Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్అద్దె బస్సుల యాజమాన్యంసమ్మె బాట

అద్దె బస్సుల యాజమాన్యంసమ్మె బాట

- Advertisement -

. ఏపీఎస్‌ఆర్టీసీకి నాలుగు రోజుల గడువు
. రూ.20 వేల అద్దె కోసం డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:ఏపీఎస్‌ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇచ్చిన యాజమాన్య సంఘాలు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. బస్సుల అద్దె పెంచకపోతే ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. ఇంధన, నిర్వహణ వ్యయాల భారానికి తోడు నష్టం పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. తమ డిమాండ్‌పై నిర్ణయానికిగాను ఆర్టీసీకి నాలుగు రోజుల గడువు ఇచ్చాయి. సానుకూల స్పందన రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులను నిలిపివేస్తామని తేల్చిచెప్పాయి. ‘స్త్రీ శక్తి’ పథకం కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగిందని, నెల అద్దె కనీసం రూ.20 వేల మేర పెంచాలని, రూ.5 వేలు పెంచడం అన్యాయమని సంఘాలు పేర్కొన్నాయి. ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) పెరిగిందని చెప్పుకుంటున్న అధికారులు, మా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంధన ఖర్చు, బస్సుల నిర్వహణ, విడిభాగాల ధరలు అధికమయ్యాయని, అద్దె పెంచకపోతే బస్సులు నడపడం సాధ్యం కాదని అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్‌ అధ్యక్షడు వెంకటేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. నాలుగు రోజుల్లో సానుకూల స్పందన రాకపోతే సమ్మె తప్పబోదని తేల్చిచెప్పారు. స్త్రీ శక్తి పథకం అమలయ్యాక 50 మంది ప్రయాణించాల్సిన బస్సుల్లో 100 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బస్సులపై ఒత్తిడి పెరిగి మరమ్మతుల ఖర్చు అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు. డ్రైవర్లు, కండెక్టర్లు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని, అనేక చోట్ల బస్సులకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాలపరిమితి ముగిసిన బస్సులను మార్పులు చేసి నడపాల్సిన పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. ఈ పరిస్థితులన్నింటిని దృష్ట్యా కొంతకాలంగా అద్దె పెంచాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరితే… నెలకు అదనంగా రూ.5,200 చెల్లించేందుకు ఆర్టీసీ సిద్ధమైందన్నారు. స్వల్ప పెంపుదల అక్కరకు రాదని, సమగ్రంగా చర్చించి అద్దె మరింత పెంచాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. ఇదే క్రమంలో సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ డిపోలలో 30 శాతానికిపైగా అద్దె బస్సులే నడుస్తున్నాయి. 11 వేల బస్సుల్లో సుమారు మూడు వేల వరకు అద్దె బస్సులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వరంగ సంస్థలో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరిగితే ఇలాంటి సమస్యలు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఆర్టీసీ ఆస్తులు, భూములను కారుచౌకగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. విజయవాడలోని ఆర్టీసీ గవర్నరుపేట 1, 2 డిపోలను లులూ కంపెనీకి అప్పగించే నిర్ణయం చర్చకు దారితీసింది. ఆర్టీసీలో ప్రైవేటీకరణ విధానాలతో ఈ దుస్థితి నెలకొన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయసమ్మతమైన అద్దె బస్సుల యాజమాన్యం డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ప్రజారవాణా వ్యవస్థకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు