకిస్తామన్న రణన్నినాదం ఆ ఆరుణ పతాక. గత ఫిబ్రవరి 28న ఇస్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద ప్రారంభించిన యుద్ధం మొదటి రోజునే ఇరాన్ అగ్రనాయకుడు ఖామేనీ, ఆయన కుటుంబ సభ్యులు అనేకమంది అమరులయ్యారు. అందుకే ఎర్ర జెండాను ఇరాన్ ప్రజలు వీరమరణానికి ప్రతీకగా ఎన్నుకున్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్్న అలీ క్రీ.శ. 680లో అమరుడయ్యారు. ఆయనను షియాలు అమితంగా ఆదరిస్తారు. ఎర్ర జెండా ఇమాం హుసేన్ వీర మరణానికి ప్రతీక. ఖామేనీ వీరమరణం కూడా అలాంటిదేనని ఇరాన్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఇరాన్ అంతటా ఎర్రజెండా రెపరెపలు. ఇమాం హుసేన్ సమాధిపై ఇప్పటికీ ఎర్ర జెండా ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించడానికి, షియాల సమైక్యతకు ఎర్రజెండాను చిహ్నంగా భావిస్తారు. ఇరాన్లో కనిపిస్తున్న ఎర్రజెండాలు వీరమరణం పొందిన వారి కోసం ప్రతీకారం తీర్చుకోవడానికి సంకేతం. తమ నాయకులను ఎవరైనా అంతమొందించినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడానికి ఎర్రజెండా ఎగురవేస్తారు. అది వీరుల రక్త తర్పణానికి, రానున్న పోరాటానికి చిహ్నం. అన్యాయమైన యుద్ధంలో ఖామేనీ అమరుడై నాలుగు నెలలు దాటింది. కానీ యుద్ధం కొనసాగుతున్నందు వల్ల అంత్యక్రియల ప్రక్రియ గత శుక్రవారం (జులై 3న) మొదలైంది. వచ్చే గురువారం ఖామేనీని ఖననం చేయడంతో అంత్యక్రియల ప్రక్రియ ముగుస్తుంది. ఖామేనీ అంత్యక్రియల్లో దాదాపు రెండు కోట్ల మంది వీధుల్లోకి వచ్చారు. ఎక్కడ చూసినా కాలు మోపడానికి కూడా చోటు దొరకని పరిస్థితి. ఖామేనీ వ్యతిరేక ప్రదర్శనల్లో కూడా జనం భారీ సంఖ్యలో వీధులకెకాక్కరు. అప్పుడు నిరసన తెలిపిన వారి సంఖ్యకు ఇప్పుడు నీరాజనాలు అర్పిస్తున్న వారికి మధ్య పోలికే లేదు. ఇరాన్ మొదటి అగ్ర నాయకుడు అయతుల్లా రొహుల్లా ఖామేనీ అంతిమ యాత్ర 1989లోనూ భారీ సంఖ్యలో నివాళులర్పించడం అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు ఖామేనీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్న జనాన్ని లెక్కించడం కూడా కుదరదేమో! గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం అయిన రోజున, అంటే అయతుల్లా అలీ ఖామేనీ అమరుడైన రోజున కూడా పవిత్ర ఖోం నగరంలోని జంకరన్ మసీదులో అరుణ పతాకం ఆవిష్కరించారు. సంతాప దినాల సమయంలోనూ ఇరాన్‌లోని మొసల్లాలోనూ ఇంటింటా అరుణ పతాకాలు ఎగురవేశారు. ఈ అరుణ పతాకాలు కేవలం ప్రతీకారానికే చిహ్నం కావు. న్యాయానికి కూడా ఆశాకిరణాలే. ఈ పతాకం మీద అరబ్బీ భాషలో “యా-ల-తరత్ అల్-హుసేన్” (ఓ హుసేన్ మరణానికి ప్రతీకారం తీర్చుకునే వారులారా) అని రాసి ఉంటుంది. మృతవీరుల రక్త తర్పణానికి చిహ్నమైన ఎర్ర జెండాను మొహర్రం నెలలోనూ, అగ్ర నాయకులు వీరమరణం చెందినప్పుడో ఆవిష్కరిస్తుంటారు. అమెరికా వైమానిక దాడుల్లో జనరల్ ఖాసిం సులేమాని మరణించినప్పుడూ ఖోం నగరంలోని మసీదుపై అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా షియాల మసీదుల్లోనూ ఎర్ర జెండా ఎగురవేస్తూనే ఉంటారు. మత నియమాలను అనుసరించి అంత్యక్రియలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. కానీ యుద్ధ మేఘాలు ఆవరించినందు వల్ల ఖామేనీ పార్థివ శవాన్ని భద్రపరచవలసి వచ్చింది. నాలుగు నెలల నుంచి కడుపులో దాచుకున్న దు’ఖాన్ని ఇరాన్ ప్రజలు ఇప్పుడు బయటపెట్టుకుంటున్నారు. సమైక్యత చాటుకుంటున్నారు. ఇది ఇరాన్ ప్రపంచ చరిత్రలో లిఖించనున్న నూతన అధ్యాయం అవుతుంది.


