బి.సాంబశివరావు
రాష్ట్ర శాసనసభలో వ్యవసాయంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర రైతాంగం పండిస్తున్న ధాన్యం రకాలు తినటానికి, ఎగుమతి చేయటానికి ఉపయోగపడటం లేదని, ఇదే కొనసాగితే రానున్న కాలంలో ఆల్కహాల్‌కి తప్ప మన ధాన్యం ఎందుకూ ఉపయోగపడదని చెప్పడం ద్వారా ప్రజలకు అన్నం పెట్టే రైతాంగాన్ని అవమానించారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
రాష్ట్రంలో 14.90 లక్షల హెక్టార్లలో వరి పండిస్తే, అందులో 6.25 లక్షల హెక్టార్లలో బీపీటీి, 8.25 లక్షల హెక్టార్లలో స్వర్ణ, 30 వేల హెక్టార్లలో ఎగుమతి రకం విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ బియ్యం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. బీపీటీ లాంటి బియ్యం వినియోగాన్ని రాష్ట్రం ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి పోవటం, ధరలు పెరుగుతూ ఉండటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రావటంతో బియ్యం తరలింపుపై గత రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, రైతాంగం పండిస్తున్న ధాన్యం తినటానికి, ఎగుమతికి పనికి రాదని చంద్రబాబు ఎలా మాట్లాడగలిగారు. ఏడాదికి రెండు పంటలు పండిస్తే వాటిని ఎలా కొనాలో తెలియటం లేదని చంద్రబాబు చెప్పటంలో వేరే ఉద్దేశాలు ఉన్నాయి. చంద్రబాబు చెప్పినట్లుగా అత్యధిక ప్రాంతాల్లో వరి రెండవ పంటగా రైతులు వేయటం లేదు. జొన్న, మొక్కజొన్న వేస్తున్నారు.
ప్రస్తుతం రైతులు పండిరచే వరి ధాన్యం తినటానికి, ఎగుమతికి పనికి రాదని చెప్పే చంద్రబాబు రైతులు ఎలాంటి వరి ధాన్యం పండిరచాలో చెప్పి ఉండాల్సింది. అధిక దిగుబడులు ఇచ్చి రైతులకు అధిక ఆదాయం పొందేందుకు అని హైబ్రీడ్, బీటీ విత్తనాల విక్రయాలకు అనుమతి ఇస్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే గదా! వరి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు సరఫరా చేస్త్తోంది గదా ! వాటి ద్వారానే రైతాంగం వరి పండిస్తున్నారు గదా! తినటానికి పనికి రాని విత్తనాలను మీరు రైతాంగానికి ఎందుకు విక్రయిస్తున్నారు. ఒక వేళ మీరు చెప్పేదే నిజమైతే, అందుకు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే గదా, మీరు రైతులపై ఎందుకు నింద వేస్తున్నారు. తినటానికి, ఎగుమతికి అవసరమైన విత్తనాలను ఉత్పత్తి చేయించి, వాటిని రైతులకు సరఫరా చేయవచ్చు గదా! అలా ఎందుకు చేయటం లేదు. రైతులను ఎందుకు తప్పుబడుతున్నారు. నేడు రైతాంగం పండిరచే వరి ధాన్యాల బియ్యం రాష్ట్ర ప్రజలెవ్వరూ తినమనటం లేదు. రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మన రైతులు పండిరచే బీపీటీి వంటి ధాన్యం బియ్యాన్ని చాలా ఇష్ట పడుతున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు బియ్యం ధరలు పెంచుతున్నారు. ఈ విషయం చంద్రబాబుకి తెలియదా! ఎగుమతికి ప్రస్తుత ధాన్యం ఉపయోగ పడదని చెప్పే ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని కాకినాడ పోర్టు నుంచి పెద్దఎత్తున ఎగుమతి జరుగుతున్న విషయం తెలియదా!
వ్యవసాయానికి చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకం. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు వ్యవసాయం దండగని, రైతులు వరి పంట వేయవద్దని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పటంతోనే వ్యవసాయానికి చంద్రబాబు వ్యతిరేకం అన్న విషయం వెల్లడైంది. రాజశేఖర్‌రెడ్డికి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సాగునీరు అందక పంటలు ఎండిపోవటం, పంటలకు గిట్టుబాటు ధర లభించక పోవటం, సేద్యపు ఖర్చులు పెరగడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి వ్యవసాయ పంపులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు కోరగా, ఉచిత కరెంట్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవటానికి మాత్రమే పనికి వస్తుందని రైతాంగాన్ని బాబు హేళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితంగా 1999-2004 మార్చి మధ్యలో అప్పుల పాలైన రైతాంగం పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడిరది.
చంద్రబాబు రైతు సేద్యానికి వ్యతిరేకం, కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలం. అందుకే చిన్న వ్యవసాయం దండగని, చిన్న, సన్నకారు రైతులు కాంట్రాక్ట్ వ్యవసాయానికి తమ భూములు ఇచ్చి, అందులో కూలి పనులు చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతూ, కుప్పంలో తమ భూములను కాంట్రాక్ట్ వ్యవసాయానికి రైతులు ఇచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదే. కుప్పంలో కాంట్రాక్ట్ వ్యవసాయం ఇచ్చిన చేదు అనుభవాలను ఇప్పటికీ రైతులు మర్చిపోలేక పోతున్నారు.
అధికార మార్పిడి తర్వాత దేశ, రాష్ట్ర పాలకులు ఎంతో కీలకమైన వ్యవసాయ రంగంలో స్వతంత్ర విధానాలు అమలు జరపడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమౌతూవస్తున్నారు. వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలను అమలు జరుపుతున్నారు. నేడు మోదీ నుంచి చంద్రబాబు వరకు రైతాంగ వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేస్తున్నారు. విత్తనాల, ఎరువుల, పురుగు మందుల, డీజిల్ ధరలు పెంచి సేద్యపు ఖర్చులు పెరిగేలా చేస్తున్నారు. సంస్థాగత రుణాలు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, పంటలు కొనుగోళ్లు బాధ్యత వహించకుండా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి సేద్యం దండగ అన్న అభిప్రాయం రైతుల్లో ఏర్పడేలా చేస్తున్నారు. తమ భూములను కార్పొరేట్లకు, కాంట్రాక్ట్ సేద్యానికి అప్పగించేలా చిన్న, సన్న కారు రైతుల్లో ఆలోచనలు ఏర్పడేలా చేస్తున్నారు. వరి సాగుపై చంద్రబాబు వ్యాఖ్యలు అందులో భాగమే. సేద్యం నుంచి రైతులు తప్పుకునేలా చేయటమే చంద్రబాబు విధానం అనుకోవాలి. ఈ వాస్తవాన్ని రైతాంగం గ్రహించి కూటమి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి, పంట ఖర్చులు తగ్గేలా, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు తగ్గించాలని, పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి ప్రభుత్వ సంస్థలే కొనుగోళ్లు చేయాలని రైతాంగం ఉద్యమించాలి.
సెల్:9885983526


