Homeఆంధ్రప్రదేశ్పాలకుల ప్రోత్సాహంతోనేసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి

పాలకుల ప్రోత్సాహంతోనేసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి

- Advertisement -

రెవెన్యూ వ్యవస్థలో అక్రమాల దందా
సీఎం కంటితుడుపు వ్యాఖ్యలు: ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పాలకుల ప్రోత్సాహంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో అవినీతి వేళ్లూనుకు పోయిందని, రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకల వల్ల ఈ కార్యాలయాల్లో అవినీతి దందా కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ప్రభుత్వానికి తెలియనిది కాదనీ, పాలకుల ప్రోత్సాహంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నేతలు, కొంతమంది స్థానిక శాసనసభ్యులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా అవినీతిని పెంచిపోషిస్తున్నట్లు ఇటీవల కాలంలో ఉత్పన్నమైన ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. అంతేకాకుండా అవినీతికి పాల్పడుతున్న సబ్‌ రిజిస్ట్రార్ల వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ప్రత్యక్షంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమని తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకు అవినీతి విలయతాండవ చేయడం వాస్తవమని, ముఖ్యమంత్రి సైతం ఈ అవినీతి కార్యకలాపాలను చూసీచూడనట్లు ఉండటం వల్లే ఇంత భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. అవినీతిపర్వంపై సీఎం చంద్రబాబు కంటితుడుపు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అధికారంలో ఎవరున్నా…అవినీతి సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు. అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో నియామకానికి, బదిలీలకు లక్షలాది రూపాయలు లంచాల రూపంలో ముట్టజెప్పిన ఘటనలు కోకొల్లలని తెలిపారు. అందుకుగాను కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రముఖపాత్ర వహిస్తున్నారన్న విషయం జగమెరిగిన సత్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా భూ అక్రమాలు వెలుగుచూశాయని, ఇంకా చూస్తున్నాయని వివరించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 294 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయని, రెండు రోజుల నుంచి ఏసీబీ అధికారులు 12 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా… కొన్నిచోట్ల లెక్క చూపని నగదు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారని, డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి నగదు పంపిణీ అవుతున్నట్లు ఏసీబీ గుర్తించిందని రెవెన్యూమంత్రి చెప్పడం గమనార్హమని తెలిపారు. ఏసీబీ దాడులు మొక్కుబడి కాకూడదని, అవసరమైతే మరో ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేయాలని కోరారు. అవినీతిని, అక్రమాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేలను, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న కొంతమంది మంత్రులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు