స్థానిక సమరానికి కూటమి వ్యూహం
సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు-పవన్ భేటీ
మేయర్, చైర్‌పర్సన్ కీలక స్థానాలపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తును అధికార కూటమి ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఉండవల్లి సీఎం నివాసంలో భేటీ అయ్యారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, మేయర్, చైర్‌పర్సన్ స్థానాల పంపకం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. తొలుత చంద్రబాబుతో కలిసి పవన్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎన్నికలపై చర్చలు సాగాయి. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? ఏ ప్రాంతంలో ఎవరికి బలం ఉంది? కూటమి భాగస్వాముల మధ్య స్థానాల పంపకాన్ని ఏ ప్రాతిపదికన చేపట్టాలి? అన్న అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే, కూటమి అభ్యర్థులు సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణతో రంగంలోకి దిగాలని నిర్ణయించారు. బలాబలాలపై పంతానికి పోకుండా, అవసరాలు దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోవాలని భావించారు. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్నందున, దానిపై ముందుకు ఎలా వెళ్లాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న నిబంధనతో పాటు, పెంచిన రిజర్వేషన్లకు అవసరమైన అనుభవాధారిత సమాచారాన్ని ప్రభుత్వం సమర్పించలేదన్న అంశాలను కోర్టు ప్రస్తావించింది. అదే సమయంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన పరిణామాలు, ఎన్నికల ప్రక్రియపై వాటి ప్రభావం, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా చంద్రబాబు, పవన్ చర్చించారు.
క్షేత్రస్థాయిలో సమన్వయమే కీలకం
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం రాష్ట్ర స్థాయిలోనే పరిమితం కాకుండా…. నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డు స్థాయికి చేరేలా చర్యలు చేపట్టాలని ఇద్దరు నాయకులు భావించారు. స్థానికంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోతే సీట్ల సర్దుబాటు సమస్యగా మారవచ్చని, ముందుగానే మార్గదర్శకాలు ఇవ్వాలని, అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల షెడ్యూలు రాకముందే కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లు, క్షేత్రస్థాయి సమన్వయం వంటివి కొలిక్కి రావాలని భావించారు. ఈ దిశగా చంద్రబాబు, పవన్ భేటీ ఉపయోగపడుతుందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. త్వరలో బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు.


