Homeతెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు?

తెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు?

- Advertisement -

ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమా?
భాషాభిమానుల్లో అసంతృప్తి

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ ప్రభుత్వం తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ)లు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించి ఏడాది గడుస్తున్నా… ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ, ఆ దిశగా అధికార యంత్రాంగం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ప్రస్తుతం హోం శాఖ పేరోల్‌కు సంబంధించిన కొద్ది జీఓలు మాత్రమే తెలుగులో విడుదలవుతున్నాయి. మిగిలిన అన్ని శాఖల ఉత్తర్వులు యథావిధిగా ఇంగ్లిష్‌లోనే వెలువడుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ప్రకటనలు, నిర్ణయాలు సామాన్య ప్రజలకు పూర్తిగా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర అధికార భాషగా గుర్తింపు ఉన్న తెలుగును పక్కనపెట్టి ఇంకా ఇంగ్లిష్‌కే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై తెలుగు భాషాభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు గౌరవం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో చేసి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు అమలవ్వకపోతే, భవిష్యత్తులో అధికార భాష పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది జనవరి నెలలోనే కూటమి ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు ఇవ్వాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. ముందుగా జీఓ ఇంగ్లిషులో విడుదల చేసిన తర్వాత రెండు రోజుల్లో తెలుగు కాపీని అప్ లోడ్ చేయాలని, లేదా ముందుగా తెలుగులో జీవో విడుదల చేసి ఆ తర్వాత రెండు రోజుల్లో ఇంగ్లీషు భాషలోని జీవో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులో పేర్కొంది. ఆ క్రమంలో జీవోల వెబ్ సైట్‌లో తెలుగు జీవో కాలమ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ీVAంశాఖ తొలి తెలుగు జీవోను పెరోల్‌కు సంబంధించింది విడుదల చేసింది. అప్పటి నుంచి పెరోల్ జీవోలు మాత్రం తెలుగులో విడుదల అవుతున్నాయి కానీ ఇతర శాఖలకు సంబంధించి ఏ జీవోలు తెలుగు భాషలో విడుదల కావడం లేదు. ఇప్పటికైనా అన్ని శాఖల జివోలు తెలుగులో విడుదలయ్యేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు అవి అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు