ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యక్షడితో భారత ప్రధాని భేటీ
బిష్కెక్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రాంతంలో నౌకాయానం, వాణిజ్యానికి స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. సోమవారం కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో జరిగిన భేటీలో మోదీ ఈ అంశాలను ప్రస్తావించారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, పెజెష్కియాన్ ముఖాముఖిగా సమావేశం కావడం ఇదే తొలిసారి. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు, ఎస్సీఓ ప్లస్ సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. మోదీతో పెజెష్కియాన్ సమావేశం ఫలప్రదంగా సాగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై నేతలు చర్చించినట్లు పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలోని తాజా పరిణామాలను సమీక్షించినట్లు వెల్లడించింది. “అన్ని సమస్యలూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలి” అన్నది భారత్ స్థిరమైన వైఖరి అని మోదీ పునరుద్ఘాటించినట్లు ఎంఈఏ తెలిపింది. శాంతి, సుస్థిరత కోసం నిరంతర ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారని…నౌకాయానం, వాణిజ్యానికి స్వేచ్ఛను కాపాడటం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నట్లు వెల్లడించింది.
భారత్`ఆర్మేనియా చర్చలు
అంతకుముందు మోదీ అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రక్షణ, ఆర్థిక, ఔషధ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. పశ్చిమాసియాలో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్-అర్మేనియా సంబంధాలను మరింత లోతుగా, విస్తృతంగా తీసుకెళ్లేందుకు అర్మేనియాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ పునరుద్ఘాటించారు.
యుద్ధాన్ని కోరుకోవడం లేదు: పెజెష్కియాన్
బిష్కెక్ బయలుదేరే ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. అయితే తమపై ఎలాంటి దాడి జరిగినా బలంగా, దృఢ సంకల్పంతో స్పందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత అన్ని దేశాల ప్రయోజనాలకు హానికరమని పేర్కొన్నారు. ఆర్థిక, భద్రతా లక్ష్యాల సాధనకు దేశాల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు.
పశ్చిమాసియా సంక్షోభానికి చర్చలే పరిష్కారం: మోదీ
- Advertisement -
RELATED ARTICLES


