డా. ఎన్. ఈశ్వరరెడ్డి
ప్రశ్నే ప్రగతికి తొలి అడుగు
ప్రశ్నే జగతికి తొలి వెలుగు
ప్రశ్నే తాత్విక రహదారి – అది
రుజు మార్గానికి జయభేరి
ఆకాశం వైపు చూసి ఏముందని అడిగితే
అంతరిక్ష రహస్యాల గవాక్ష±లు తెరిచింది
పండెందుకు నేల మీద రాలిందని అడిగితే
భూమ్యాకర్షణ సూత్రం శాస్త్రానికి దొరికింది
వ్యాధులెలా పోతాయని ప్రశ్నలు సంధిస్తే
ఔషధాలు, వైద్య విద్య కళ్ల ముందు నిలిచాయి
కణ మెట్లా కదిలిందని తరచి తరచి అడిగితే
అణు శక్తుల ఔన్నత్యం మనిషికి తెలిసింది
సమాజంలో అసమానత లెందుకని అడిగితే
మానవీయ శాస్త్రాలు మనుగడ నేర్పించాయి
స్వేచ్ఛా సమానత్వ సౌభ్రాతృత్వ పథంలో
ప్రశ్నతోనే వెలుగుతుంది మానవ హక్కుల దీపం
ప్రశ్నించే బుర్ర నుండి పురోగతి పుడుతుంది
ప్రశ్నించే తత్వానికి విశ్వం తల వంచుతుంది
ప్రశ్నను ప్రేమిస్తేనే జ్ఞాన సుధలు కురిసేది
ప్రశ్నను పూజిస్తేనే నవ పథాలు తెలిసేది
ప్రశ్నే కదా శాస్త్రానికి ప్రాణ వాయువు
ప్రశ్నే కదా నవ సమాజ దీర్ఘ ఆయువు
ప్రశ్నే కదా అన్వేషణ కారక చక్రం
ప్రశ్నే కదా చరిత్రకు ఉద్యమ పాదం


