. కొత్త కార్మిక చట్టాలు, 13 గంటల పనిపై ప్రజాగ్రహం
. కదం తొక్కిన గ్రీస్ కార్మికులు: 24 గంటల సమ్మెతో స్తంభించిన దేశం
ఏథెన్స్ : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ రోజుకు 13 గంటలు పనిచేయాలంటూ ఒత్తిడి తెస్తూ ఉద్యోగులపై మోయలేని పని భారాన్ని మోపే ప్రయత్నం ఆధునిక బానిసత్వానికి దారితీస్తోందంటూ గ్రీస్ ప్రజలు, కార్మిక నాయకులు కన్నెర్రజేశారు. కార్మికులు దోపిడీకి గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. సంస్కరణల పేరిట ఆధునిక బానిసత్వానికి దారితీసేలా కొత్త చట్టాలు ఉన్నాయని మండిపడ్డారు. అరకొర వేతనానికి మితిమీరి పనిచేయించడం ఎక్కడి న్యాయమంటూ మిట్సోటకీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 13 గంటల పని ఆటవికమంటూ కార్మికులు గర్జించారు. 13 గంటలు పనిచేస్తే కార్మికులు/ఉద్యోగులు అలసిపోతారని, ఇది వారి సహనానికి పరీక్ష పెట్టడమే అవుతుంది తప్ప అభివృద్ధి అనిపించుకోదని దుయ్యబట్టారు. 13 గంటల పనిని నిర్దేశించే కొత్త కార్మిక చట్టాలను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పాలకుల తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఏటా 150 గంటలు గరిష్ఠంగా అదనపు గంటలు పనిచేయాల్సి వస్తుందన్నారు. నూతన చట్టాల ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ 24 గంటల సార్వత్రిక సమ్మె చేశారు. గ్రీస్ మొత్తం ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. రవాణాను స్తంభింపజేశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కార్యకాలాపాలు నిలిచిపోయాయి. ట్యాక్సీలు, రైళ్లు, బస్సులు, సబ్‌వేలు, ట్రామ్‌లు, ట్రాలీలు నడవలేదు. స్కూళ్లు, కోర్టులు, ఆసుపత్రులు, మున్సిపల్ కార్యాలయాలు పనిచేయలేదు. సముద్రం ప్రశాంతంగా కనిపించింది. ఫెర్రీలు, నౌకలు సముద్రంలోకి వెళ్లలేదు.
కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల మద్దతు లభించింది. ఏథెన్స్, థెస్సలోనికి నగరాల్లో 8వేల మందికిపైగా సమ్మె చేశారు. వారానికి ముఫ్పై ఏడున్నర గంటల పని, ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ గ్రీస్ పిలుపునిచ్చింది. ‘ఇది అమానవీయం, అన్యాయం’ అంటూ ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ (పీఏఎంఈ) ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యాటకం సహా 24 గంటలు పనిచేసే రంగాల్లో వారానికి ఆరు రోజులు తప్పనిసరిగా పనిచేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ 2024లోనూ ఇదే స్థాయిలో ఆందోళనలు భారీస్థాయిలో జరిగాయి. అప్పడు కూడా వేలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం కొత్త కార్మిక చట్టాలతో పాటు పలస్తీనాలో ఇజ్రాయిల్ మారణహోమం, అమానవీయ పరిస్థితులు, గాజా ఎయిడ్ ఫోటిల్లాకు విఘాతం కలిగించడానికి వ్యతిరేకిస్తూ భారీ ఆందోళనలు జరిగాయి.


