Homeసీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం

సీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం

- Advertisement -

. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు పోరాటం
. తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి…లేకుంటే రాజీనామా చేయాలి
. నిమ్మలకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య
. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన

విశాలాంధ్ర – కడపరూరల్‌: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి… తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటన పై చంద్రబాబు నాయుడు స్పందించకపోతే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి… సీఎం పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమ హక్కులకు భంగం కలిగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. రాయలసీమకు జీవనాడి అయిన ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు పోరాటం చేపడతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా 2020 మే 5వ తేదీన రూ.6829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జి.ఓ నెం. 203 జారీ చేసిందని తెలిపారు. శ్రీశైలం జలాశయం వెనుకభాగంలో సంగమేశ్వర నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు దిగువన నాలుగు కిలోమీటర్ల వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలిపేందుకు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నుండి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకూ కాలువ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంపు, అక్కడినుండి శ్రీశైలం కుడి కాలువ (ఎస్‌.ఆర్‌.బి.సి), గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ గండికోట వరకు 20వేల క్యుసెక్కుల నుండి 30వేల క్యూసెక్కులకు పెంచుతూ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, నిప్పుల వాగు సామర్థ్యం పెంచేందుకు నిధులు కేటాయించగా… 80% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మారిన మరుక్షణం పనులు నిలుపుదల చేయడం విచారకరమన్నారు. పైగా తన విజ్ఞప్తి మేరకు పనులు నిలిపివేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఈశ్వరయ్య పేర్కొన్నారు. నికర జలాలు కలిగిన ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌, తెలుగంగ, మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరు నగరి, జీఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశ నుంచి హెచ్‌ ఎన్‌ ఎస్‌ఎస్‌ రెండో దశ ప్రాజెక్టులకు రావలసిన నీటి ముఖ ద్వారం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కు నీళ్లు అందాలంటే శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు నీటిమట్టం అమలు చేయాల్సి ఉండగా… శ్రీశైలం కుడి ఎడమల విద్యుత్తు ఉత్పత్తి, నీటిమట్టం ఆమలుకు నోచుకోక రాయలసీమకు నీళ్లు అందడం లేదన్నారు. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో శ్రీశైలం నుండి తాగునీటి కోసం నీటిని తరలించే వెసులుబాటు లేదన్నారు. ఏడాదిలో 30 రోజులు వరద సమయంలో వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటిని తరలించే వెసులుబాటు లేదన్నారు. రాయలసీమ నెల్లూరు జిల్లాల లోటు తీర్చేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల అటు తెలంగాణ, ఇటు ఏపీలో అవగాహన రాహిత్యంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేతలకు ఎలాంటి నష్టం లేదన్నారు. హక్కులు, అవకాశాలు కోల్పోయి నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాయలసీమ … కృష్ణా పెన్నార్‌ ప్రాజెక్టును, రాష్ట్ర రాజధానిని కోల్పోయిందన్నారు. చంద్రబాబు గత తొమ్మిది సంవత్సరాల పాలన లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం వల్ల బచావత్‌ ట్రిబ్యునల్‌ లో నికర జలాలు కోల్పోయి, మిగులు జలాలపై ఆధార పడాల్సి వచ్చిందని… వాటిని కూడా బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కాలరాస్తూ ఇచ్చిన తీర్పు రాయలసీమ పాలిట మరణ శాసనంగా మారిందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం అంటూ నిధులన్నీ ఒక ప్రాంతానికి పరిమితం చేసి వెనకబడిన ప్రాంతాలను విస్మరించారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు… అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని… డబుల్‌ ఇంజన్‌ సర్కారులో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పెద్దపేట వేస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా పక్కకు నెడుతున్నారని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. కనీసం నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్ర నీటి హక్కులు కాపాడాల్సి ఉండగా… సర్కారు దగాకోరు విధానాలతో రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి … వంట కాలంలో నిర్మాణం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాల్సి ఉండగా… సీఎం చంద్రబాబు గోదావరి`బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో కాంట్రాక్టర్ల కడుపు నింపే ప్రాజెక్టు చేపడతామని చెప్పడం శోచనీయమన్నారు. 80 శాతం పనులు పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు చేసుకొని రాయలసీమ నోట్లో మట్టి కొట్టాలని చూడడం రాయలసీమ ద్రోహం చేయడమే అన్నారు. తెలంగాణ సీఎం ప్రకటన పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషం చిమ్మిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాట్లాడే రాయలసీమ నాయకులు ఎత్తిపోతల పథకం వల్ల జరిగే నష్టాలు ఏంటో చర్చించడానికి బహిరంగ చర్చకు రావాలని ఈశ్వరయ్య సవాలు విసిరారు. రాయలసీమ ప్రయోజనాలకు నష్టం కలిగించాలని చూస్తే… రాజకీయ సమాధికి పునాదిరాయిగా రాయలసీమ ఎత్తిపోతల ఉద్యమం మారుతుందని హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేసే వరకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాటానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలను తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వం… అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టి, అడ్డగోలుగా నీటి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షలు పీ రామచంద్రయ్య, కేసీ కెనాల్‌ ఆయకట్టు దారుల సంఘం మాజీ చైర్మన్‌ దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి, సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య , అన్నమయ్య జిల్లా కార్యదర్శి పీ మహేష్‌ మునెప్ప, సీపీఐ కడప జిల్లా కార్యవర్గ సభ్యులు ఏంవి సుబ్బారెడ్డి, గంగా సురేష్‌, విజయలక్ష్మ, బాలు, శ్రీరాములు, మస్తాన్‌, శివరామకృష్ణ దవర, రైతు సంఘం నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, ఈశ్వరయ్య, శంకర్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు