ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగాలు
పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విశాలాంధ్ర – హైదరాబాద్ : పవిత్రమైన శాసనసభ నుంచి రాష్ట్ర యువత కోసం ప్రారంభిస్తున్న రాజీవ్ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 6 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశామని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత స్వయం ఉపాధి పథకాలకు ఒకటేసారి 6000 కోట్ల రూపాయలు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. ఈ ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు ఒక్కసారి కూడా నిర్వహించలేదని, ఒక సంవత్సరంలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి, యువతలో ఆనందో త్సాహాలను నింపామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు విడుదల చేయడం వల్ల పోటీ పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావడం ఇబ్బందిగా ఉందని, నోటిఫికేషన్ల మధ్యన కొంచెం గ్యాప్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేసి స్థాయికి విరివిగా నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడి సమాజంలో తలెత్తుకొని బతకడానికి స్వయం ఉపాధి పథకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసి రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చా రని వివరించారు. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రిగా ఈ పథకం అమలు కోసం విధి విధానాలు, కావలసిన నిధుల సమీకరణ పై క్యాలెండరు సిద్ధం చేయాలని చెప్పడంతో అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఈ పథకాన్ని రూపకల్పన చేయడంతో పాటు నిర్దిష్టమైన క్యాలెండర్ రూపొందించి ప్రకటించడం జరిగిందని తెలిపారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న నాతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ పథకం 100శాతం అమలు కావడానికి కావలసిన విధి విధానాలను ఖరారు చేశారని చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఈ నెల 15 నోటిఫికేషన్ జారీ చేశామని, దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల డౌన్లోడ్ చేసుకొని మండల కార్యాలయంలో సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. మండల అధికారులు వాటిని స్క్రూట్ని చేసి జిల్లా అధికారులకు పంపించి కలెక్టర్ సమక్షంలో దరఖాస్తుల వెరిఫికేషన్ చేస్తారని, ఆ తర్వాత ఇన్చార్జి మంత్రి అప్రూవల్ చేయడం ద్వారా జూన్ 2న మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందన్నారు. 50 వేల నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు ఆర్థిక సాయం చేయడానికి ప్రత్యేక రాష్ట్రంలోనూ అంతకుముందు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకటేసారి 6వేల కోట్ల రూపాయలు కేటాయించిన దాఖలాలు లేవన్నారు. పవిత్రమైన శాసనసభ నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా సంతోషంగా ఉందన్నారు. మండలానికి వెయ్యి మంది యువతకు స్వయం ఉపాధి పథకాలు ఇందిరమ్మ రాజ్యంలో అందించే అవకాశం వచ్చినందున ఎమ్మెల్యేలు ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించి ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను సైతం ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒప్పించమని సందర్భంగా వెల్లడిరచారు.