విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: నిరుపేదల హక్కులు, సమస్యలే అజెండాగా నడుస్తున్న ప్రజా పత్రిక ‘విశాలాంధ్ర’ మరో వందేళ్లు విరజిల్లాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఉండవల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విశాలాంధ్ర 75 సంవత్సరాల లోగోను లోకేశ్ మంగళవారం ఆవిష్కరించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జనరల్ మేనేజర్ పి.హరినాథ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.మనోహర్ నాయుడు పాల్గొన్నారు. విశాలాంధ్ర దినపత్రిక తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నదని, గత ఏడున్నర దశాబ్దాలలో పత్రిక ఒక్కరోజు కూడా ముద్రణ ఆగలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ జరుపుకుంటోందన్నారు. లోకేశ్ స్పందిస్త్తూ 75 సంవత్సరాలుగా ఒక దినపత్రికను నిరంతరాయంగా తీసుకురావడం తెలుగు పత్రికా రంగానికే గర్వకారణమన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి పాలకవర్గాన్ని అభినందించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి, కార్మికుల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేసే విశాలాంధ్ర వంటి ప్రజా పత్రికకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.


