బీఆర్ఎస్ తీరుపై కూనంనేని అసహనం
విశాలాంధ్ర-హైదరాబాద్: బీఆర్ఎస్కు హుందాతనం తెలియదా? సభ్యులు అనుచిత పదజాలం ఆక్షేపణీయమని సీపీఐ శాసనసభపక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. కొంతమంది సభ్యుల తీరు వల్ల గౌరవ సభ కాస్త అగౌరవసభగా మారిందని విమర్శించారు. చట్టసభ్యులే సభను అగౌరవపరిచే పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని అసెంబ్లీ సమావేశంలో కూనంనేని వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ మాటల దాడిని ఖండించారు. సభ్యుల భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ దర్పం ప్రదర్శించని వ్యక్తి విషయంలో సభ్యుల దుష్ప్రవర్తను ఆక్షేపించారు. ఇది వ్యక్తి హననమేనని వ్యాఖ్యానించారు. పద్ధతిగా మర్యాదగా మాట్లాడాలని, సభ హుందాతనాన్ని కాపాడాలని సూచించారు. తెలంగాణ ఉద్యమానికి ముందు ఉన్న భాషకు ఆ తర్వాత వచ్చి భాషకు వ్యత్యాసం ఉందని, ఉభయ రాష్ట్రాల్లోఊ ఇలాంటి భాషే వాడుకలోకి రావడం బాధాకరమన్నారు. ఎక్కువ బూతులు ఎవరు మాట్లాడితే వారినే ప్రజలు ఇష్టపడతారనే తప్పుడు భావన నాయకుల్లో ఉందని కూనంనేని అన్నారు. ‘మనకు గౌరవం కల్పించినందుకు… మన తల్లులు, అక్క చెల్లెలు ఇలాంటి మాటలు పడలా’ అని సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు విచక్షణ కోల్పోయి వ్యహరిస్తున్నారని, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా రోడ్డుపై చొక్కాలు విప్పేస్తున్నారని, ఇదేమైనా కుస్తీ పోటీలా అంటూ కూనంనేని మండిపడ్డారు. తప్ప జరిగిందంటూ బీఆర్ఎస్ను దుయ్యబట్టారు. సంబంధిత సభ్యుడిని స్పీకర్ వద్దకు తీసుకెళ్లి క్షమాపణ చెప్పించకపోగా… రెచ్చిపోవడం సబబా అని నిలదీశారు. ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ స్పందించి క్షమాపణ చెప్పి ఉంటే హుందాగా ఉండేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. విషయ పరిజ్ఞానం లేని వారు బూతు పురాణం అందుకుంటారని… సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా మన భాషా ఎలా ఉండాలనే దానిపై సభలో చర్చించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


