“లలిత లలిత పదాలతో పిల్లల మనసులను చూరగొన్న మధురకవి!” అంటూ రాయప్రోలు సుబ్బారావు గారిచే ప్రశంసలు అందుకున్న నాళం కృష్ణారావు: లక్ష్మమ్మ, కామరాజు దంపతులకు చివరి సంతానంగా 1881 వ సంవత్సరం జనవరి 18వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించారు.
కృష్ణారావుకు పాఠశాల విద్య సరిగా అబ్బలేదు.
“ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యార్థి” అన్నట్లు పూర్వజన్మ సంస్కారం వల్ల చక్కని రచనా శక్తి, మధుర కవిత్వం అబ్బాయి. అలా ఆజన్మ సిద్ధమైన మధుర కవితాశక్తి అబ్బకుంటే, తొమ్మిదో తరగతి పరీక్ష పత్రానికి పద్యాల్లో జవాబులు రాయడం ఎలా సాధ్యమవుతుంది? అడిగిన ప్రశ్నలకు పద్యాలలో సమాధానం రాసి ఉపాధ్యాయులను అబ్బురపరిచాడాయన!
తన 17వ యేట రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయాన్ని స్థాపించారు. వీరేశలింగం అనుయాయులు కావడం వల్ల కృష్ణారావుకు కూడా స్త్రీ జనోద్ధరణ పై దృష్టి మళ్లింది. ఇల్లాలు చక్కగా చదువుకున్నదైతే తన ఇల్లు, పిల్ల్లని చక్కదిద్దుకుంటుందనే ఉద్దేశంతో, గౌతమీ గ్రంథాలయం నుండి ఇంటింటికి స్త్రీలకు ఉత్తమ గ్రంథాలు పంపించి చదివించేవారు. వారు చదవకపోతే తాను పడిన శ్రమ వృధా అవుతుందని ఎంచి, ఆ గ్రంథ పఠనంపై పోటీలు నిర్వహించి బహుమతులను కూడా ఇచ్చి ప్రోత్సహించేవారు. ఇలా చేయటం ద్వారా స్త్రీలలో పఠన శక్తిని పెంపొందించారు.
వారి సతీమణి సుశీలమ్మ ‘ఆంధ్ర మహిళా గాన సభ’ ను స్థాపించి మహిళలకు సంగీత శిక్షణ ఇప్పించేవారు. ఈ విధంగా ఆయన నిర్వహించే మహిళాభ్యుదయ కార్యక్రమాల్లో ఆమె తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆయన తన జీవితాంతం తన సతీమణి స్థాపించిన ఆంధ్ర మహిళాగానసభ అభివృద్ధికి, సక్రమ నిర్వహణకు తోడ్పడ్డారు. ప్రసిద్ధ మహిళా సంస్కృత కళాశాల అభివృద్ధికి కృషి చేయడమే కాక ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న బత్తుల కామాక్షమ్మకు సహాయ సహకారాలు అందించి మహిళాభ్యుదయానికి అంకితభావంతో నిరంతరం శ్రమించిన అభ్యుదయవాది నాళం కృష్ణారావు.
బ్రహ్మ సమాజం మతస్థుడిగా తన గురువు అయిన కందుకూరి వీరేశలింగం పంతులు కన్నా ముందే జంధ్యాన్ని పరిత్యజించారు. చింతా శేషయ్య అనే వేరే కులస్తుడికి తన ఇంట్లో నివాసం ఏర్పరిచి, బ్రహ్మమతస్తుడిగా తీర్చిదిద్దారు. ఇతర కులస్తులతో తన పెద్ద కుమారునికి వివాహం జరిపించారు. వితంతు వివాహాలు జరిపించడంలో కందుకూరి వీరేశలింగం కృషికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరి సతీమణి సుశీలమ్మగారు విదేశీ వస్త్రాలు అన్నీ దహనం చేసి, మహాత్మాగాంధీ రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు పండ్లరసం అందించారు. కృష్ణారావు పదివేల సామెతలను జాతీయ లోకోక్తుల పేరుతో సేకరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర విజ్ఞాన సరస్వాన్ని సంకలనం చేశారు. కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజానికి, వీరేశలింగం పాఠశాలకు వీరేశలింగం తర్వాత జీవితాంతం అధ్యక్షులుగా పనిచేశారు. 1911- 15 ప్రాంతాలలో ఆయన నిర్వహించిన తొలి తెలుగు సచిత్ర మాస పత్రిక ‘మానవసేవ’ అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది.
వీరు బాల్యం నుండి తుది శ్వాస వరకు తేటగీతులలో కావ్యరచన చేశారు. కృష్ణారావు ఆశలన్నీ భావి భారత పౌరులపైనే ఉండేవి. అందుకే ఆయన కావ్య నాయకుడు పిల్లవాడు. వారికి ఆయా గోరుముద్దలు, మీగడ తరకలు, పాలతరగలు, తేనె చినుకులు తినిపించారు. వెన్నెల వెలుగులు, విరిదండ దీపావళి పాపాయిలకు అందించారు.
లలిత లలిత పదాలతో పిల్లల మనసులను చూరగొన్న కృష్ణారావు మంచి భాషావేత్త. బాలసాహిత్య బ్రహ్మగా తెలుగు బాలబాలికలకు ఆయన ఇచ్చే సందేశాన్ని తాను రచించిన జీవన గీతంలో పొందుపరిచారు.
మీగడ తరకలు, గోరుముద్దలు, వెన్న బుడగలు, పాల తరకలు, తేనె చినుకులు, వెన్నెల వెలుగులు, విరిదండ, దీపావళి, గ్రంథాలయ సూక్తులు, మిత్రలేఖావళి, దేశమాత పరిదేవనము, వితంతు వివాహ చరిత్ర, ప్రేమ సాగరము, తెలుగుజాతీయములు, శ్రీకృష్ణరాయాంధ్ర విజ్ఞాన సర్వస్వము, గాంధీ మహాత్ముని దశావతారాలు- లీలలు మొదలైన పుస్తకాలను వెలువరించారు.
ఆయన 1921లో రాసిన గాంధీ విజయ ధ్వజ నాటకం, 1932లో రాసిన గాంధీ దశావతార లీలలు అనే గ్రంథాలను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. వీటిలో కొన్ని పుస్తకాలను గుంటూరులోని బొమ్మిడాల చారెటబుల్ ట్రస్ట్ వారు 2011లో పునర్ముద్రించారు.
కృష్ణారావు ఎంతో నిరాడంబరుడు. కీర్తి కాంక్ష±రహితుడు. సేవకే ప్రాధాన్యం ఇచ్చిన మనిషి. తన అనంతరం మానవ సేవ చేయవలసిందిగా తన తనయ కళా ప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మను పురమాయించారు.
మండపేటలో పుట్టి రాజమహేంద్ర రత్నమై, వీరేశలింగం గారి కుడి భుజమై, బహు భాషా కోవిదులై, సంఘసంస్కర్తలై, బాలసాహిత్య స్రష్టలై, మధురకవి బిరుదాంకితులై, మహిళా జనోద్ధారకులైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ నాళం కృష్ణారావు 1961 వ సంవత్సరం మార్చి 17వ తేదీన తమ 80 ఏళ్ల వయస్సులో స్వర్గస్తులయ్యారు.
సెల్: 94403 18415
బాల సాహిత్య బ్రహ్మ నాళం
- Advertisement -


