విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి : ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య- కృష్ణారెడ్డి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తిరుపతి కేంద్రంగా ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 24 రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున యువత రానున్నట్లు వివరించారు. విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై చర్చించి వాటి సాధనకు పోరాటాలు చేసేందుకు సన్నద్ధం కానున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్నట్లు వివరించారు. తొలి రోజు గురువారం సాయంత్రం స్థానిక బాలాజీ కాలని ఎస్వీ హైస్కూల్ నుంచి ఇందిరా మైదానం వరకు భారీ ప్రదర్శన… బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. పెద్ద ఎత్తున యువత హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ, జాతీయ మాజీ కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర, సహాయ కార్యదర్శి రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొన్నారు.