పెరుగుతున్న మిర్చి ధరలు
. రోజుకు టిక్కీల అమ్మకం
. యార్డుకు తరలించేందుకు సిద్ధమవుతున్న రైతన్న
. సీజన్లో తగ్గిన సాగు విస్తీర్ణం
. డిమాండ్ పెరుగుతుందంటున్న అన్నదాతలు
విశాలాంధ్ర – సచివాలయం: నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులకు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. మిర్చి ధర పెరుగుతుందా… ఒకవేళ పెరిగితే ఏమాత్రం రేటు రావచ్చు… ఇప్పుడిప్పుడే కాస్తంత రేటు మెరుగవుతోంది… ఎదురుచూడాలా … అమ్మేసుకోవాలా… ఇలాంటి సందిగ్ధావస్థలో రైతులు ఉన్నారు. ఆశించిన స్థాయిలో కాకపోయినా నెమ్మదిగా మిర్చి రేటు పెరుగుతూ వస్తోంది. గత 20 రోజుల్లోనే క్వింటాకు రూ. రెండువేలు పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా మిర్చి సీజన్ ముగిసిన తర్వాత రోజుకు 50 వేల టిక్కీల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రాబోయే మూడు నాలుగు నెలలు ధరలు పెరిగి, స్థిరంగా కొనసాగడానికి అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో శీతల గిడ్డంగుల్లో మిరపకాయలు నిల్వ చేసిన రైతులు, ప్రస్తుత సాగుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ఖరీఫ్ లో మిరప ఉత్పత్తులు సాధించిన అన్నదాతలు గిట్టుబాటు ధర లేక డీలాపడి ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా తగ్గించారు. తాజాగా శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న మిరపకు క్వింటాకు గరిష్ఠంగా రూ.15వేల వరకు ధర లభిస్తోంది. ఆశించిన ధర లేక గత ఆరు నెలలుగా గిడ్డంగుల్లో మగ్గుతున్న మిరపకాయలను అమ్మేందుకు పలువురు రైతులు సిద్ధమవుతు న్నారు. ఇంకొందరు ఇంకా ధర పెరుగుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఏటా డిసెంబరు నుంచి మే నెల మొదటి వారం వరకు సీజన్ గా పరిగణిస్తారు. ఈ సమయంలోనే వేర్వేరు జిల్లాలు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా రైతులు మిర్చిని అమ్మకానికి తీసుకొస్తారు. వేసవి ముగిసిన తర్వాత జూన్ రెండో వారం నుంచి అన్‌సీజన్ గా పరిగణిస్తారు. ఈ సమయంలో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన మిర్చిని తీసుకొచ్చి రైతులు విక్రయిస్తుంటారు. అన్‌సీజన్‌లో రోజుకు 20 వేల నుంచి 30 వేల టిక్కీల మధ్యనే గత కొన్నేళ్లుగా విక్రయాలు జరుగుతున్నాయి. అలాంటిది ఈ సంవత్సరం సగటున రోజుకు 50 వేల టిక్కీలను కోల్డ్ స్టోరేజ్ నుంచి రైతులు బయటకు తీసుకొస్తున్నారు. సీజన్ ప్రారంభంలో గుంటూరు జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్‌లో 65 లక్షల టిక్కీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 40 లక్షలకు తగ్గింది. ఇటీవల నుంచి చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌తో పాటు మనదేశంలోని మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, దిల్లీ, బీహార్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. గుంటూరులో మాత్రమే రోజుకు 50వేల టిక్కీల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందట తాలు కాయలకు క్వింటా ధర రూ.ఆరువేలు వరకు ఉండగా తాజాగా రూ.రెండు వేలు పెరిగింది. 2023 ఖరీఫ్‌లో ఉత్పత్తి అయిన మిరపకు 2024 సీజన్లో క్వింటా ధర రూ.16 వేల నుంచి రూ.20 వేలు వరకు లభించింది. మిర్చి సీజన్ లో ఈ ఏడాది టాప్ క్వాలిటీ వెరైటీలు కూడా క్వింటా రూ.13 వేలు దాట లేదు. నాణ్యత తక్కువగా ఉన్న రకాలకు క్వింటా ధర రూ.ఎనిమిది వేలు మాత్రమే లభించింది. ఇప్పుడు తేజ వెరైటీ క్వింటాల్ రూ. 14 వేలకు చేరుకొంది. రైతులకు వ్యాపారుల నుంచి అప్పు పుట్టకపోతుండడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆలోచన చేస్తున్నారు. ఈ ఏడాది 40 శాతం విస్తీర్ణం సాగు చేయడం గగనమేనని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.రెండు నుంచి రూ.2.50 లక్షలు పెట్టుబడి అవుతున్న నేపథ్యంలో మిర్చి ధరలు సాగుదారులను సందిగ్ధంలో పడేశాయి. ఒక పక్క కోల్డ్ స్టోరేజీలో నిల్వలు తగ్గిపోతున్నాయి. మరోవైపు కొత్త పంట విస్తీర్ణం ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని ఉద్యాన శాఖ చెబుతోంది. దీంతో కచ్చితంగా మిర్చికి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. సాగుదారులు భయంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు.


