Homeవిశ్లేషణపేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం

పేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం

- Advertisement -

జనక మోహనరావు దుంగ

విశ్వగురువు’గా అవతరించడానికి భారతదేశం వేస్తున్న అడుగులు, ప్రపంచ వేదికపై సాధిస్తున్న ఆర్థిక వృద్ధి సాధిస్తే ప్రతి భారతీయుడికి గర్వకారణమే. మన దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని ప్రభుత్వం చెప్తోంది. అంతరిక్ష పరిశోధనలలో, సాంకేతిక రంగాలలో మన విజయాలు ప్రశంసనీయం. మెరిసే ఆకాశహర్మ్యాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ విప్లవం గురించి మనం గర్వంగా మాట్లాడుకుంటాం. అయితే, ఆర్థిక వృద్ధిలో, మన దేశంలో ఒక గణనీయమైన వర్గం ఇప్పటికీ పేదరికంలోనే జీవిస్తోంది. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు. అది అవకాశాల లేమి. మంచి చదువు లేకపోవ డం వలన తక్కువ వేతనాలకే పనిచేయాల్సి రావడం, తద్వారా అదే పేదరికం మళ్లీ వారి పిల్లలకు సంక్రమించడం అనేది ఒక విషవలయంలా మారింది. మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకునేటప్పుడు, కడుపునిండా తిండి దొరకని బాల్యాన్ని, సరైన వైద్యం అందక బాధపడుతున్న వృద్ధులను, కూలికి వెళ్లినా కనీస అవసరాలు తీరని దినసరి కూలీలను మనం ఎలా విస్మరించగలం? ‘‘ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుందాం’’ అని ఆశగా బతికే మన సామాన్య ప్రజల నిరీక్షణ ఎప్పుడు తీరుతుంది? అభివృద్ధి సంపన్నులకు మాత్రమే పరిమితమైతే, అది అసమానతలకు ఆజ్యం పోసి సమాజ పునాదులను బలహీనపరుస్తుంది.
గత దశాబ్దంలో పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది అనడంలో సందేహం లేదు. బహుముఖ పేదరిక సూచీ 2015-16 నుంచి 2019-21 మధ్యకాలంలో దేశంలో దాదాపు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పాలకులు చెప్తున్నారు. ఈ సూచీ పేదరికాన్ని కేవలం ఆదాయం లేకపోవడం కాకుండా, విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాలలో ఉండే లేమిని పరిగణనలోకి తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిష్పత్తి 32.59% నుంచి 19.28%కి తగ్గగా, పట్టణ ప్రాంతాలలో ఇది 8.65% నుంచి 5.27%కి తగ్గింది. గ్రామీణ భారతదేశంలో వేగవంతమైన పురోగతి కనిపిస్తున్నప్పటికీ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పేదరికం తీవ్రత గ్రామాలలోనే అధికంగా ఉంది. అయినప్పటికీ, నివేదికలు ఆశాజనకంగా ఉన్నా, వాస్తవ సంఖ్యలు మన ముందు ఇంకా పెద్ద సవాలును ఉంచుతున్నాయి. 2023 లో విడుదలైన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీ ప్రకారం, భారతదేశంలో ఇప్పటికీ 23 కోట్లకు పైగా ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నారు. అంతేకాక, ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే ‘తీవ్ర పేదరికం’లో ఉన్నవారి సంఖ్య 2024 నాటికి సుమారు 12.9 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఈ గణాంకాలు చూస్తే అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే మన లక్ష్యం సాకారం కావాలంటే ఇంకా ఎంత దూరం ప్రయాణించవలసి ఉంటుందో స్పష్టమవుతుంది.త
అసమానతలు – అభివృద్ధికి అడ్డుగోడ: పేదరికం, అసమానత అనేవి ఒకే నాణేనికి రెండు వైపుల్లాంటివి. అధిక ఆర్థిక వృద్ధి, జీడీపీ వృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదు. దేశంలో సంపద కేంద్రీకరణ పెరిగింది. పారిశ్రామిక, సేవారంగాల వృద్ధి ఎక్కువ మందికి ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, ఆ ఉద్యోగాలు ఎక్కువగా తక్కువ వేతనాలు ఇచ్చే అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దీని ఫలితంగా, పేదరికం నుంచి బయటపడిన వారు కూడా సులభంగా తిరిగి పేదరికంలోకి జారిపోయే ‘దుర్బలత్వం’ అనే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. సుమారు 18.7% మంది ప్రజలు అంటే 26 కోట్లకు పైగా బహుముఖ పేదరికానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు, ఉచిత రేషన్‌, ఆవాస్‌ యోజన వంటివి అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు నిస్సందేహంగా కోట్ల మందికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే కేవలం తాత్కాలిక సహాయం కాకుండా పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి మూల కారణాలపై దృష్టి సారించాలి. నాణ్యమైన విద్య పేదరికం నుంచి బయటపడటానికి అత్యంత శక్తిమంతమైన సాధనం. పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం మాత్రమే కాక, నాణ్యమైన బోధన అందించాలి. యువతకు మార్కెట్‌ అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ కల్పించాలి. వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమలు, సేవల రంగానికి మారుతున్న శ్రామిక శక్తికి తగినన్ని, మెరుగైన వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు సృష్టించాలి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. ప్రతి పౌరుడికి సులభంగా, చౌకగా వైద్య సదుపాయాలు అందేలా చూడాలి. ఎందుకంటే, ఒక్క అనారోగ్య ఖర్చు కూడా ఒక పేద కుటుంబాన్ని మళ్లీ పేదరికంలోకి నెట్టేయగలదు.
పేదరికం లేని భారతదేశం అనేది మనందరి ఉమ్మడి లక్ష్యం. ఇది స్పష్టమైన గణాంక విశ్లేషణ, పారదర్శక విధానాల అమలు, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలను చేర్చాలనే నిబద్ధత ద్వారానే సాధ్యమవుతుంది. పేదరికాన్ని ఒక రాజకీయ సమస్యగా కాకుండా, మానవతా సమస్యగా, దేశ అభివృద్ధికి అడ్డుకట్టగా పరిగణించాలి. ప్రతి పౌరుడు గౌరవంగా, సురక్షితంగా జీవించే హక్కును కలిగి ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఈ అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరినప్పుడే, మనం నిజమైన అభివృద్ధిని సాధించినట్లు. సమానత్వం మన ఆశయం కావాలి. అది మన చర్యలలో ప్రతిబింబించాలి. ప్రతి భారతీయుడు గౌరవంగా, కడుపునిండా తిని, పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలిగినప్పుడే, మన ‘విశ్వగురువు’ కీర్తి నిజమవుతుంది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పౌరులు అందరూ ఏకమై ఈ సమస్యను ఎదుర్కోవాలి. కేవలం దాతృత్వంతోనే పేదరికాన్ని నిర్మూలించలేం. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే దీర్ఘకాలిక విధానాలు అవసరం. ఈ దిశగా పయనించడానికి, ప్రభుత్వాలు, పౌర సమాజం ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలి.
` 8247045230

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు