Monday, February 24, 2025
Homeస్వర్ణాంధ్ర దిశగా…

స్వర్ణాంధ్ర దిశగా…

పది సూత్రాలతో విజన్‌
. ప్రపంచానికే మార్గదర్శిగా రాష్ట్రాభివృద్ధి
. పట్టాలెక్కిన అమరావతి, పోలవరం
. ‘సూపర్‌సిక్స్‌’ అమలుకు కట్టుబడి ఉన్నాం
. 2029 నాటికి అర్హులందరికీ శాశ్వత గృహాలు
. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వర్ణాంధ్ర సాధన దిశగా అంచంచల నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికే కాక ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా, అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని గవర్నర్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. స్వర్ణాంధ్ర-2047కు పది సూత్రాలతో విజన్‌ రూపొందించాం. పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి భద్రత, రైతు-అగ్రిటెక్‌, గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌, వ్యయ నియంత్రణ, విద్యుత్‌-ఇంధనంపై ప్రత్యేక దృష్టి సారించామని, పీపుల్స్‌ ఫస్ట్‌’ విధానంతో స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా సమగ్ర రోడ్‌మ్యాప్‌ రూపొందించామని గవర్నర్‌ చెప్పారు. ఏపీకి విస్తార సముద్రతీరం, పుష్కలంగా సహజ వనరులు, నైపుణ్యం కల్గిన శ్రామిక శకిత, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజెన్‌, సెమి కండక్టర్‌ తయారీ తదితర రంగాలు వృద్ధికి అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించి వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం కొనసాగించాలన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, రాష్ట్రం ఎంతో నష్టపోయిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్న గవర్నర్‌… అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. మెగా డీఎస్సీపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్‌… తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడిరచారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని, సమాజానికి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు వెల్లడిరచారు. స్థానికసంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులందరికీ శాశ్వత గృహ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్‌ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘కేవలం ప్రతిభ ఆధారంగానే విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ఇటీవల 9 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని తెలిపారు. మన బడి – మన భవిష్యత్తు’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. టూరిజంలో పెట్టుబడులు పెరిగాయని, ఎంఎస్‌ఎంఈలకు అండగా ఉన్నామని, అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
2027 నాటికి పోలవరం పూర్తి
రాష్ట్రంలో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమాలు చేపట్టామని, కీలకమైన పోలవరం ప్రాజెక్టు 2027నాటికి పూర్తి చేస్తామని గవర్నర్‌ స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని, రాయలసీమలో కరవు అనేదే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందన్న గవర్నర్‌… రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపామని గుర్తుచేశారు. వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ జరిగిందని… ఎక్సైజ్‌, ఇసుకలో లోపభూయిష్ట విధానాలు జరిగాయన్న గవర్నర్‌, ప్రభుత్వ పన్నులను సైతం దారి మళ్లించారని చెప్పారు. ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీ విధానం తెచ్చామని… ప్రభుత్వం గత 8 నెలల్లోనే గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. గతప్రభుత్వం నిలిపిన 93 కేంద్ర పథకాల్లో 74 పథకాలు పునరుద్ధరించామని, నీటిపారుదల, రోడ్ల సంబంధిత అలాగే పోలవరంతో పాటు, మరో కీలకమైన అమరావతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామని, మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్‌ ఏర్పాటు హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్రానికి 6.5లక్షల కోట్ల పెట్టుబడులు
సుస్థిర వృద్ధికి దోహదపడే 22 కొత్త విధానాల ద్వారా బలమైన పునాది వేశామన్న గవర్నర్‌, గూగుల్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌, టాటా పవర్‌ కంపెనీలను ఆకర్షించినట్లు వెల్లడిరచారు. గ్రీన్‌కో గ్రూప్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ తదితర కంపెనీల ఎంవోయూల ద్వారా ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడిరచారు. వీటి ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్లకు విస్తరించిందని అన్నారు.తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు వృద్ధి చెందాయని అన్నారు. ఈ సందర్భంగా సంఘ సంస్కర్త కందుకూరి వ్యాఖ్యలను గవర్నర్‌ ప్రస్తావించారు. ఉదయం 10 గంటలకు శాసనసభకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు