Friday, March 6, 2026
Homeవిశ్లేషణఅస్తమించిన ప్రజాసూర్యుడు

అస్తమించిన ప్రజాసూర్యుడు

- Advertisement -

గిడ్డకింద మాణిక్యం

చరిత్రలో కొందరు తమ కాలానికి సాక్ష్యంగా మాత్రమే కాదు కాలాన్ని అధిగమించి ఒక విలువగా నిలుస్తారు. వారు ఉద్యమానికి నాయకులు మాత్రమే కాదు ఒక నిశ్శబ్ద తరాన్ని తట్టిలేపే దండోర. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ ఆర్.నల్లకన్ను. ఆయన జీవితం ఒక రాజకీయ ప్రస్థానమే కాదు. ఒక సిద్ధాంతం శరీరాన్ని ధరించి సామాజిక సమస్యల పై నడిచిన యాత్ర. స్వాతంత్రోద్యమ నాయకుడిగా, రైతు సమస్యలు, వివక్ష, అంటరానితనం వంటి సామాజిక అసమానతల పై జీవితాంతం అలుపెరగని పోరాటం చేసి తన 101వ యేట అంటే 2026 ఫిబ్రవరి 25 న తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం మనకు ఒక ప్రశ్నను గుర్తుచేస్తుంది. ఒక మనిషి తన కోసం జీవించాలా ? లేక తనకంటే పెద్దదైన, తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవించాలా? అనేదే. నల్లకన్ను రెండో దారిని ఎంచుకున్నారు. అదే ఆయన్ను ఒక వ్యక్తి నుంచి సామాజిక శక్తిగా మార్చింది. ఆయన జీవిత విశేషాలను పరిశీలిస్తే 1995 సంవత్సరం తమిళనాడులో కులహింసలు చెలరేగిన కాలం. సమాజం విభజనలతో తల్లడిల్లుతున్న రోజులవి. అప్ప్పుడొక దారుణ ఘటన జరిగింది. తూత్తుకుడి జిల్లాలో ఒకే రోజు నలుగురు గ్రామస్తులు హత్యకు గురయ్యారు. వారిలో ఒకరు 84ఏళ్ల అన్నాస్వామి, నల్లకన్ను మామ. తన ఇంట్లో, నిద్రపోతున్న ఆయన్ని కిరాతకంగా నరికి చంపారు. ఒక కుటుంబానికి అది భరించలేని విషాదం. ఒక మనిషి జీవితంలో అది ఒక శూన్యాన్ని మిగిల్చే క్షణం. నల్లకన్ను ఆ వార్త విన్న వెంటనే చెన్నై నుంచి బయలుదేరారు.కాని ఒక కుటుంబ సభ్యుడిగా కాదు ప్రజానాయకుడిగా. తూత్తుకుడి చేరుకున్న ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తన మామగారి అంత్యక్రియలకు హాజరవడం. రెండోది అల్లర్లతో భయాందోళనలో ఉన్న గ్రామాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రజల మధ్య నిలవడం. నల్లకన్ను రెండో మార్గాన్ని ఎంచుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. తన వ్యక్తిగత బాధను సమాజ శాంతి కోసం త్యాగం చేసిన ఆ క్షణం, ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి చేర్చింది. ఆ సంఘటన గురించి ఎప్పుడూ ద్వేషంతో మాట్లాడలేదు. ఆయన మౌనం బలహీనత కాదు. ఒక నైతిక ధైర్యం. ఈ హత్యలపై ఒక పత్రికలో వచ్చిన వార్తపై నల్లకన్ను స్పందిస్తూ దాన్ని పెద్దగా ప్రచారం చేయోద్దన్నారు. తన మామగారి అంత్యక్రియలకు హాజరవడం కంటే, అల్లర్లతో బాధపడుతున్న గ్రామాల్లో నిర్వహించిన శాంతి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే కామ్రేడ్ నలకన్ను వ్యక్తిత్వం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అంకితభావం ఉన్న కమ్యూనిస్టుగా జీవితాంతం సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన మరణం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక యుగానికి ముగింపుగా నిలుస్తుంది. వ్యక్తిగత త్యాగం, సిద్ధాంత నిబద్ధత, సామాజిక న్యాయం పట్ల అంకితభావంతో ప్రజాజీవితాన్ని గడిపిన నాయకుల తరానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆయన సమకాలీకుడు, మార్క్సిస్టు సిద్ధాంతవేత్త కామ్రేడ్ ఎన్.శంకరయ్య తరువాత, తమిళనాడులో శతాధిక వయస్సు వరకు జీవించిన కమ్యూనిస్టు నాయకుల్లో నల్లకన్ను ప్రముఖులు. శంకరయ్య కూడా 2023లో, 101 ఏళ్ల వయసులో మరణించారు. 1925 డిసెంబర్ 25 న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన అదే సంవత్సరంలో నల్లకన్ను పుట్టారు. శ్రీవైకుంఠంలో జన్మించిన ఆయన తల్లిదండ్రులు రామస్వామి, కరుప్పాయి సాధారణ రైతులు. శ్రీవైకుంఠంలోని కోరొనేషన్ పాఠశాలలో ఎసఎసఎల్సి పూర్తి చేసి, మదురైలో ఇంటర్మీడియట్ చదివారు. స్వాతంత్య్రోద్యమం ప్రభావంతో ఉన్నత విద్యను మధ్యలోనే వదిలి, జాతీయ ఉద్యమంలో నిమగ్నమయ్యారు. 11 ఏళ్ల వయసులోనే ప్రజాజీవితం ప్రారంభమైంది. తూత్తుకుడిలో వి.ఓ.చిదంబరం పిళ్లై నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం ప్రజల్లో చైతన్యం కలిగించిన కాలం అది. హార్వీ మిల్స్ కార్మికుల సమ్మె ఆ ప్రాంతంలో ప్రజాఉద్యమానికి కేంద్రబిందువైంది. ఆ సమ్మెతో ప్రేరణ పొందిన యువ నల్లకన్ను, తన స్నేహితులతో కలిసి ఇంటింటికి వెళ్లి బియ్యం సేకరించి, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు పంపిణీ చేశారు. అదే ఆయన ప్రజాసేవా జీవితానికి శ్రీకారం. తరువాత ప్రావిన్షియల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కొంతకాలానికి కమ్యూనిస్టు పార్టీలోనే జీవితాన్ని గడిపారు. ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతీ రచనల ప్రభావం ఆయన మీద ఉండేది.కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని నిర్ణయించుకున్నారు. 1943లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ కిసాన్ సభ ద్వారా రైతులు, వ్యవసాయ కూలీలను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. జమీందారీ వ్యవస్థ నిర్మూలన, కనీస వేతనాల కోసం పోరాటం సాగించారు. రైతు నాయకుడు బి.శ్రీనివాసరావుతో కలిసి భూస్వామ్య వర్గాల ఆధిపత్యాన్ని సవాలు చేశారు. ఈ ఉద్యమం ఫలితంగా తమిళనాడు డెల్టా, దక్షిణ జిల్లాల్లో వ్యవసాయ కూలీల జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సుబ్రహ్మణ్య భారతీ కవిత్వంలోని పదాలు కేవలం కవితలు కాదు. ఒక విప్లవం. ‘ఎందుకు ఒక మనిషి మరొక మనిషి కంటే తక్కువగా పరిగణించాలి?’ అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు అడుగులు వేశారు. మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. 1949లో “దున్నేవారికే భూమి” ఉద్యమాన్ని నిర్వహించినందుకు నల్లకన్నును అరెస్టు చేసి “నెల్లై కుట్ర కేసు”లో జీవిత ఖైదు విధించారు.విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి ఆయన్ను తలక్రిందులుగా వేలాడదీసి పొడుగాటి మీసాలను పీకడమే కాకుండా వాటిని కాల్చేశారు. ఆ సంఘటన తరువాత ఆయన జీవితాంతం గడ్డం, మీసాలు లేకుండా జీవించారు. ఈ సమాజంలో ఎపుడైతే సమానత్వం ఏర్పడుతుందో అప్పుడే మీసాలు ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కానీ అది తన ఆఖరి శ్వాస వరకు నెరవేరలేదు. ఏడు సంవత్సరాల జైలు జీవితం అనంతరం, 1956లో విడుదలయ్యారు. 1960 దశకంలో కమ్యూనిస్టు పార్టీ విభజన ఆయన్ను కలచివేసింది. అయినప్పటికీ, సీపీఐలోనే కొనసాగారు. భారతదేశంలో పేదరికం, సామాజిక అన్యాయం ఉన్నంతకాలం వామపక్ష ఉద్యమం అవసరమని విశ్వసించారు. వామపక్ష ఐక్యతకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. తెల్లటి పంచె, చొక్కాతో సాధారణ జీవనం గడిపిన నల్లకన్ను కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఉద్యమకారుడు. కన్యాకుమారి నుంచి చెన్నై వరకు పాదయాత్ర నిర్వహించారు. 95ఏళ్ల వయసులో తామిరబరని నది నుంచి అక్రమ ఇసుక తవ్వకాలపై న్యాయపోరాటం చేశారు. ఆయన నిరాహార దీక్ష ఫలితంగా కోర్టు ఐదేళ్ల పాటు ఇసుక తవ్వకాలను నిషేధించింది. ఆధునిక రాజకీయాల్లో ఆడంబరాలు పెరిగినా కాని నల్లకన్ను మాత్రం నిరాడంబర జీవితాన్నే గడిపారు. సాధారణ ప్రభుత్వ గృహంలో నివసిస్తూ, తక్కువ ఆదాయంతో జీవించారు. ఆయనకు లభించిన నగదు బహుమతులను ప్రజాప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చారు. 2022లో తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసిన “తగైసాల్ తమిజర” పురస్కార నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. నల్లకన్ను జీవితం నిజాయితీ, త్యాగం, గౌరవానికి ప్రతీక. దేశ భవిష్యత్తుపై ఆయన ఎప్పుడూ ఆశావాదిగా ఉండేవారు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. విచిత్రమైన వాస్తవం ఏమిటంటే పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆయన ప్రజలచే ఎన్నడూ పార్లమెంటు లేదా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఆర్.నల్లకన్ను జీవితం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు ఒక సిద్ధాంతం, ఒక విలువ, ఒక యుగం. ఆయన మరణం ఒక ముగింపు కావచ్చు. కానీ ఆయన చూపిన మార్గం, పోరాట స్ఫూర్తి, నిబద్ధత తరతరాలకు మార్గదర్శకం.
రీసెర్చ్ స్కాలర్, రచయిత 9492164107

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు