ఏపీలో బయటపడిన భారీ కుట్ర
విశాఖ కేంద్రంగా గూఢచర్యం : ఇద్దరి అరెస్ట్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీలో గూఢచర్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఆపరేషన్ ఫైర్‌వాల్‌తో భారీ కుట్ర బయటపడింది. పాకిస్థాన్‌కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (ఏపీ సీఐ) ఛేదించింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ పేరిట ఏపీ సీఐ సెల్ సంచలన ఆపరేషన్ చేపట్టింది. 13 మంది నావికాదళ సిబ్బంది సహా 18 మందిపై నిఘా ఉంచింది. అత్యంత గోప్యంగా వ్యూహాన్ని అమలు చేసింది. ఈ నెల 1న 12 ప్రత్యేక బృందాలతో మెరుపుదాడి చేసింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా సోదాలు చేసి ఇద్దరిని అరెస్టు చేసింది. విచారణలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బహిర్గతమయ్యాయి. విశాఖపట్నం కేంద్రంగా గూఢచర్యం కొనసాగినట్లు ఏపీ సీఐ సెల్ గుర్తించింది. సమాచారాన్ని ఎన్క్రిప్టెట్ సాఫ్ట్వేర్ ద్వారా శత్రు దేశానికి ఈ నెట్వర్క్ చేరవేస్తున్నట్లు కనిపెట్టింది. దీనిపై విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పీఎస్‌లో 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 147, 148 రెడ్‌విత్ 3(5) తో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్లు 17, 18 కింద కేసు నమోదు చేశారు. అధికారిక రహస్యాల చట్టం 1923 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత… ఇద్దరి అరెస్ట్
ఏపీ కౌంటర్ ఇంటెలిజన్స్‌కు చెందిన 12 బృందాలు ఏపీ, కేరళం, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, దిల్లీ, తమిళనాడు, చత్తీస్‌గఢ్, బీహార్‌లో ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరిట దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డబ్బు కోసం పాకిస్థాన్‌కు రహస్య సమాచారం అందిస్తున్న నేవీ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకు న్నారు. అలాగే విశాఖ నేవల్ బేస్ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటెలిజన్స్ బృందాలు అరెస్టు చేశాయి. కోయంబత్తూర్‌లో ప్రదీప్ ముఖర్జీని అరెస్టు చేసిన అధికారులు, మంగళవారం వారిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసేం దుకు వాట్సాప్ యాకిట్వేట్ చేయడానికి ఓటీపీ షేర్ చేసి సున్నితమైన సమాచారం అందిస్తున్నారని దర్యాప్తులో వెల్లడయింది. ఈ క్రమంలో ప్రదీ ప్నకు ఈ నెల 14 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అరెస్టయి న వారి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.


