Homeభూ చిక్కులకు ఇక స్వస్తి

భూ చిక్కులకు ఇక స్వస్తి

- Advertisement -
  • జాయింట్ ఎల్‌పీఎం బాధితులకు మేలు
  • ఖర్చు లేకుండా సచివాలయాల్లోనే ఆన్‌లైన్ సబ్డివిజన్లు
  • మార్చి నాటికి 14,816 గ్రామాల్లో రీసర్వే పూర్తి
  • బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్‌లకు తొలగన్ను ఆటంకాలు

విశాలాంధ్ర- సచివాలయం: రాష్ట్రంలో తొలిదశ భూ సర్వేలో దొర్లిన సాంకేతిక లోపాలు, ఉమ్మడి భూ పార్శిల్ మ్యాప్ (ఎల్‌పీఎం) వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ‘రీసర్వే 2.0’ ద్వారా శరవేగంగా అడుగులు వేస్తోంది. గతంలో డ్రోన్ ఆధారిత ప్రాథమిక సర్వే ద్వారా తలెత్తిన చిక్కుల వల్ల లక్షలాది మంది రైతులు భూమి అమ్మకాలు, మ్యుటేషన్లు, బ్యాంకు రుణాలు, ‘అన్నదాత సుఖీభవ’ వంటి సంక్షేమ ఫలాలు పొందే అవకాశం కోల్పోయారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత ముగింపు పలుకుతూ భూ యజమానుల సమక్షంలోనే రోవర్ సాంకేతికతతో గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహిస్తూ హద్దులను పక్కాగా నిర్ధారిస్తున్నారు. భూ వివాదాల పరిష్కారానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ‘పీపుల్స్‌ గ్రీవెన్స్‌ రిడ్రసల్ సెల్’ (పీజీఆర్‌ఎస్), వెబ్ల్యాండ్ పోర్టల్, మొబైల్ యాప్, కలెక్టరేట్ గ్రీవెన్స్‌ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వినతులు స్వీకరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 18,84,233 ఫిర్యాదులు నమోదు కాగా… గత రెండేళ్లలో 17,53,771 (93 శాతం) వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించింది. ప్రస్తుతం 1,30,462 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఎల్‌పీఎంలకు సంబంధించి వచ్చిన 3,48,235 దరఖాస్తులలో 2,80,886 అభ్యర్థనలను ఇప్పటికే పరిష్కరించగా… 63,167 తిరస్కరణకు గురయ్యాయి. కేవలం 3,956 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతు న్నాయి. భూనక్ష వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సబ్డివిజన్లకు 5,84,346 దరఖాస్తులు రాగా… 4,87,574 దరఖాస్తులు ఆమో దం పొందాయి. 87,149 అభ్యర్థనలు తిరస్కరణకు గురికాగా… 9,372 పెం డింగ్‌లో ఉన్నాయి. రికార్డుల్లో తప్పలపై మరో 5 వేల అర్జీలు పరిష్కరించారు. గత మూడు నెలల్లో పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఎల్‌పీఎం ఫిర్యాదుల శాతాన్ని 5.67 శాతానికి తీసుకువచ్చారు.
రీసర్వే-2.0లో భాగంగా 2026 జులై నాటికి ఐదో దశ పనులు ప్రారంభించారు. మొత్తం 14,816 గ్రామాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి సర్వే పూర్తి చేసి జాయింట్ ఎల్‌పీఎంల సమస్యను పూర్తిగా నివారించేందుకు రెవెన్యూ యంత్రాంగం శ్రమిస్తోంది. తొలి నాలుగు దశల్లో 3,750 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. (తొలిదశలో 7,900 గ్రామాల్లో విడతల వారీగా 628, 748, 720, 1,620 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశారు). ప్రస్తుతం 1,302 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతుండగా… సర్వే సిబ్బంది కనీసం 120 రోజులకు పైగా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు తమ సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో నేరుగా ఆన్‌లైన్ సబ్డివిజన్, విభజన అభ్యర్థనలను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షేత్రస్థాయిలో భూమి స్వాధీనాన్ని ధృవీకరించడానికి గ్రామ సర్వేయర్లను నియోగిస్తున్నారు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను బ్యాంకులు, వ్యవసాయం, పంట బీమా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో అనుసంధానించింది. జాయింట్ ఎల్‌పీఎం సమస్య కేవలం ఒక మ్యాప్ లోపం మాత్రమే కాదని, అది భూహక్కుల, భవిష్యత్ లావాదేవీలపై ప్రభావం చూపే అంశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సచివాలయాలు, పోర్టల్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు