Homeఅమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్

అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్

- Advertisement -

. రూ.1,299 కోట్లతో నిర్మాణం
. మరో రూ.1,234 కోట్లతో ఉద్యోగుల నివాస సముదాయం
. భారీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
. ఇందుకోసం 22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ
. కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో కొలువుదీరనున్నాయి. దాదాపు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం నిర్మితమవుతుంది. అలాగే అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 31.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 టవర్లతో నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఆధునిక కమÖ్యనిటీ హాల్స్, గ్రీన్ ఎనర్జీ సదుపాయాలు కల్పించనున్నారు. ప్రాజెకు సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సీఆర్‌డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.
సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
ఏపీ రాజధాని అమరావతిలో ‘సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని బలోపేతం చేయడానికి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచి పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ కీలక నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా.. పాలన సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి ఆకాంక్షలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుం దన్నారు. ఏపీలో ప్రపంచస్థాయి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
రెండేళ్ళ కృషి ఫలించింది: పెమ్మసాని
రెండేళ్ళ కృషి ఫలించిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాజ్యసభ ఎంపీ అభ్యర్థి సానా సతీష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం మారిన తరువాత నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ ప్రాధాన్యంగా తీసుకుని రెండేళ్లపాటు నిరంతరం వెంటపడి ఆమోదం సాధించామని తెలిపారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంతో కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నిర్మలా సీతారామన్ సహకారంతో ఈ ఆమోదం సాధ్యమైందని పెమ్మసాని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ మెట్రో విస్తరణ
అహ్మదాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టే రెండవ దశ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,169 కోట్ల అంచనా వ్యయంతో చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించింది. కొత్త నిర్మాణంతో ప్రస్తుతమున్న మెట్రోను విమానాశ్రయంతో పాటు కామన్‌వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్‌తో అనుసంధానం చేయొచ్చు. మొత్తం 6.032 కి.మీల కొత్త కారిడార్‌ను రెండవ దశ పనుల్లో భాగంగా నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న అహ్మదాబాద్గాంధీనగర్ కారిడార్‌తో నివాసవాణిజ్య హబ్‌లను కలుపుకుంటూ నూతన కారిడార్ నిర్మాణం జరగబోతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు