Homeమీ ఇల్లు మా పరిధి కాదు

మీ ఇల్లు మా పరిధి కాదు

- Advertisement -

తంతి తపాలాశాఖలో కొత్త పోకడలు

  • పోస్ట్మాన్ల నిర్లక్ష్య సమాధానం
  • క్షేత్రస్థాయి సేవల్లో అలసత్వం
  • బట్వాడా కాని పార్శిళ్లు… ఖాతాదారుల గగ్గోలు

విశాలాంధ్ర బ్యూరో – తిరుపతి: దశాబ్దాలుగా తంతి తపాల సేవలు మన జీవితంలో భాగమయ్యాయి. “మాకు పోస్ట్ కార్డ్ ఏమైనా వచ్చిందా… మనియార్డ్ర్ వచ్చిందా” అని నిత్యం పోస్ట్మెన్లు మన వీధిలో కనిపించగానే అడిగేవాళ్లం.వాళ్లు సైతం ఆప్యాయంగా పలకరించి వెళ్లేవాళ్లు. ప్రభుత్వ ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చినా… నియామకపతçం వచ్చినా భవిష్యత్‌కు ఇక ఢోకా లేదు అని ఎంతో సంబరపడేవాళ్లం. ఇదంతా గతం. ప్రైవేటు కొరియర్ సంస్థలు రంగ ప్రవేశం చేశాక భారతీయ తపాలాశాఖ మునుగడ కోసం కేంద్రం కొన్ని సేవలను ఇప్పటికీ ఆ శాఖ ద్వారా కొనసాగిస్తోంది. అయితే… దీన్ని విస్మరిస్తూ పలువురు సిబ్బంది క్షేత్రస్థాయిలో వినియోగదారులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్సిళ్లు అందించడం తమ బాధ్యత కాదని భావిస్తున్నారు. దీంతో నిత్యం వేలాదిమంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవల తిరుపతి నుంచి ఓ ఖాతాదారుడు స్టేట్ బ్యాంక్ ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఏటీఎం కార్డు డెలివరీ మెసేజ్ వచ్చింది. నాలుగు నెలలు అయినప్పటికీ అందలేదు. మళ్లీ మరో ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఆ కార్డు సైతం ప్రధాన కార్యాలయానికి చేరింది. ఇదే విషయమై సమాచారం వచ్చింది. మూడు వారాలు దాటినప్పటికీ సదురు చిరునామాకు ఏటీఎం కార్డు రాలేదు. దీంతో బ్యాంకుకు వెళ్లగా జులై 30న ఏటీఎం కార్డు డెలివరీ చేసినట్టు రికార్డుల్లో ఉంది. ఏటీఎం కార్డు కోసం తపాలా కార్యాలయానికి వెళ్లగా సంబంధిత పోస్ట్మాన్ ఆ చిరునామా తన పరిధిలో లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇదే విషయాన్ని సబ్ పోస్ట్మాస్టర్ దృష్టికి తీసుకెళ్లగా…చిరునామాలో ఎవరూ లేకపోతే పార్సిల్ను వారం రోజులు ఉంచి ఆ పోస్ట్ మాన్ వెనక్కు పంపారని తెలిపారు. సదురు చిరునామాలో మనుషులు లేరు అనేది అవాస్తవం. శెట్టిపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో సహకరించాల్సిన సబ్ పోస్ట్మాస్టర్ సైతం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం నివ్వెరపరిచింది. బ్యాంకు అధికారులు సైతం ఇదే విషయమై వాపోయారు. దీంతో పోస్ట్మాన్లు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే వివిధ కారణాలతో ఏటీఎం కార్డులను వెనక్కి పంపిస్తున్నారని స్పష్టమైంది. ఇలాంటి సంఘటన బైరాగిపట్టెడలో సైతం ఇటీవల చోటు చేసుకుంది. ఇవే కాకుండా సాధారణ పోస్టు, స్పీడ్ పోస్ట్ విషయాల్లో పోస్ట్మాన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. శ్రీకాళహస్తి మండలంలో తన కూతురికి పోస్ట్ ఆఫీస్ పనితీరును వివరించడానికి ఓ వ్యక్తి తీసుకువెళ్లారు. ఇన్ ల్యాండ్ కవర్ కొని, అదే వీధిలో బంధువుకు పోస్ట్ చేయించారు. అది ఆరేళ్లయినప్పటికీ ఇంకా చేరలేదు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక రచయిత్రి హైదరాబాద్ లో ఉన్న స్నేహితునికి ఒక పుస్తకం పంపారు. మూడు నెలలు గడిచిపోయాయి. పుస్తకం చేరలేదు. రెండు వారాల క్రితం మరో పుస్తకం పంపారు. అది కూడా చేరలేదు. ఇలాంటి సందర్భాల్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి సంబంధిత వివరాలు కనుక్కొని ఫోన్ చేస్తే తొలుత వచ్చే సమాధానం “ఆ డోర్ నంబర్ తమ పరిధిలోకి రాదు” అని వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడితే ఆ డోర్ నెంబర్ లో అటువంటి వ్యక్తి లేరు కాబట్టి పార్సిల్ వెనక్కి పంపించాం అని సమాధానం వస్తుంది. వాస్తవానికి పోస్ట్మెన్లు గతంలోలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్డులు, కవర్లు, పార్సిల్లు పంపిణీ చేయడం లేదు. నాలుగైదు రోజులు తమ వద్దే ఉంచుకొని, వెనక్కి పంపిస్తున్నారని వెల్లడైంది. ఇదే విషయాలను సబ్ పోస్ట్ మాస్టర్లను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. పోస్ట్మేన్ ల పని తీరుపై పర్యవేక్షణ ఉండడం లేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యానికి ఆర్థికంగానూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకవైపు ప్రైవేట్ కొరియర్ సంస్థలు నాణ్యమైన సేవలను అందిస్తుండగా, తమ జీవనాధారంతో ముడిపడి ఉన్న పోస్టల్ సేవలను సిబ్బంది ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ప్రజల్లో సంబంధిత శాఖ పట్ల నిరాదారణ వ్యక్తం అవుతుంది. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు