డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్‌రెడ్డి
సోషలిజం మళ్లీ బలం పుంజుకుంటోంది. ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కారల్ మార్క్స్ పేర్కొన్నట్టు నిత్య సంక్షోభాలకు నిలయమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజమే సరైన రాజకీయ ప్రత్యామ్నాయమనే చర్చ మళ్లీ జీవం పోసుకుంటున్నది. అత్యున్నత దశకు చేరిన పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన తీవ్రమైన ఆర్థిక అసమానతలు, జీవన వ్యయాల పెరుగుదల, నిరుద్యోగం, గృహ సమస్య, ప్రైవేటీకరణ, సామాజిక భద్రత క్షీణత వంటి ప్రధానమైన సమస్యలపై అన్ని దేశాల్లో చర్చ సాగుతోంది. ఇవన్నీ మెజారిటీ ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలే కావడంతో, వాటి పరిష్కారం ఎక్కడ సాధ్యం అనే అన్వేషణ జరుగుతున్నది. ఈ దశలోనే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన వామపక్ష రాజకీయాల వైపు జనం దృష్టిని సారిస్తున్న పరిణామ క్రమమూ స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారీ సమాజంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య ప్రపంచాన్ని కుదిపేస్తోంది. యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కారణంగానే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందనే నిజాన్ని గ్రహించిన యువత, ఏకంగా రాజకీయ వ్యవస్థనే మార్చాలనే దిశగా కదులుతున్నది. ఈ క్రమంలోనే జెన్ జీ తరం చేస్తున్న పోరాటాల్లో విద్య, ఉపాధి అంశాలే ప్రధాన అజెండాగా మారాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా యువత లేవనెత్తుతున్న ఈ కీలకమైన నిరుద్యోగ సమస్యతో పాటు హక్కులు కోల్పోతున్న కార్మికులు, గ్రామీణ రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు, వలస కార్మికుల సమస్యలన్నీ ముందుకు వస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని మరచిన పాలకుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిత్యావసర ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, పక్కా గృహాలు, ప్రజా రవాణా, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, ప్రగతిశీల పన్నులు వంటి అంశాలు ఎన్నికల రాజకీయాల్లో ప్రధానంగా మారుతున్నాయి. పరిష్కార మార్గాలను వెతుకుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే సోషలిజం పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు సజీవ సాక్ష్యంగానే చూడవచ్చు. సోవియట్ రష్యా పడిపోయింది, ఇక సోషలిజానికి భవిష్యత్తు లేదని వాదించిన పెట్టుబడిదారీ వర్గం, స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే సమాజాన్ని ముందుకు నడుపుతుందని వాదించే భావజాలాలకు భిన్నంగా సోషలిజం పునరుద్ధరణ అవుతుందనే నమ్మకం పెరిగేలా ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచంపై పెత్తనం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అగ్రరాజ్యం అమెరికాలోనే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు జెండా ఎగరడం మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రత్యామ్నాయ విధానాల కోసం జరుగుతున్న అన్వేషణలో డెమోక్రటిక్ సోషలిజం ప్రాముఖ్యతను పొందుతున్నది. దీనికి నిదర్శనంగా 2025 నాటి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టుగా తనను తాను చెప్పుకున్న జొహ్రాన్ మ్మదానీ విజయం సాధించారు. 2026 జనవరి 1న మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూయార్క్ వంటి ప్రపంచ పెట్టుబడిదారుల స్వర్గధామంలో, స్వేచ్ఛా విపణిని కోరుకునే ఆర్థిక కేంద్రంలో డెమోక్రటిక్ సోషలిజాన్ని బహిరంగంగా ముందుకు తెచ్చిన జొహ్రాన్ మ్మదానీ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఎన్నికల తరుణంలో ఆయన చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలన్నీ సామాన్య జనం పడుతున్న కష్టనష్టాల కేంద్రంగానే సాగాయి. యువతకు ఉపాధి, పెరుగుతున్న ధరల నియంత్రణ, జీవన వ్యయం, గృహ సమస్య వంటి ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన అంశాలే ఎన్నికలను ప్రభావితం చేశాయి. జనం మద్దతును పొందాయి.న్యూయార్క్ పరిణామం తరహాలోనే మరిన్ని ప్రాంతాల్లోనూ సోషలిజం భావనలకు మద్దతు పెరిగింది. 2025 నార్వే ఎన్నికల్లో లేబర్ పార్టీ మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నది. 2026 స్వీడన్ ఎన్నికల్లో సోషల్ డెమోక్రాట్ల నేతృత్వంలోని వామపక్ష కూటమి 349 స్థానాలున్న పార్లమెంటులో అత్యధికంగా 176 స్థానాలు సాధించింది. డెన్మార్క్‌లో 2026లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి మెజారిటీ పొందలేకపోయినా, వామపక్షం గతం కన్నా అత్యధిక స్థానాలు సాధించి రాజకీయ ప్రత్యామ్నాయంగా తామున్నామని నిరూపించింది. లాటిన్ అమెరికాలోనూ వామపక్షం ప్రాధాన్యతను పొందింది. బ్రెజిల్లో లూలా డ సిల్వా నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెక్సికోలో క్లాడియా షీన్బామ్, ఉరుగ్వేలో యమందూ ఓర్సీ వంటి వారి నేతృత్వంలో వామపక్ష శక్తులు అధికారంలో ఉన్నాయి. లెక్కలేనన్ని ఆంక్షల మధ్య అతి చిన్న దేశమైన క్యూబా అమెరికా సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు కొరకరాని కొయ్యగా నిలిచి సోషలిస్టు శక్తులకు నూతన ఉత్తేజాన్ని ఇస్తూనే ఉన్నది.ఆసియాలోని చైనా, వియత్నాం లల్లో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. చైనా, వియత్నాంలు అక్కడి పరిస్థితికి అనుకూలంగా వామపక్ష ముద్రతో నడుస్తున్నాయి. 2024 లో శ్రీలంకలో అనూహ్య పరిణామం జరిగింది. అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ద్వారా వామపక్ష శక్తులకున్న రాజకీయ ప్రాధాన్యతను గుర్తు చేసింది.తాజాగా జర్మనీలోనూ వామపక్ష ఆలోచనలు వికసించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన బెర్లిన్ రాష్ట్ర ఎన్నికల్లో డీ లింకే (ది లెఫ్ట్) 25.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బెర్లిన్‌లో గృహ అద్దెల పెరుగుదల, జీవన వ్యయం, కార్పొరేట్ గృహ యాజమాన్యంపై నియంత్రణ వంటి అంశాలే అక్కడి జనాన్ని ఆకర్షించాయి. ప్రజల ప్రత్యక్ష సమస్యల పరిష్కారానికే రాజకీయ ప్రాధాన్యత దక్కింది. జనం సమస్యలే వామపక్షానికి బలమైన మద్దతును సమీకరించాయి. ఈ పరిణామాలన్నిటిని గమనిస్తే పెరుగుతున్న వామపక్ష దృక్పథం, సోషలిజం పట్ల ఆసక్తి అనే స్పష్టమైన సారూప్యతలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, ప్రజా సంక్షేమం, కార్మిక హక్కులు, సంపద పునర్విభజన వంటి భావనలు నేటి జన్ జీ తరంలో మళ్లీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక హక్కుల కోసం నిలబడుతున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. స్వేచ్ఛా మార్కెట్ అన్నింటి సమస్యను పరిష్కరిస్తుంది అనే భావనలో నిజం లేదని, దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ బాధ్యత, ప్రజా జోక్యం, సామాజిక హక్కులు, కార్మిక హక్కులు, సంపద పునర్విభజన వంటి అంశాలన్నీ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న క్రమాన్ని గమనించవచ్చు. సోషలిజం గత చరిత్ర కాదని, సంక్షోభాల సుడిగుండమైన పెట్టుబడిదారీ వ్యవస్థను బద్దలు కొట్టగలిగేలా నూతన పరిస్థితుల్లో కొత్త ప్రశ్నలతో మళ్లీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భావనగా ముందుకు రావడం శుభపరిణామమే. ఏడాది కాలంలోనే న్యూయార్క్ మొదలుకొని బెర్లిన్ వరకు విస్తరించిన వామపక్ష దృక్పథం, సోషలిజం భావనలు మరింత వేగంగా ప్రపంచ గమనాన్ని మార్చే మహోన్నత శక్తిగా మారాలని కోరుకుందాం.
సెల్ : 9059837847, ఫ్రీలాన్స్ జర్నలిస్టు


