భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పని చేస్తున్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, లేదా గడువు కన్నా ముందే ఉద్యోగ విరమణ చేయడం ఆందోళనకరం మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలలోని లోపాలను కూడా బహిర్గతం చేస్తోంది. ప్రైవేటీకరణ మోజులో మన అంతరిక్ష పరిశోధనా వ్యవస్థల నడ్డి విరిచే విధానాలను ప్రభుత్వం అనుసరించడం కూడా ఈ రాజీనామాలకు, గడువుకు ముందే ఉద్యోగ విరమణలకు ప్రధాన కారణం. ఈ రాజీనామాల పర్వంపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఏ సంస్థలోనైనా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు, లేదా గడువుకు ముందే ఉద్యోగ విరమణలు మామూలే. కానీ ఇస్రో వదిలి వెళ్తున్న శాస్త్రవేత్తల్లో చంద్రయాన్-4, భారత అంతరిక్ష క్షేత్ర నిర్మాణం, మానవ సహిత గగన్యాన్ వంటి పథకాలలో పని చేసే వారు కూడా ఉండడం కచ్చితంగా ఆందోళనకరమైందే. గత ఏడాది కాలంలో దాదాపు 120 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఇస్రో వదిలి వెళ్లారంటున్నారు. ఈ సంఖ్య నిజానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చునన్న మాటా వినిపిస్తోంది. ఎంతమంది శాస్త్రవేత్తలు ఇస్రోను వదిలి వెళ్తున్నారు అన్న దానికన్నా ఒక్కో శాస్త్రవేత్త సొంతంగా ఒక పథకాన్ని చేపట్టి, విజయవంతం చేసేట్టు చేయడానికి వెచ్చించాల్సిన సమయం ఎంతో ఆలోచిస్తే ఈ ఆందోళన మరింత పెరుగుతుంది. రాజీనామాల పరంపరతో ప్రభుత్వం హడావుడిగా చర్యలు మొదలుపెట్టింది. వీరి రాజీనామాలను యథాలాపంగా ఆమోదించకూడదని, వివిధ పథకాల డైరెక్టర్ల సిఫార్సు మేరకు భారత అంతరిక్ష విభాగం ఆమోదం కూడా పొందాలన్న నిబంధన విధించింది. ఉపగ్రహ వాహక నౌకను తయారు చేయడంలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న విక్టర్ జోసెఫ్ లాంటి వారు సైతం ఇస్రో వదిలి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటి దాకా అంటే 2020 దాకా అంతరిక్ష రంగానికి చెందిన సకల అంశాలలోనూ ఇస్రో ఆధిపత్యమే కొనసాగేది. కానీ 2023లో మోదీ ప్రభుత్వం భారత అంతరిక్ష విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం ప్రైవేటు రంగ పాత్ర పెరిగింది. అనేక స్టార్ట్ అప్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాలు తయారు చేయడమూ మొదలైంది. ఉపగ్రహ ప్రయోగ నౌకలు కూడా ప్రైవేటు రంగంలో తయారు చేయగలుగుతున్నారు. భూమి నుంచి అంతరిక్ష కార్యకలాపలను పరిశీలించే కేంద్రాలు, అంతరిక్ష సాంకేతికతలో ప్రైవేటు రంగం పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రైవేటీకరణ వల్ల ఇస్రో మీద భారం తగ్గుతుంది అన్న కుంటి సాకులు చెప్తున్నప్పటికీ అసలు సవాలు అది కాదు. ఈ ప్రైవేటు రంగ సంస్థలు అనుభవజ్ఞులైన ఇస్రో శాస్త్రవేత్తలకు అధిక జీతభత్యాలు ఇచ్చి, సదుపాయాలు కల్పించి తీసుకెళ్తోంది. ఎంత గొప్ప శాస్త్రవేత్తకైనా ప్రైవేటు రంగానికి వెళ్లనవసరం లేని జీతభత్యాలు ఇవ్వడం ప్రభుత్వానికి కుదిరే పని కాదు. వేతన స్కేళ్ల లాంటి నియమాలకు కట్టుబడాల్సిందే. ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉన్నా ఇస్రోకే అంకితం అయి ఉండిపోవాలన్న పట్టుదల చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో ఉండకపోవచ్చు. అదీకాక ప్రైవేటు రంగంలో అయితే పరిశోధన కొనసాగించడానికి తగినంత స్వేచ్ఛ ఉంటుందని, పని సంస్కృతి సానుకూలంగా ఉంటుందని, శాస్త్ర పరిజ్ఞానంతో సంబంధం లేని ప్రభుత్వ అధికారుల పెత్తనం ఉండదని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పని చేయడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావించడంలో తప్పు లేదు. ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగంతో పోటీపడాలని నీతి వచనాలు పలికే వారికి కొదవే ఉండదు. కానీ వేతనాలు, సదుపాయాలలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం రంగం ఎందుకు పోటీ పడలేకపోతోంది అని అడిగే వారే లేరు.ప్రైవేటు రంగంలో యువ శాస్త్రవేత్తలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని, వినూత్నమైన అంశాలు కనిపెట్టే స్వేచ్ఛ ఉంటుందని, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఉండదని, వాణిజ్యపరమైన రీతిలో పని చేసే అవకాశం ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు. అంతరిక్ష వ్యవహారాల్లో ప్రైవేటు రంగం పాత్ర పెరిగిన తరవాత ఇస్రోలో అనుభవం గడించిన శాస్త్రవేత్తలకు గిరాకీ పెరిగింది. 2018-2022లో అంతరిక్ష రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టిన తరవాత ఇస్రో నుంచి 381 మంది శాస్త్రవేత్తలు వెళ్లిపోయారు. అంతకన్నా ముందు 2012 నుంచి 2017 మధ్య మరో 289 మంది ఇస్రోను వదిలేశారు. ఇటీవలే ఇస్రో 14,637 మంది కొత్త వారిని నియమించింది. ఇందులో 8700 మంది ఏ గ్రేడ్ శాస్త్రవేత్తలు. మొత్తం 18,142 మందిని నియోగించే అవకాశం ఉన్నా అంత మందిని నియమించలేకపోయారు. అనుభవజ్ఞులు వెళ్లిపోతే వారి స్థానాలు భర్తీ చేయడం అంత సులభం కాదు. రాజీనామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎదుర్కోవలసిన పెద్ద సవాలు ఇదే. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ పాత్ర పెరగాలన్నది ప్రభుత్వ విధానం. ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, భూమ్మీద నుంచి అంతరిక్ష వ్యవహారాలను పరిశీలించే కేంద్రాలు ప్రైవేటు రంగంలో పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంతరిక్ష వ్యవహారాలలో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రభుత్వ విధానం వల్ల ఉద్యోగ కల్పనా రంగంలో పోటీతత్వం పెరిగింది. వేతనాలు, ఇతర సదుపాయాలూ మెరుగయ్యాయి. అనుభవజ్ఞులైన, సామర్థ్యం గల శాస్త్రవేత్తలు ఇస్రో వదిలి వెళ్ల కూడదంటే వారి ఉద్యోగాల్లో ఎదుగుదలకు తగిన అవకాశాలు కల్పించాలి. పరిశోధన చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి. విధాన నిర్ణయాల్లోనూ తగిన స్వేచ్ఛ ఉండాల్సిందే. అంటే ప్రైవేటు రంగంలో ఉంటుందనుకునే ఆకర్షణను ఇస్రోలో కూడా కల్పించాలి. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలన్న ధ్యాస ప్రభుత్వానికి ఉంటే ఇవన్నీ ఆశించవచ్చు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ పరమ లక్ష్యం అయినప్పుడు వీటన్నింటికీ అవకాశం ఉండదు. రక్షణ విభాగంలోనే ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేస్తున్న దశలో ప్రభుత్వ రంగ వ్యవస్థల పరిరక్షణకు ప్రాధాన్యం ఉంటుందనుకోలేం. అయితే గగన్యాన్, చంద్రమండలం మీంచి నమూనాల సేకరణ, చంద్రయాన్-4 లాంటి భారీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ లక్ష్యాలు సాధించడం ఎలా అన్నది అసలు సమస్య. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అంటే ప్రభుత్వ రంగం పీక నొక్కేయడం కాకూడదు. కానీ ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆతృతలో ప్రభుత్వమే పనిగట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను బలిపెట్టిన ఉదంతాలు కొల్లలుగానే ఉన్నాయి. గగన్యాన్ అంటే మానవులు ఉండే అంతరిక్ష పరిశోధనలు, అంతరిస్ఖంలో మన పరిశోధనా కేంద్ర నిర్మాణం లాంటివి ఉదాత్తమైన లక్ష్యాలే. అవి సాధ్యం కావాలంటే ఇస్రోలో ఉన్న సమర్థులను కాపాడుకోవడానికి తగిన ఆలోచన ప్రభుత్వానికి ఉందా అనేదే ప్రశ్న.


