Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ దాడిలోఐదుగురు అల్‌ జజీరా జర్నలిస్టుల హతం

ఇజ్రాయిల్‌ దాడిలోఐదుగురు అల్‌ జజీరా జర్నలిస్టుల హతం

- Advertisement -

జెరుసలేం: గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులు కొనసాగతున్నాయి. తాజాగా అల్‌ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు హమాస్‌ ఉగ్రవాది అని ఇజ్రాయిల్‌ సైన్యం చెబుతోంది. అల్‌-షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం బయటకు ఉన్న ప్రెస్‌ టెంట్‌పై ఇజ్రాయిల్‌ దాడి చేసిందని అల్‌ జజీరా మీడియా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… అందులో ఐదుగురు తమ పాత్రికేయులేనని పేర్కొంది. అల్‌ జజీరా కరస్పాండెంట్స్‌ అనాస్‌ అల్‌ షరీఫ్‌, మహమ్మద్‌ ఖ్రీకె, కెమెరామెన్‌లు ఇబ్రహీం జహీర్‌, మోమెన్‌ అలివా, మహ్మద్‌ నౌఫల్‌ మరణించినట్లు సంస్థ తెలిపింది. ఈ దాడులు జరిగిన కాసేపటి తర్వాత ఇజ్రాయిల్‌ సైన్యం దీనిపై ప్రకటన చేసింది. అనాస్‌ అల్‌ షరీఫ్‌ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్‌ టెర్రరిస్ట్‌ విభాగానికి నాయకుడిగా పనిచేసినట్లు ఆరోపించింది. ఇజ్రాయిల్‌ పౌరులు, ఐడీఎఫ్‌ బలగాలపై జరిగిన రాకెట్‌ దాడులకు అతడే కారణమని పేర్కొంది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులు పరిశీలించిన తర్వాత… అతడు హమాస్‌ ఉగ్రవాది అని నిర్ధారించినట్లు తెలిపింది. అల్‌ జజీరాలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయిల్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని ఐడీఎఫ్‌ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మరోవైపు, ఈ దాడులను పలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిరచింది. మరోవైపు గాజాలో సైనిక చర్యను తీవ్రతరం చేయడంపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం తప్ప తమకు మరో అవకాశం లేదని చెప్పుకొచ్చారు. అందుకే గతంలో కంటే తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రణాళికలపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సమాచారం ఇచ్చామని నెతన్యాహు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు