Homeఇక కొత్త బార్‌ పాలసీ

ఇక కొత్త బార్‌ పాలసీ

- Advertisement -

. సెప్టెంబరు ఒకటి నుంచి అమలు
. గీత కార్మికులకు 10 శాతం షాపులు
. ఐదు లక్షల లోపు జనాభాకు రూ.55 లక్షలు
. ఆపైన ఉంటే రూ.75 లక్షలు
. దరఖాస్తులు, లైసెన్సు ఫీజు లక్ష్యం రూ.700 కోట్లు
. ఆదాయ కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సీఎం స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రస్తుత బార్‌ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, ఐదు లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, ఐదు లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్‌ ఫీజు ఏడాదికి పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి వచ్చింది. కొత్త పాలసీలో అప్లికేషన్‌ ఫీజు, లైసెన్స్‌ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టనున్నారు. బార్‌ పాలసీలోనూ గీత కులాలకు 10 శాతం బార్లు ఇవ్వనున్నారు. లిక్కర్‌ షాపుల్లో ఎలా అయితే 10 శాతం ఇచ్చారో… అదేవిధంగా బార్లలోనూ ఆ వర్గాలకు బార్లు కేటాయించనున్నారు. సీఎం చంద్రబాబు సచివాలయంలో ఎక్సైజ్‌ శాఖపై సోమవారం సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని… ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నూతన బార్‌ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. ఆల్కహాల్‌ కంటెంట్‌ తక్కువ ఉన్న మద్యం ద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చునని సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా లక్షల కుటుంబాలు నష్టపోయాయని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో రేట్లు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండడం, నాణ్యమైన మద్యం దొరకడంతో మన రాష్ట్రానికి చెందిన మద్యం వినియోగదారులు ఇక్కడే మద్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో నాణ్యమైన మద్యం లేకపోవడం, అధిక ధరలు, మంచి బ్రాండ్లు దొరక్కపోవడం వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగేవాళ్లని గుర్తు చేశారు. మరోవైపు దీన్ని సొమ్ము చేసుకోవడానికి అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చే వాళ్లని, ఇప్పుడు ఆ సమస్య లేదని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు 12 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఐడీ లిక్కర్‌ ఫ్రీ జిల్లాలుగా ప్రకటించామని, ఈ నెలలో మరో 8 జిల్లాలను ఇల్లిసిట్లీ డిస్టిల్డ్‌ లిక్కర్‌ (ఐడీ లిక్కర్‌) ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు.
సెప్టెంబర్‌ నాటికి మిగిలిన ఆరు జిల్లాలను ఐడీ లిక్కర్‌ ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు