లోక్‌సభలో బీజేపీ ఎంపీ దూబే తీర్మానం
న్యూదిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. రాహుల్ సభ్యత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ దూబే నోటీసు ఇచ్చారు. ఇంకా ప్రచురితం కాని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె పుస్తకం సహా పలు వివాదాస్పద అంశాలపై రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిన సంగతి తెలిసిందే. ‘రాహుల్ గాంధీకి ఎవరు నిధులు ఇస్తున్నారు? ఆయన చేతికి ప్రచురితం కాని పుస్తకం ఎలా వచ్చింది? భారత వ్యతిరేక శక్తులతో ఆయన సంబంధాల గురించి ఆ నోటీసులో ప్రస్తావించాను. లోక్‌సభలో రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అని దూబే అన్నారు. అయితే ఆయనపై సభా హక్కుల తీర్మానం తీసుకురావడం లేదని చెప్పారు. కాగా, రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్‌సభలో ‘సబ్‌స్టాంటివ్ మోషన’ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా… జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంపై కేంద్రం విముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్‌గాంధీ బుధవారం చేసిన ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నది. ‘జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా తప్ప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ నేను ఈరోజు లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాను. ఈ విషయాన్ని చర్చించాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నా’ అని దూబే చెప్పారు.


