Sunday, January 18, 2026
Homeసంపాదకీయంఅమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలు

అమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -

రాజకీయ అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు. కొందరికి అవి అవ్యక్తంగా ఉండొచ్చు. మరి కొందరికి వ్యక్తంగా ఉండొచ్చు. కానీ ప్రత్యర్థులను దుయ్యబట్టడానికి కుటిల రాజకీయాలకు దిగడం అమిత్‌ షా లాంటి బీజేపీ నాయకులకే సాధ్యం. ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే నెల తొమ్మిదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. మహారాష్ట్ర గవర్నర్‌ స్‌.పి. రాధాకృష్ణన్‌ ను ఎంపిక చేసింది. ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్‌ రెడ్డిని రంగంలోకి దించింది. పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోకసభలో ఎన్‌.డి.ఎ.కు 293 మంది, రాజ్యసభలో 133 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీల వారు కూడా బీజేపీ అభ్యర్థిని సమర్థించవచ్చు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఎంపిక చేసిన పూర్వ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డిని సమర్థించేవారు లోకసభలో 234 మంది, రాజ్యసభలో 79 మంది ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి అధికార పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసంగానే కనిపిస్తుంది. కానీ సుదర్శన్‌ రెడ్డి మచ్చలేని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి. ఆయనకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అయితే మానవ హక్కుల పరిరక్షణకోసం పాటుపడే న్యాయమూర్తిగా ఖ్యాతి ఉంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సుదర్శన్‌ రెడ్డిని నక్సలైట్‌ అనేశారు. బీజేపీ నేతల అలవాటు ప్రకారం నక్సలైట్ల సమర్థకుడు, అర్బన్‌ నక్సల్‌ అన్నా కొంత ఔచిత్యం ఉండేది. కానీ అమిత్‌ షా సుదర్శన్‌ రెడ్డికి నేరుగా నక్సలైట్‌ ముద్ర వేసేశారు. చత్తీస్‌ఘడ్‌లో నక్సలిజాన్ని అణచడానికి అప్పటి బీజేపీ ప్రభుత్వం కొందరు గిరిజనులకు ఆయుధాలిచ్చి నక్సలైట్ల్ల నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజల మీదకే తోసేసింది. మావోయిస్టుల్లో గిరిజనులు అధిక సంఖ్యలోనే ఉంటారు. అంటే గిరిజనులకు మధ్యే తంపులు పెట్టే పనికి బీజేపీ ఒడిగట్టింది. ఇదంతా జరిగినప్పుడు అమిత్‌ షా దిల్లీ రాజకీయాల్లో లేరు. కానీ సల్వాజుడుం చట్ట విరుద్ధమైందని, రాజ్యాంగ వ్యతిరేకమైందని న్యాయమూర్తులు సుదర్శన్‌ రెడ్డి, ఎస్‌.ఎస్‌. నిజ్జర్‌ తీర్పు చెప్పారు. ఈ తీర్పును సుదర్శన్‌ రెడ్డిని విమర్శించడానికి అమిత్‌ షా వాటంగా వినియోగించుకున్నారు. న్యాయమూర్తులకూ రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సుదర్శన్‌ రెడ్డికి నికరమైన రాజకీయ భావాలు ఉన్న దాఖలాలు లేవు. అయినా న్యాయమూర్తులు చట్టం ప్రకారం, రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్తారే తప్ప తమ రాజకీయ భావాల ప్రభావం చూపే తీర్పులు చెప్పరు. అయినా ఆ తీర్పు ఏ న్యాయమూర్తులు ఇచ్చారు అన్నది ప్రధానం కాదు. అది సుప్రీంకోర్టు తీర్పు. కానీ అమిత్‌ షాకు ఇలాంటి ధర్మ సూక్ష్మాలతో ఎటూ పనిలేదు. నందినీ సుందర్‌, ఇతరులు 2007లో సల్వా జుడుం ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసుల మానవ హక్కులను హననం చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై 2011లో తీర్పు వచ్చింది. నిజానికి పూర్వ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి, మరో న్యాయమూర్తి నిజ్జర్‌ ఇచ్చిన తీర్పు అమిత్‌ షా ఆరోపిస్తున్నట్టుగా నక్సలైట్లకు అనుకూలమైంది కాదు. వారిని సమర్థించేదీ కాదు. ప్రభుత్వ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నడవడికను ఈ తీర్పు తప్పు పట్టింది. దానీ ఆధారంగా సుదర్శన్‌ రెడ్డిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నక్సలైట్‌గా ముద్ర వేయడం రాజకీయ నైచ్యానికి తార్కాణం.
అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన 18 మంది పూర్వ న్యాయమూర్తులు తీవ్రంగా విమర్శించారు. అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు కోర్టుల తీర్పును ప్రశ్నార్థకం చేస్తాయని ఈ న్యాయ మూర్తులు పేర్కొన్నారు. పూర్వ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి మీద రాజకీయ కక్షతో అపఖ్యాతి పాలు చేయడాన్ని ఈ న్యాయమూర్తులు ఖండిరచారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సల్వా జుడుం కేసులో తీర్పును తప్పు పట్టడం అంతకన్నా హేయమైనపని. సల్వా జుడుంపై సుప్రీంకోర్టు తీర్పును అమిత్‌ షా వక్రీకరించడాన్ని ఈ 18 మంది పూర్వ న్యాయమూర్తులు తప్పుపట్టారు. అమిత్‌ షా ప్రకటన ఎంత దోషపూరితమైందో ఎత్తి చూపిన పూర్వ న్యాయమూర్తులు అందరూ నికార్సైన చరిత్ర ఉన్నవారే. సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్‌, అభయ్‌ ఓక్‌, గోపాల గౌడ, విక్రంజిత్‌ సేన్‌, కురియన్‌ జోసెఫ్‌, మదన్‌ బి.లోకూర్‌, జాస్తి చలమేశ్వర్‌ లాంటి వారు ఉన్నారు. వీరితో పాటు ఇతర న్యాయమూర్తులదీ నిష్కళంకితమైన చరిత్రే. ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలతో ముడివడిరది కావొచ్చు. అది సైద్ధాంతిక పోరాటమూ అయి ఉండొచ్చు. సుదర్శన్‌ రెడ్డిది కూడా ఇది సైద్ధాంతిక పోరాటమే అంటున్నారు. ఈ ఎన్నికలో గెలుస్తానన్న ధీమా ఆయన వ్యక్తం చేయలేదు. ఎన్‌.డి.ఎ. శిబిరంలో పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 426 మంది ఉండొచ్చు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌.డి.ఎ. అభ్యర్థిగా పోటీ చేస్తున్న సి.పి. రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందినవారు. సుదర్శన్‌ రెడ్డి తెలంగాణాకు చెందినవారు. ఒక వేపున ప్రతిపక్ష శిబిరంలో ఉన్న డి.ఎం.కె. స్థానిక రాజకీయాల ఆధారంగా రాధాకృష్ణన్‌ను సమర్థించవచ్చునన్న ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ ఇది సైద్ధాంతిక పొరాటమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్మొహమాటంగా చెప్పేశారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ కేంద్రంలో బీజేపీ సర్కారులో భాగస్వామి. అయినా తెలుగు దేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం సుదర్శన్‌ రెడ్డిని సమర్థించవచ్చుననే మాటా వినబడ్తోంది. కానీ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్‌ ఎన్‌.డి.ఎ. అభ్యర్థిని ప్రకటించగానే దిల్లీ దాకా వెళ్లి తాము రాధాకృష్ణను సమర్థిస్తామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం ఎంపీల వైఖరి మారొచ్చునన్న చర్చా జరుగుతోంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్లగలరు. రాజకీయ వైఖరిని అమాంతం మార్చేయడంలో ఆయన ఆరితేరిపోయారు. అయితే ఒకవేళ తెలుగు దేశం ఎంపీలు రాధాకృష్ణన్‌కు ఓటు వేయకుండా ఉంటే తరవాతి రాజకీయ పర్యవసనాలు భరించవలసి వస్తుంది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనతో దూరంగా ఉంటున్న కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ప్రతిపక్ష అభ్యర్థినే సమర్థించే అవకాశం ఉంది కనక ఇది అంతిమంగా సైద్ధాంతిక పోటీగానే మిగిలిపోతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు