Saturday, November 15, 2025
Homeవిశ్లేషణఅదానీ-గూగుల్‌ డేటా సెంటర్‌ మనకు ఉపయోగమా?

అదానీ-గూగుల్‌ డేటా సెంటర్‌ మనకు ఉపయోగమా?

- Advertisement -

చలసాని శ్రీనివాసరావు

గూగుల్‌, అదానీ, ఎయిర్‌టెల్‌ కలిసి విశాఖపట్నంలో 1-గిగావాట్‌ మెగా డేటా సెంటర్‌ కాంపస్‌ (ఏఐ హబ్‌) పెడతారనే వార్తలు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రూ. 1.3 లక్షల కోట్లు అయిదు సంవత్సరాల్లో పెట్టుబడి పెడతారని, దీనివల్ల భారీగా ఉపాధి కల్పన జరుగుతుందని ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణే మా లక్ష్యం అని ప్రకటించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా ఉద్యోగాలు డేటా సెంటర్లో ఎక్కువగా కాకపోయినా అనుబంధంగా ఎనర్జీ, టెలి రంగాలలో కలిపి మూడు వేల నుంచి 4000 మాత్రం రావచ్చని అంచనా. తర్వాత కాలంలో పరోక్షంగా అంతకంటే 42 వేల మందికి ఉపాధి కలుగుతుందనే అంచనా ఎంతవరకు నిజమో తెలియదు. అమెరికాలో, మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో డేటా సెంటర్లు వద్దని పర్యావరణ పరంగా, సామాజికపరంగా నష్టమని, అన్ని ఉద్యోగాలు రావని, భారీ మొత్తంలో నీరు, విద్యుత్‌ అవసరం అంటున్నారు. ఈ ఒక్క సెంటర్‌ పెడితేనే ఐదు నుంచి ఆరు గిగావాట్లు అవసరమని అంత విద్యుత్‌ ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సెంటర్‌ పర్యావరణానికి నష్టమని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ మొత్తం అవసరమయ్యే విద్యుత్‌లో కొంత అంటే ఒకటి నుంచి రెండు గిగావాట్లు మాత్రం సొంతంగా ఉత్పత్తి చేస్తామని, మిగతాది మన దేశ ప్రధానమంత్రి ఆప్తుడుగా ఉన్న అదానీ తీసుకొస్తారని అంటున్నారు. ఒక పక్కన విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గత సంవత్సరంలోనే 6000 ఉద్యోగాలు మన తెలుగు బిడ్డలు కోల్పోయారు. అది వార్తల్లోకి రానివ్వకుండా వచ్చే ఏడు సంవత్సరాల్లో 3000 ఉద్యోగాలు వస్తాయని చెప్తుంటే రాష్ట్రం ఏమైపోతుందో అని ఆందోళన కలుగుతోంది.
అభివృద్ధి అంటే సామాన్య మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి, వాళ్లకు ఉద్యోగాలు కల్పించటం. కూటమి ప్రభుత్వంలో ఈ లక్ష్యం కనిపించకుండా పోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు డేటా సెంటర్‌ రావటం నైతికంగా బలం ఇస్తుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలపైగా ఆదాయం వస్తుందని అంచనా. కమ్యూనికేషన్‌ పరంగా చెన్నై, ముంబైతో పాటు విశాఖపట్నంలో అండర్‌ సీ కేబుల్‌ ద్వారా ఇంకొక గేట్‌ వే వస్తుంది. ఇది తీసుకురావడంలో ఐటీ మంత్రి లోకేశ్‌ శక్తిని మించి కృషి చేశారనే చెప్పాలి. కానీ డేటా సెంటర్ల పైన అమెరికా లాంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితి వుందో అధ్యయనం మాత్రం చేయలేదని అనిపిస్తుంది. ఐర్లాండ్‌లో డేటా సెంటర్‌ పెట్టాలని గూగుల్‌ ప్రయత్నం చేసింది. ‘తమ దేశ ప్రజలంతా కలిసి వాడేంత పవర్‌ ఒక్క మీ డేటా సెంటర్‌కే ఇవ్వాలి, మా దేశంలో మీ డేటా సెంటర్‌ వద్దు’ అని ఐర్లాండ్‌ తిరస్కరించింది. నెదర్లాండ్స్‌లో డేటా సెంటర్‌ పెట్టాలని మెటా ప్రయత్నం చేయగా, ఆక్కడి ప్రజలు వ్యతిరేకించటంతో వారి అప్లికేషన్‌ను తిరస్కరించింది నెదర్లాండ్స్‌ ప్రభుత్వం. పైగా దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టటానికి వీలులేదని ఏకంగా చట్టమే చేసింది. డెన్మార్క్‌ కూడా పెద్ద డేటా సెంటర్లు పెట్టటం వలన పవర్‌ గ్రిడ్లు దెబ్బతినటం తప్ప ఉపయోగం తక్కువ అని అనుమతులు ఇవ్వటం లేదు. లాటిన్‌ అమెరికా దేశాలైన చిలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో డేటా సెంటర్‌ పెట్టాలని గూగుల్‌ ప్రయత్నించింది. ఎలాగోలా ఆ ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ అక్కడి ప్రజలు, పర్యావరణవేత్తలు నిరసన వ్యక్తం చేయటంతో ఈ పెద్ద కంపెనీలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నాయి. ఇక అమెరికాలో డేటా సెంటర్‌ హబ్‌గా పేరొందిన రాష్ట్రం వర్జీనియా. పవర్‌ గ్రిడ్‌ మీద పడే లోడు, పెరిగిన కరెంట్‌ బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్‌, శబ్దాలు, విపరీతమైన నీటి వినియోగం, అవి తీసుకునే వందల ఎకరాల భూమి, ఇవన్నీ గమనించాక వాటిలో వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన అక్కడి ప్రజలు ‘నిమ్బే’ (నాట్‌ ఇన్‌ మై బ్యాక్‌ యార్డ్‌) అంటూ వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా వాటికి మద్దతుగా మాట్లాడితే అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా వాటిని వ్యతిరేకిస్తున్నాయి. చెప్పులు, బట్టలు కూడా ఇక్కడే తయారు చేయాలని, విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేయటానికి వీలులేదని రోజూ గొడవ చేసే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా వీటి విషయంలో మాత్రం ఏమీ అనటం లేదు. ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది. మన మీద నీటి వనరులు ఎక్కువ. అయినా సరే డేటా సెంటర్లు పెట్టటానికి ఒప్పుకోక పోవటంతో ఈ పెద్ద కంపెనీలు సముద్రం ఒడ్డున ఉండే మూడో ప్రపంచ దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ-వేస్ట్‌ ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో డంప్‌ చేస్తూ ఉంటాయి. కొంచెం అటుఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివే! ఇక్కడ విషాదం ఏమిటంటే మన ప్రభుత్వాలు వారు అడగని రాయితీలు కూడా ఇచ్చి, లాభనష్టాలు బేరీజు వేసే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా వాటికి ఎర్ర తివాచీ పరవటం!!
కడప ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో రాకుండా, విశాఖపట్నం కర్మాగారానికి సొంత గనులు ఇవ్వకుండా, అదానీ కంపెనీలకు ఇచ్చే దానికంటే భారీగా వడ్డీలు వేయటం చూస్తూనే వున్నాం. విశాఖ ఉక్కుకు కేంద్రం మొన్న ప్యాకేజీ ఇచ్చానని చెప్పి బ్యాంకుల వడ్డీలు కట్టేసి, పద్ధతి ప్రకారం నాశనం చేస్తుంటే మన ప్రభుత్వానికి నోరు రావటం లేదు. పైగా మిట్టల్‌ ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన రాష్ట్ర ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రిని కలిసి క్యాపిటీవ్‌ మైన్‌ కేటాయించమని అడిగారంటే ప్రజల ప్రయోజనాలు ఎంతగా తుంగలోకి తొక్కుతున్నారో అర్థం అవుతుంది. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో చాకచక్యంగా కియా ఫ్యాక్టరీ తీసుకువచ్చారు. అనంతపురంలో ఎకరా పాతికవేలు కూడా చేయని ప్రాంతాలలో భూమి ధర ఈరోజు కోట్ల రూపాయలకు చేరింది. అత్యధిక భూభాగం ఇంకా బడుగు బలహీన వర్గాలు స్థానికుల చేతుల్లోనే ఉంది. వాళ్ల పిల్లలు అత్యున్నత విద్యను అభ్యసిస్తున్నారు. జీవన స్థితిగతులు మెరుగు పడ్డాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌కి పన్నులు రాకపోయినా చుట్టుపక్కల ఫైనాన్షియల్‌ యాక్టివిటీ వల్ల రాష్ట్రానికి ఎంతో కొంత పరోక్ష ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు మాత్రం రాష్ట్రానికి నష్టం కలిగినా మోదీ చెప్పు చేతల్లో ఉన్నారనేది ఆయన ప్రతి చర్య స్పష్టం చేస్తోంది. విశాఖపట్నంలో ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల భూమి గట్రా ఇస్తుందో, ఎక్కడి నుంచి నీటిని సమకూరుస్తుందో, ఎన్ని దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కట్టిన పన్నులలోంచి వాళ్లకు రాయితీలు ఇవ్వాలో ఈ వివరాలు పారదర్శకంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. అయితే నేడు ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం నైతికంగా ప్రచారం కోసం ఉపయోగపడుతుంది. విశాఖపట్నం ప్రపంచ మ్యాప్‌లో ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది. కానీ రేపు గంగవరం పోర్టు లాగా మొత్తం ఆ గుజరాత్‌కు చెందిన కార్పొరేట్‌ వ్యాపారుల చేతుల్లో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని అంటే నేడు అతిశయోక్తిగా అనిపిస్తుందేమో గాని భవిష్యత్‌ మాత్రం ప్రమాదకరంగా ఉంటుందనే విషయం స్పష్టం. చాలా గొప్పగా అభివృద్ధి చెందే అవకాశాలని చేచేతులా పక్కనపెట్టి ఆ గుజరాత్‌ వ్యాపారుల కాళ్లకు నమస్కారాలు పెట్టి వాళ్ల కంపెనీలు సాధించామని చెబుతున్నారు. వాళ్ల కోసం మన ప్రజల భూములని, పన్నులని రాయితీల పేరుతో ఎందుకు ఇస్తున్నారో ఆలోచించాలి. తెలుగుజాతి బిడ్డలకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయితీలను కూటమి ప్రభుత్వం వదిలేసింది. లాస్‌ఏంజెల్స్‌లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్స్‌. నిప్పుపడితే అంతే సంగతులు. ఇప్పటికే భూతాపం. ఇది మరింత పెరుగుతుంది. కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి. కారణం డేటా సెంటర్‌ బకాసురిడిలా కరెంటు తినేస్తుంది. ఒక్క డేటా సెంటర్‌ లక్ష కుటుంబాల విద్యుత్‌ను లాగేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు వెలుస్తున్నాయి. డేటా సెంటర్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండలేని పరిస్థితి వస్తుంది. ప్రపంచ దేశాల అనుభవాన్ని బేరీజు వేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు