. ఐదేళ్లు, ఎనిమిదేళ్లు పూర్తయిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు తప్పనిసరి
. మే 31 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి
విశాలాంధ్ర బ్యూరో- ఏలూరు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించి బదిలీల ముసాయిదా వెలువరించింది. ఏటా వేసవిలో మాత్రమే బదిలీలు నిర్వహించే విధంగా ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపల్ మేనేజ్‌మెంట్ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన టీచర్ల బదిలీలు జరుగుతాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్‌లు, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ విశాఖ పరిధిలో కూడా బదిలీలు జరుగుతాయి. జూన్ ఒకటో తేదీ నుంచి మే 31 వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఏడాదిలో ఒక స్కూల్లో తొమ్మిది నెలలు సర్వీసు పూర్తి అయితే అకడమిక్ ఇయర్ సర్వీసు పూర్తి అయినట్లే లెక్క. డ్రాయింగ్, క్రాఫ్ట్, ఒకేషనల్ ఉపాధ్యాయులకు తప్ప మిగిలిన హెచ్‌ఎంలకు, టీచర్లకు ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. క్యాటగిరి 4, 3, 2, 1లో ప్రమోషన్లు ,అపాయింట్మెంట్ల సంఖ్యకు సమానంగా ఖాళీలను చూపుతారు. బదిలీ దరఖాస్తుకు కనీసం రెండు సంవత్సరాలు ఆ పాఠశాలలో పనిచేసి ఉండాలి.హెచ్‌ఎం లకు ఐదు, ఉపాధ్యాయులకు ఎనిమిది అకడమిక్ సంవత్సరాలకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గవర్నమెంట్ బదిలీలపై వచ్చిన వారికి పాత, కొత్త రెండు స్కూళ్లు కలిపి గరిష్ట సర్వీస్ నిర్ణయిస్తారు. విడో, డివోర్స్ మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, మిలటరీ స్పోజ్, 70 శాతం లోపు పీిహెచ్ వారికి బదిలీల్లో పాయింట్లు మాత్రమే ఉంటాయి. వారు ప్రత్యేక కేటగిరీలోకి రారు. కేవలం వ్యాధులు ఉన్నవారు, 70 శాతం పైగా పీహెచ్ ఉన్నవారికి, వ్యాధిగ్రస్తులైన పిల్లలు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక క్యాటగిరి వర్తిస్తుంది. స్పౌజ్, ఎన్‌సీసీ, స్కౌట్స్, యూనియన్ ఆఫీస్ ఉమ్మడి జిల్లా ఆఫీస్ బేరర్లకు ప్రత్యేక పాయింట్లు కేటాయిస్తారు. న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు. ప్రిఫరెన్షియల్ క్యాటగిరిలో ఉన్న ఎస్‌జీటీలలో ఒక స్కూల్లో 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లలో సబ్జెక్టు 50 శాతం పోస్టులు మాత్రమే ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ ఉపాధ్యాయులకు కేటాయిస్తారు. సింగిల్ సబ్జెక్టు టీచర్స్ మాత్రమే ఉన్న హైస్కూల్లో ఖాళీలను ప్రత్యేక క్యాటగిరి వారికి కోరుకునే అవకాశం ఇవ్వరు. క్యాన్సర్ ,ఓపెన్ హార్ట్ సర్జరీ, అవయవ మార్పిడి, మేజర్ న్యూరో సర్జరీ , బ్యాంక్ టీబీ, శారీరక వైకల్యం అంటే దృశ్యపరంగా సవాల్ చేయబడిన లేదా ఆర్థోపెడికల్ చాలెంజ్డ్, వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 80 శాతం కంటే ఎక్కువ లేదా సమానం వికలాంగత్వం ఉండటం, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, డయాలసిస్, వెన్నెముక శాస్త్ర చికిత్స, చేయించుకున్న వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వస్తారు. అలాగే మానసిక వికలాంగులు, చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు జీవిత భాగస్వామితో ఉన్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, జువైనల్ డయాబెటిస్, తల సేమియా వ్యాధి, హిమోఫిలియా వ్యాధి, మస్క్యులర్ డిసీజెస్, కండర క్షీణత తో బాధపడుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు కలిగిన టీచర్లు అర్హులు.
అర్హత పాయింట్లు ఇవే …
మే 31 నాటికి అన్ని క్యాడర్‌లలో కలిపి సంవత్సరం సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక పాయింట్ ఇవ్వబడుతుంది.స్టేషన్ పాయింట్లకు సంబంధించి… కేటగిరి-1 ప్రాంతం ఒక పాయింటు, కేటగిరి-2 ప్రాంతం రెండు పాయింట్లు, కేటగిరి-3 ప్రాంతం మూడు పాయింట్లు, కేటగిరి-4 ప్రాంతం నాలుగు పాయింట్లు ఇస్తారు.. రేషనలైజేషన్ ఏప్రిల్ 24-28, ఖాళీల ప్రదర్శన ఏప్రిల్ 29, బదిలీల ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి మే మూడో తేదీ వరకు జరుగుతుంది. హెచ్‌ఎం లకు ఏప్రిల్ 16 నుంచి 20, స్కూల్ అసిస్టెంట్లకు మే 26 నుంచి 30 తేదీలలో ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు కల్పిస్తారు. అనధికారికంగా గైర్హాజరయితే క్రమశిక్షణ చర్యలు కింద ప్రతి నెలకు గరిష్టంగా 10 పాయింట్లకు ఒక పాయింట్ తీసివేయబడుతుంది. అనధికార గైర్హాజరుకు ప్రతికూల పాయింట్లు ఇవ్వబడతాయి. ఉపాధ్యాయుల బదిలీ చట్టం -2025 పాఠశాల విద్యాశాఖ కింద నడుస్తున్న మేనేజ్‌మెంట్లు, సంస్థలు, సొసైటీలకు వర్తించదు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధిత సొసైటీ బైలాస్ వర్తిస్తాయి.
పాఠశాలల్ని బలహీనపరిస్తే సహించం: ఉపాధ్యాయ సంఘాలు
మోడల్ ప్రైమరీ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలలను బలహీన పరిస్తే సహించేది లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘాలతో చర్చించినప్పుడు ఒకలాగా, ముసాయిదా ప్రకటించినప్పుడు మరొకలా వ్యవహరిస్తే తల్లిదండ్రులు ఎస్‌ఎంసీలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలో ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండేలా మోడల్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.