. వామపక్ష, లౌకికపార్టీలు ఐక్యతతో ముందుకు…
. మోదీ, అమిత్ షా, జగన్ దుష్ట సంప్రదాయాలు
. సీపీఐ కార్యదర్శి నారాయణ
. అప్పులపై శ్వేతపత్రం ఇవ్వండి: రామకృష్ణ
విశాలాంధ్ర-విజయవాడ (చిట్టినగర్) : మోదీ సర్కారు విచ్ఛిన్న విధానాల నుంచి దేశాన్ని కాపడుకుంటామని సీపీఐ కార్యదర్శి డా.కె.నారాయణ స్పష్టంచేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని, అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు మంచి మిత్రుడని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం, చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించానని ట్రంప్ పేర్కొనడం చూస్తే ఇద్దరూ అవినీతిపరులని స్పష్టమవుతోందన్నారు. ఆధారాలతో చేసే ఆరోపణలకు, ఉద్దేశపూర్వకంగా చేసే ఆరోపణలకు తేడా ఉంటుందని, గుజరాత్ అల్లర్లపై దుష్ప్రచారం చేసినా తాము అధికారంలోకి వచ్చామని, కోర్టులు సైతం నేరాలను నిరూపించలేదని మోదీ చెబుతున్నారని గుర్తుచేశారు. గోద్రా ఘటనలో మైనార్టీల ఊచకోత, అల్లర్లకు భయపడి నాడు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసిన విషయం ప్రపంచమంతా గుర్తించిందని నారాయణ చెప్పారు. గోద్రా అల్లర్ల నుంచి సాంకేతికంగా తప్పించుకున్నా… మోదీ ముమ్మాటికీ ముద్దాయేనన్నారు. తనకు తాను పవిత్రుడిగా మోదీ చెప్పుకున్నా నమ్మేవారు లేరన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం అనేక నేరాలకు పాల్పడ్డారని, ఆయనకు సంబంధించిన కేసుల్లో న్యాయవాది, సాక్షులు 12 మంది హత్యకు గురైన విషయం ప్రపంచానికి విదితమేనన్నారు. సాక్షులను మాయం చేసినంత మాత్రాన నేరస్తులు కాకుండా పోతారా అని ప్రశ్నించారు. జగన్ వ్యవహార శైలి కూడా అదేనని, బహుశా ఆయన అమిత్ షా సలహా తీసుకొని ఉంటాడని అన్నారు. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోవడాన్ని నారాయణ ప్రస్తావించారు. మోదీ, అమిత్ షా, జగన్ దుష్ట సంప్రదాయానికి పాల్పడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అన్ని భాషల ప్రజలు భాగస్వాములయ్యా రన్నారు. బౌద్ధులు, సిక్కులు, జైనులు తక్కువ శాతంగా ఉన్నా… మైనార్టీ, మెజార్టీ అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. కానీ సమాఖ్య వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రమాదం కలిగేలా ‘మెజారిటీ’ నినాదాన్ని మోదీ సర్కారు ముందుకు తెస్తోందని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానంపై స్పందిస్తూ ఎవరైనా… ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని, పీవీ నరసింహారావుకు 18 భాషలు వచ్చని, వామపక్ష నేత సీతారాం ఏచూరికి 12 భాషలు వచ్చని గుర్తు చేశారు. భాషల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి సాధించలేవన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇష్టంలేని భాషను రుద్దవద్దని నారాయణ హితవు పలికారు. డీలిమిటేషన్ వివాదాన్ని ప్రస్తావిస్తూ… జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొన్ని రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గుతుందన్నారు. నాడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎక్కువమంది పిల్లలను కనమని చెబుతున్నారని, మహిళలు పిల్లలను కనే యంత్రాలుగా భావించొద్దని హితవు పలికారు. చర్చల ద్వారా నక్సలిజం సమస్యకు పరిష్కారం కనుగొనాలని, భౌతికంగా అంతం చేయడం సరికాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలివితేటలు అసంబద్ధ సనాతనవాదం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగిస్తే మంచిదని సూచించారు. లౌకికవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై సీపీఐ జాతీయమహాసభల్లో చర్చిస్తామన్నారు. వామపక్ష, లౌకిక పార్టీల ఐక్యత బలోపేతం అవసరమన్నారు.
రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు దిల్లీ వెళ్లి మోదీని ఆర్థిక సహాయం కోరటంలో తప్పు లేదన్నారు. అదేసమయంలో రాజధాని అమరావతికి ఇస్తున్న నిధులు గ్రాంటుగా ఇస్తున్నారా లేక అప్పుగా ఇస్తున్నారో స్పష్టంచేయాలని చంద్రబాబును ప్రశ్నించారు. హడ్కోతో రూ.11 వేల కోట్ల రుణానికి సంబంధిచిన ఒప్పందంపై ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం జరిగిందని, ఏడీబీ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారని, వీటి సంగతేమిటని నిలదీశారు. వీటి ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సైతం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని రామకృష్ణ విమర్శించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రూ.3 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు చెప్పారని, ఆ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. గత ప్రభుత్వం అప్పులు, 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత ఇవ్వాలని, శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టత రావట్లేదని, ప్రైవేటీకరణ కాకుండా స్వయంగా ప్రధాని మోదీతో చెప్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొన్నారు.