టెట్ అర్హత లేకుండానే ఎస్జీటీ పోస్టు
కర్నూలు జిల్లాలో బయటపడ్డ సంచలన ఉదంతం
క్రీడా కోటా నియామకాలపై అనుమానాలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: కర్నూలు జిల్లాలో డీఎస్సీ క్రీడా కోటాలో టెట్‌లో అర్హత సాధించలేని ఓ అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టు కట్టబెట్టిన ఉదంతం…దానికి సంబంధించిన పత్రాలు మీడియా ద్వారా వెలుగు చూడటం కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారింది. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వైసీపీ, నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించడంతోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాజాగా కర్నూలు జిల్లా వల్లూరులో డీఎస్సీ క్రీడా కోటా నియామకానికి సంబంధించి ఓ అభ్యర్థి వ్యవహారం వెలుగులోకి రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కర్నూలు జిల్లాలో దాదాపు 1,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా… అందులో చాలా వరకు ఎస్జీటీ పోస్టులను క్రీడా కోటాలో భర్తీ చేసినట్లు సమాచారం. డీఎస్సీ-2025లో క్రీడా కోటా కింద ఎస్జీటీ పోస్టుకు ఈదిగ ప్రభాకర్ ఎంపికపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఎస్జీటీ పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన నిబంధనలు కీలకంగా ఉంటాయి. సాధారణంగా అభ్యర్థి ముందుగా ఇంటర్మీడియట్ విద్యను, అనంతరం డీఎడ్ వంటి నిర్దేశిత ఉపాధ్యాయ శిక్షణ కోర్సును పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టు కోసం టెట్ పేపర్-1 (ఏ)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ అర్హతలను పూర్తి చేసిన అభ్యర్థులే సంబంధిత డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించిన మార్కులు, వెయిటేజీ, రిజిస్ట్రేషన్ నంబరు, అర్హత వివరాలు దరఖాస్తులో పొందుపరచాలి. ఎస్జీటీ విభాగానికి చెందిన టెట్‌లో అర్హత సాధించకుండానే ప్రభాకర్ డీఎస్సీ క్రీడా కోటా ద్వారా ఎస్జీటీ పోస్టుకు ఎలా ఎంపికయ్యారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. బీసీ కేటగిరీకి చెందిన ప్రభాకర్ కేవలం డీఎడ్ మాత్రమే పూర్తి చేసినట్లు మీడియాలో ఆయన ధ్రువీకరణ పత్రాలు వెలుగు చూశాయి. ఎస్జీటీ ఉద్యోగం వచ్చాక…2025లో మరోసారి టెట్ పరీక్షలకు హాజరైనప్పటికీ అర్హత సాధించలేదని తెలిసింది. టెట్‌లో ఎస్సీలకు 60, బీసీలకు 75, ఓసీలకు 90 మార్కులు అర్హతగా నిర్ణయించారు. బీసీ కేటగిరీకి చెందిన ప్రభాకర్‌కు టెట్‌లో 75 మార్కులు రావాలి. ప్రభాకర్ రాసిన టెట్ పరీక్షల్లోనూ 65 మార్కులకు మించి ఎప్పుడూ సాధించలేదని తేలింది. దీనిపై ఓ ఛానల్ ప్రతినిధులు ప్రభాకర్‌ను ఫోన్లో సంప్రదించి వివరణ కోరగా… తాను డీఎడ్ పూర్తి చేయకముందే 2018లో టెట్ అర్హత సాధించినట్లు చెబుతున్నారు. ఈ సమాధానం కూడా ఇప్పుడు అనేక సందేహాలకు కారణమవుతోంది. ఎందుకంటే టెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి తాను పూర్తి చేసిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వివరాలను నమోదు చేయాలి. బీఈడీ, డీఎడ్, భాషా పండితులు, పీఈటీ, బీపీఈడీ తదితర నిర్దేశిత ఉపాధ్యాయ శిక్షణ కోర్సులకు సంబంధించిన అర్హత ఆధారంగానే టెట్ దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అదే విధానంతోనే ఆయా టెట్ పేపర్లలో ఉత్తీర్ణులైన వారు…డీఎస్సీలో అదే విభాగం పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులవుతారు. ఈ వివరాల్ని పరిశీలిస్తే…ప్రభాకర్ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనీ, ఇంకా అదే కోవలో అనేక మంది ఉంటారనే అనుమానాల్ని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు లేవనెత్తుతున్నారు.ప్రభాకర్ 2022 జూన్‌లో కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ డీఎడ్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఐఈడీ)/డీఎడ్ పూర్తి చేసిన ధ్రువీకరణ పత్రం మీడియా ముంగిటకు వచ్చింది. ఆయన 2018-2020 విద్యా సంవత్సరంలో డీఎడ్ కోర్సు చదవగా, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్, అమరావతి పేరుతో జారీ చేసిన సర్టిఫికెట్‌కు సీరియల్ నంబర్ 10689గా ఉంది. ఒక వేళ 2018లో ఆయన పీఈటీ విభాగంలో టెట్ క్వాలిఫై అయితే…2025 డీఎస్సీలో ఆయన పీఈటీ ఉద్యోగానికే దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనీ, ఎస్జీటీ పోస్టు ఎలా కేటాయిస్తారనే ప్రశ్నలు ఉన్నాయి. ఈయన పనిచేసే పాఠశాల సర్వీసు రిజిష్టరు (ఎస్ఆర్)లో ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదని రాసినట్లుగా సమాచారం. కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారులు అధికారులు రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోటీ ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభాకర్ స్పోర్టుస్ కోటాకు సమర్పించిన పత్రాలపైనా అనేక అనుమానాలున్నాయి.
ఎస్జీటీ పోస్టుకు టెట్‌లో అర్హత సాధించాల్సిందే: కర్నూలు డీఈఓ సుధాకర్
కర్నూలు జిల్లా డీఈవో సుధాకర్ స్పందిస్తూ… ప్రభాకర్‌కు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం వచ్చినప్పటికీ, సంబంధిత విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్లో నిర్దేశించిన మార్కుల శాతం సాధించడం, అనంతరం డీఎడ్ పూర్తి చేయడం, తదుపరి టెట్‌లో అర్హత సాధించడం వంటి నిబంధనలను అభ్యర్థి పూర్తి చేసి ఉండాల్సిందేనని తెలిపారు. ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదన్న ఆరోపణలపై సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా పూర్తి వివరాలు, రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తామని డీఈవో తెలిపారు. డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీగా ప్రభాకర్ నియామకానికి సంబంధించిన విద్యార్హతలు, టెట్ అర్హత, దరఖాస్తు వివరాలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, సెలక్షన్ వెరిఫికేషన్ రికార్డులు, నియామక సమయంలో అధికారులు పరిశీలించిన పత్రాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం బుకాయిస్తున్న తరుణంలో..తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. మంత్రి నారా లోకేశ్ స్వయంగా అక్రమాలపై ఆధారాలతో చర్చకు రావాలని సవాల్ చేసిన నేపథ్యంలో… ప్రభాకర్ నియామకంపైన, ఆయన విద్యార్హతలు, టెట్ రికార్డులు, డీఎస్సీ దరఖాస్తు వివరాలు, స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతున్నారు.


