చింతపట్ల సుదర్శన్
సాటి కుక్కలతో వీరోచితంగా పోరాడి అరిచి, గీపెట్టి, భవ్వు భవ్వులతో అదిరించి బెదిరించి సాధించి కడుపు నింపుకుని ఇంటిదారి పట్టిన డాగీ, ‘డస్ట్‌బిన్’ ల దగ్గర తన స్వేచ్ఛా విహారానికి అడ్డు వచ్చిన మనుషుల్నీ, కుక్కల్నీ ఎదిరించి నిలిచి గెలిచి నమలాల్సినవి నమిలి ఒంట్లోకి మరునాటి దాకా కావలసిన శక్తిని ‘డిపాజిట్’ చేసుకుని ఇంటి దోవ పట్టిన డాంకీ మెట్ల దగ్గర కల్సుకున్నవి.
అరుగు మీద ఎవరో కూచుని ఉన్నారు. మెళ్లో నించి వేళ్లాడుతున్న పట్టీలో బ్యాండేజి కట్టుకున్న చేయి కనిపిస్తున్నది. ఎవరా మనిషి మోర ఎత్తి మొరగనా అంది డాగీ. ప్రతి దానికీ ప్రతిపక్ష పార్టీ వాడిలా మొరగడమేనా? ఎవరో కనిపించడం లేదా? ఐ సైట్ ప్రాబ్లం వచ్చినట్టుంది నీకు అరుగు మీద విరిగిన చేతికి బ్యాండేజీతో ఉన్నది మరెవరో కాదు. మనవాడే…మన బ్రోనే అంది డాంకీ.
అవును సుమా అబ్బాయే అని నాలుక కొరుక్కుంది డాగీ. అరుగు ఎక్కి తమ తమ జాగాల్లో సెటిలయిన డాగీ, డాంకీలకు అబ్బాయి మూలుగులు వినిపించేయి. ఏమైంది బ్రో! చేతికి ఆ కట్టు ఏమిటి? అని ఆదుర్దాగా అడిగింది డాంకీ. అవును ‘బ్రో’ ఆ చేయి అలా హేంగర్‌కు తగిలించిన తెల్లచొక్కాలా ఉన్నదేమిటి అనడిగింది ఆందోళనగా డాగీ.
ఏం చెప్పమన్నారు! పుటుక్కు జరజర డుబుక్కు మే, సొమ్మొకడిది సోకు ఒకడిది అంటూ నిట్టూర్చాడు అబ్బాయి. ఇలాగ తెలుగు జాతీయాలు చెప్తే ఏం అర్థమవుతుంది కాస్త అర్థం అయ్యేట్టు చెప్పరాదూ అంది డాంకీ. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు అని పాట కూడా ఉంది. చెప్పడానికి ఏం ఉంది. చూస్తున్నారుగా నిక్షేపంగా ఉండిన నా వామ హస్తం విరిగింది. డాక్టర్ కట్టుకట్టి, రెండో మూడో వారాల దాకా బ్యాండేజీ అలంకరించిన చేతిని మోస్తూ తిరగమన్నాడు అబ్బాయి.
చేయి విరిగిందా! ఎవరితో గొడవ పడ్డావు. ఫైట్ బాగా జరిగిందా. అయినా మేం మాంసం కొట్టు దగ్గర గుంపుగా చేరి కొట్టుకుంటాం, కొట్టుకుంటాం అంటే అరుచుకుంటామన్న మాట. కానీ ఎవరికీ కాళ్లూ చేతులూ విరగవు అంది డాగీ. ఆపుతావా నీ ‘డాగరిల్’ బ్రదర్ చెప్పనీ అంది డాంకీ.
