ఆరేళ్ల బుడ్డోడి అరెస్ట్!
నడిరోడ్డుపై లాక్కెళ్లారు
అరడజను మంది పోలీసోళ్లు
ఇది కదా
బిహార్ డబలింజన్ సర్కార్
భయానికి పరాకాష్ట
బి పి ఎస్ సి ప్రవేశ పరీక్షల
అవకతవకలపై
పాట్నా విద్యార్థుల నిరసన ర్యాలీ
అందులో పాల్గొన్నాడు
ఓ ఆరేళ్ల విద్యార్థి బుడతడు
మోదీ దిగిపో!
అని రాసున్న ప్లకార్డు
పట్టుకున్నాడు వాడు
అంతే… అందుకే…
ఆ బుడ్డోడి అరెస్ట్!
‘మా బళ్లో పంతుళ్లు సరిగా లేరు
వసతులూ అంతంతమాత్రమే
నేను పరీక్షలు రాసేటప్పటికి
అవకతవకలు లేని
పరీక్షా పద్ధతి రావాలనే నేనిలా…
అంటున్నాడా బాలుడు ప్రెస్సోళ్లతో
నేరస్తుల్ని పట్టుకొని
అరెస్టు చేయలేరు
నాపై చేయిచేసుకొంటారా!
అరెస్టు చేస్తారా!?’
పోలీసోళ్లని నిలదీశాడు
ఆ బుడతడు
ఇక భయం లేదు
నా దేశంలో ప్రశ్న బతుకుతుంది.
తనకు తాను సవరించుకొంటోంది
ధిక్కార స్వరం.
చరమ ఘట్టమిది!
ఇక నే చెప్పిందే శాసనం
మరి నే చేసిందే చట్టం
అనే అహంకార పాలకులకు
- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ


