- నిబంధనలకు పాతర
- విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలో ఇష్టారీతిగా హాస్టళ్ల నిర్వహణ
- ఇరుకు గదులు, అపరిశుభ్ర ఆహారం
- అనారోగ్యం పాలవుతున్న యువత
- అధికారుల మొద్దు నిద్ర
విశాలాంధ్ర -సచివాలయం: విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్ల దందా అడ్డూ అదుపు లేకుండా విస్తరిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన అనుమతులు లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తూ నిర్వాహకులు కాసులు దండుకుంటున్నారు. గాలి వెలుతురు సరిగారాని గదులు, అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్న ఆహారం, అత్యవసర సమయాల్లో బయటపడేందుకు దారిలేని భవనాల్లో యువత ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తోంది. పీజీల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అధికారులు నిద్రమత్తు వీడకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడు తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఊపందుకోవడం, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల్లో పేరొందిన సంస్థలు పెట్టుబడులు పెడుతూ వ్యాపార, ఐటీ, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది యువతీ యువకులు ఉపాధి కోసం పట్టణ బాట పడుతున్నారు. వీరంతా నగరాల్లో సొంతంగా ఇళ్లను అద్దెకు తీసుకుని నివాసం ఉండే పరిస్థితులు లేవు. అందుకే తక్కువ అద్దెకు, వసతితో పాటు భోజనం లభిస్తుందనే కారణంతో పీజీలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రముఖ విద్యా సంస్థలు, ఐఐటీ, విట్ వంటి క్యాంపస్‌లు ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. కళాశాలల్లో హాస్టల్ వసతి అందుబాటులో ఉన్నప్పటికీ, కొంతమంది విద్యార్థులు ప్రైవసీ కోరుకుంటూ బయట ప్రైవేటు పీజీల్లో ఉండేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నగరాల్లో కోచింగ్ సెంటర్లు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. వీటికి వచ్చే నిరుద్యోగుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో పీజీల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా విస్తరించడానికి ప్రధాన కారణమైంది.
చాపకింద నీరులా హాస్టళ్ల దందా
పెరిగిన ఈ డిమాండ్‌ను వ్యాపార ఆసరాగా చేసుకుని చాలామంది నిర్వాహకులు పాత భవనాలు, అపార్ట్మెంట్ ప్రాంగణాలను అద్దెకు తీసుకుని ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా పీజీలుగా మార్చేస్తున్నారు. కనీస ప్లాన్ ఆమోదం లేని భవనాల్లో కూడా ఎన్ఓసీలు లేకుండా వ్యాపారం సాగిస్తున్నారు. అగ్నిమాపక భద్రత అసలే లేని ఇరుకు సందుల్లో ఈ హాస్టళ్లు వెలుస్తుండటంతో స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పీజీలు, ప్రైవేటు హాస్టళ్లు నిర్వహించాలంటే స్థానిక పురపాలక, పంచాయతీ సంస్థల లైసెన్సుతో పాటు పోలీస్, అగ్నిమాపక (ఫైర్) శాఖల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలి. భోజన వసతి కల్పిస్తున్నందున ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతి, శాంతిభద్రతల రక్షణ కోసం ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల హాస్టళ్లు అయితే జిల్లా కలెక్టర్ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ నియమ నిబంధనలేవీ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరిన భవనాల్లో సైతం పరిమితికి మించి విద్యార్థులను, ఉద్యోగులను చేర్చుకుంటున్నారు. ఒకే చిన్న గదిలో ఐదుగురి నుంచి ఆరుగురిని కుక్కుతూ అధిక మొత్తంలో అద్దెలు వసూలు చేస్తున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో, ఈగలు వాలే మురికి కూపాల్లాంటి వంటశాలల్లో భోజనాలు తయారు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు, విద్యార్థినుల హాస్టళ్ల వద్ద కనీస సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించడం లేదు. సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం, హాస్టళ్లలోకి అపరిచితుల రాకపోకలను అడ్డుకునే వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థినుల భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారుతోంది. అర్ధరాత్రి వేళల్లో భద్రతా లోపాల కారణంగా విద్యార్థినులు భయాందోళనల మధ్య గడపాల్సి వస్తోంది. పెరుగుతున్న నగర అవసరాల దృష్ట్యా పీజీల ఏర్పాటు వాంఛనీయమే అయినప్పటికీ, నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భద్రతా లోపాల వల్ల ఏదైనా చిన్న ప్రమాదం అనరœం జరిగితే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు తక్షణమే నిద్రమత్తు వీడి స్పందించి, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పీజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని వాటిని సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