మన వాళ్లు ఎన్నికల్లో గెలిచి సర్కారు వారు అవడానికి, ఎన్ని రకాల ఉచితాలు వెతుకుతున్నారో జనాన్ని ఉచ్చులో పడెయ్యడానికి కొత్త కొత్త ఎరల్ని వెదుకుతున్నారు. వాటిల్లో ఇదొకటి. ఇదే స్త్రీ శక్తి అని నామకరణం చేసిన మహిళా ఉచిత బస్సు ప్రయాణం అదే నా చేతిని నిర్దయగా, కర్కశంగా పాశవికంగా విరిచేసింది అన్నాడు అబ్బాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మగవాడివైన నీకు ఎందుకు నచ్చుతుంది కుళ్లు, కుతంత్రం కదా అంది డాగీ. ఇస్తారయ్యా ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని ఉచితాలు ఇవ్వవచ్చో, వెదికి వెదికి కనిపెట్టి కనిపెట్టి ఇస్తారు అందువల్ల నీకు వచ్చిన కడుపునొప్పి ఏమి? అనడిగింది డాంకీ. కడుపు నొప్పి కాదు చేయినొప్పి. స్టాండులో నిలబడి నిలబడి కాలు నొప్పి. ఆధార్ కార్డులు పట్టుకుని వచ్చిన బస్సు మీదల్లా విరుచుకుపడుతున్నారు ఆడవాళ్లు. సీట్లన్నీ ఉచితమే. టికెట్లన్నీ జీరోలే. ఎలాగో కష్టపడి బస్సెక్కి ఓ సీట్లో కూచున్నా. ఆ సీట్లో తన చున్నీ వేసి, రిజర్వు చేసుకుందట ఓ ఇల్లాలు. అదీ ఒక్క సీటుకి కాదట వెనకాల ఉన్న అయిదు సీట్లకు కూడానట. నా ఖర్మ అట్లా కాలింది. ఆ దొడ్డ ఇల్లాలి గావు కేకలకు చెవులు చిల్లులు పడ్డయి. అక్కడ్నించి లేచి వస్తుంటే ఒకచోట చెప్పులతో కొట్టుకుంటున్న దృశ్యం చూసి కళ్లు బైర్లు కమ్మినవి. ఆ తోపులాటలో, నిలబడటానికి ఊతంగా పట్టుకున్న కడ్డీ కొట్టుకుని ఫట్టుమని విరిగింది చేయి. కిటికీల్లోంచి సీట్లల్లో ఆడ కూతుర్లు విసిరేసిన జేబు రుమాళ్లతో సంపాదించిన జాగీర్లకు సంబంధించిన ‘సీటు పట్టు’ యుద్ధాల కారణంగా ఎంతమంది కళ్లూ, కాళ్లూ, చేతులూ పోగొట్టుకుంటున్నారో అన్నాడబ్బాయి, చేతి కట్టుకేసి దిగులుగా చూసుకుంటూ.
కొందరు రాజకీయ నాయకులు కొన్ని నియోజక వర్గాలమీద ఇలాగే ‘దస్తీ’ లు, తువ్వాళ్లు వేసి జీవితాంతం తామే కూచుంటారు. నన్నడిగితే ఓట్ల జాబితాలు సరిచెయ్యలేని ఎలక్షన్ కమిషన్లూ, ఎన్నికలూ అవసరం లేదు. సభల్లో తువ్వాళ్లూ, చేతి రుమాళ్లూ వేసి సీట్లు సాధించమని అన్ని పార్టీల వాళ్లనూ లోపలికి తోసేస్తే సరి ‘రాజ్యము వీరభోజ్యము’ అన్న మాట కరెక్టయ్యేది అంది డాగీ. ప్రతి బస్సులో ‘మగవారికి మాత్రమే’ అని ఓ రెండు సీట్లయినా కనీసం కేటాయిస్తే బాగుండేది అంది డాంకీ.
మందు తాగినా మగాళ్లు ఓట్లు వెయ్యడంలేదని, ఆడవాళ్లూ మీకు జోహార్లు అంటున్నారు మనల్ని ఏలుకోవాలనుకునేవారు. ఇక ముందు ముందు మరెన్ని ‘అనుచితాలు’ ఉచితంగా ఇస్తారో, ఎందరు మగవాళ్ల తాట తీస్తారో, చేతులు విరగ్గొడతారో, ఆ ప్రజాస్వామ్య ప్రభువుకే తెలియాలి అంటూ అరుగు దిగాడు అబ్బాయి.


