Friday, May 9, 2025
Homeఎస్సీ వర్గీకరణకు సై

ఎస్సీ వర్గీకరణకు సై

. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా అమలు
. 2026 సెన్సెస్‌ తర్వాత జిల్లాల వారీ యోచన
. చేనేతలకు ఉచిత విద్యుత్‌
. రాజధానిలో భూకేటాయింపులకు ఆమోదం
. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై ఆయా వర్గాలకు చెందిన మంత్రుల సూచనలను సీఎం తీసుకున్నారు. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్‌ చర్చించింది. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్‌ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్‌గా చేయాలని కొంతమంది మంత్రులు కోరారు. అలా చేస్తే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నివేదికను యధాతధంగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రూప్‌ 1 కేటగిరిలో రెల్లి ఉపకులాలకు ఒక శాతం, గ్రూప్‌ 2లో మాదిగ ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్‌ 3 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా అమలు జరపాలని నిర్ణయించారు. రోస్టర్‌ పాయింట్లను 200గా ప్రభుత్వం నిర్ణయించింది. బేడ బుడగ జంగాలను రెల్లి ఉప కులాల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్‌కు తీర్మానాన్ని పంపించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. 2026 సెన్సెస్‌ రాగానే జిల్లాల వారీగా అమలు జరిపే అంశాన్ని పరిశీలిద్దామని సీఎం చెప్పారు. ఈ నెలలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. అదే రోజు తీర్మానాన్ని నేషనల్‌ ఎస్సీ కమిషన్‌కు పంపాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్‌ వర్సిటీ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూకేటాయింపులకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ తాడిగడప పురపాలిక పేరును తాడిగడపగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాను వైఎస్సార్‌ జిల్లాగా వైసీపీ ప్రభుత్వం మార్పు చేయగా, ప్రస్తుతం దాని పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చాలని మార్పు చేసింది. సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్‌కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మంగళవారం చంద్రబాబు దిల్లీ పర్యటన నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు