. తక్షణమే చర్చలు ఆపాలి
. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ఉపసంహరించాలి
. 9న సార్వత్రిక సమ్మెకు మద్దతు
. హిమాచల్ రైతులకు పరిహారం ఇవ్వాలి
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూదిల్లీ: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి జరుగుతున్న కసరత్తును సీపీఐ ఖండిరచింది. ‘కాంపాక్ట్’ వాణిజ్య ఒప్పందం భారతదేశ రైతులకు మరణ శాసనమే అవుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందని, దేశ యువత దోపిడీకి గురవుతారని, భారత్ సార్వభౌమత్వం కోల్పోతుందని పేర్కొంది. తక్షణమే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా జరిపే చర్చలను ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈనెల 1,2,3 తేదీల్లో న్యూదిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌లో జరిగిన సీపీఐ జాతీయ సమితి తీర్మానించింది. మరికొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సమితి తీర్మానాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడిరచారు. వ్యవసాయం, డెయిరీ రంగాల్లో అమెరికాకు మార్కెట్ కల్పించడం అంటే మన రైతులకు మరణ శాసనం జారీ చేయడమే అవుతుందని సీపీఐ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే నూనె గింజలు, సోయా ఉత్పత్తుల దిగుమతుల కారణంగా ధరలు పడిపోవడంతో సోయాబీన్, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తీర్మానంలో పేర్కొంది. ఈనెల 9న కార్మిక`రైతు సంఘాల సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కార్మిక సంఘాల డిమాండ్లకు మద్దతు ఇవ్వడమే కాకుండా తమ డిమాండ్ల సాధన కోసం గ్రామీణ భారతాన్ని చైతన్యవంతం చేయాలన్న నిర్ణయంతో సార్వత్రిక సమ్మెకు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొంది. కార్మిక సంఘాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకు మద్దతు ప్రకటించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా సమ్మె జయప్రదానికి పిలుపునిచ్చింది. జాతీయ సమితి సమావేశాలు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పాండా అధ్యక్షతన జరిగాయి. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల పరిశీలన ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ ఉపసంహరణకు డిమాండ్ చేయాలని జాతీయ సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఒకటి లేక రెండు నెలల్లో కొత్త ఓటర్ల జాబితాలు రూపొందించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనకు సరైన ప్రణాళిక లేదని, ఆచరణలో అర్హులైన ఓటర్లు అనేక మందికి అన్యాయం జరుగుతుందని, అందుకోసమే 2024లో లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితాల ఆధారంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, కొత్త ఓటర్ల పేర్లను మాత్రమే చేర్చాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదే విధంగా వర్షాల కారణంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రజలకు సముచిత పరిహారం డిమాండ్ చేయాలని సీపీఐ జాతీయ సమితి తీర్మానించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించినట్లు పేర్కొంది. కాగా, సమితి సమావేశాల్లో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రవేశపెట్టారు. దీనిని సెప్టెంబరు 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్‌లో నిర్వహించబోయే జాతీయ మహాసభల్లో ప్రవేశపెడతారు. ఈ ముసాయిదా తీర్మానంపై నాయకులు చర్చించారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారు. సవరణలను సూచించారు. వాటిని జాతీయ కార్యదర్శి వర్గం పరిశీలించిన తర్వాత నిర్ణయిస్తుందని, ఆపై తుది ముసాయిదా రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.