కాకినాడ తెలుసు కదా..! ఆ ఊర్లో ఏముంది. సముద్రం ఉంది. నోటిని తీపి చేసే కాకినాడ కాజా ఉంది. ఇప్పుడు కాదు కాని ఒకప్పుడు ఓ ఇరవై సినిమా థియేటర్లు ఒకే వీధిలో ఉండేవి. కెనడాకు ఇంచుమించు సరిసాటి అని ఆ దేశానికి వెళ్లి వచ్చిన వారు కాకినాడని కోకెనడా అనేవారట. అదే ఆ తర్వాత కాకినాడ అయ్యిందని పెద్దలు అంటారు. అలాంటి కాకినాడలో ఓ సాహితీవేత్త ఉన్నారు. పట్టణంలో నాటకానికి నాందీ వాచకం పలికే వీరాభిమాని ఉన్నారు. కవిత్వం ఆవిష్కరణ జరుగుతూంటూంది. అక్కడ ఆయన ఉంటారు. కథ మీద వర్క్‌షాపు నిర్వహిస్తూంటారు. అక్కడా ఆయన ఉంటారు. ఏ గుళ్లోనో ఓ పండితుడు ప్రవచనం చేస్తూ ఉంటారు. ఆ ప్రవచనం హాలులో ముందు వరుసలో చిరునవ్వులతో ఆయన కనిపిస్తారు. నాటక సప్తాహం ప్రకటిస్తారు. దాని తెర వెనుక ఉండేది ఈయనే. ఇంతకీ ఆయనెవరు. ఎవరైతే ముఖాన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూంటారో ఆయనే మార్ని జానకిరామ చౌదరి. నొప్పింపక….తానొవ్వినా బయటకు కనపడనీకుండా ఎదుటివారిని ధన్యుడ్ని చేయడమే ఈ మార్ని వారబ్బాయికి అలవాటు. కాకినాడలో మీ ఇంటికి రావాలంటే ఎలా అని గాలి నాసరరెడ్డి ఓసారి చెట్టు కవి ఇస్మాయిల్‌ని అడిగితే…“చొక్కా మీద ఇస్మాయిల్ అని రాసుకుని పోస్టు డబ్బాలో కూర్చోండి. వాళ్లే తీసుకొస్తారు” అని సమాధానం చెప్పారు. అలాగే కాకినాడలో మార్ని జానకీరామ చౌదరి గారిని కలవాలనుకున్న వారు సాయంత్రం వేళల్లో ఏ సాంస్కృతిక కేంద్రానికి వెళ్లినా ఆయన కనపడతారు. ఒకవేళ ఆయన వేరే ఉర్లో ఉన్నారనుకోండి అక్కడ ఆయన్ని కలవాలన్నా ఆ ఊర్లో ఉన్న ఏ వేదికకైనా వెళ్లండి. అక్కడ ఈ జానకిరామ చౌదరి గారు కనిపిస్తారు. “కాకినాడలో ఫలానీ వారు మీకు తెలుసా.. నాకు ఆయనతో చిన్న పని ఉంది” అని ఈ మార్ని వారబ్బాయిని అడిగారనుకోండి. ఆయనేమంటారంటే… “ఆయ్.. తెలియాలేంటండి. తెలుసుకుందాం. పని ముఖ్యం కదా.. పైగా మీరు అడిగారాయే” అంటారు. అలా అనేసి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోరు. ఆ ఫలానీ ఆసామీ ఎవరో, ఎవరు చెబితే వింటారో సంపూర్ణంగా తెలుసుకుని మీ పని అయ్యే దాకా స్వాతిముత్యంలో కమల్‌హాసన్‌లా వెంటపడతారు. ఇలాంటి మనిషికి శత్రువులు ఎవరుంటారు. అంచేత ఏమైందన్న మాటంటే ఆయన కాకినాడలో అజాత శత్రువు అయ్యారన్న మాట. అది సంగతి. ఈ మార్ని జానకిరామ చౌదరి గారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకని ఏం చేశారంటే కవిత్వం, కథలు పెద్దగా రాయలేదు. చదువుకున్నారు. చదువుకుంటారు. చదివేసి ఏం చేస్తారంటే ఆయనకి బాగా నచ్చిందనుకోండి ఓ వంద మందికి పంపిస్తారు. వాళ్లు చదివేశాక చాలా బాగుందనో… మరోటనో, ఇంకోటనో కామెంటించారంటే దాన్ని మళ్లీ ఆ కవిగారికో, కవయిత్రి గారికో “మీ రచన మీద ఫలానీ వారి అభిప్రాయం ఇది” అంటూ ఆ సృజనకారులకి పంపుతారు. ఇలా చేయడాన్ని మీరేమంటారో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం దీన్ని సాహిత్య సేవ అంటాను. ఇలా ఈ సేవ చేస్తున్నారు కదా జానకిరామ చౌదరి గారు అంచేత ఏమైందంటే… కాకినాడలో ఉన్న అనేక సంస్థలకి ఈయన గౌరవ అధ్యక్షుడు గాను, ముఖ్య సలహాదారుగాను వ్యవహరిస్తూంటారు. దీని నిమిత్తం మార్ని వారికి వీలైనంత చేతి చమురు వదులుతుందని ఆయన్ని కలిసిన ప్రతీసారి నేననుకుంటాను. ఈ మాటే ఆయనతో అంటే జానకిరామ చౌదరిగారి నగవు మీద చిర్నవ్వు మొలుస్తుంది. అది చూసాక ఇంకేమంటాం…నోరు మూసుకుంటాం. ఈ జానకిరామ చౌదరి గారిలో ఇంకో మంచి లక్షణం ఏమిటంటే విద్యార్థులను సాహిత్యం వైపు చూసేలా చేయడం. అంటే కళాశాలలకు వెళ్లి అక్కడ సాహిత్యంపై విద్యార్థులకు క్లాసులు ఇప్పించడం. విద్యార్థులు కదా…రారేమోనని, వినరేమోనని, పట్టించుకోరేమోనని, నిర్లక్ష్యం చూపుతారేమోనని అనుమానించి గ్లామర్ ప్రపంచంలో ఉన్న సాహితీవేత్తలను ఆ కళాశాలలకు తీసుకువెళ్లి వారి చేత సాహిత్యం గురించి చెప్పిస్తారన్న మాట. ఇందుకోసం తనకు ఎంతో కాలంగా పరిచయమున్న నటులు, రచయితలైన తనికెళ్ల భరణి, ఎల్.బీ.శ్రీరాం, ప్రవచనకర్త గరికపాటి, తెలుగు భాష కోసం తన సమయంతో పాటు ఇతరుల సమయాన్ని కూడా వాడుకునే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వంటి పెద్దలని ఈ సాహిత్య ప్రచారానికి తన వెంట తీసుకువెళ్తారు. ఈ పెద్దలతో ఉన్న పరిచయాన్ని వేరే ఎవరైనా అయితే “వేరే” విధంగా వాడుకుంటారని సీనియర్ జర్నలిస్టునైన నాకు మా బాగా తెలుసు. మార్ని జానకిరామ చౌదరి గారు మాత్రం తన ప్రతి పరిచయాన్ని సాహిత్యం, కళల కోసం మాత్రమే వినియోగిస్తారని తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి తెలిసివారెవ్వరైనా చెబుతారు. ఇదిగో ఇలాంటి పనులు చేస్తారు కనుకనే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కాశీ నుంచి మార్ని జానకిరామ్ గారి కోసం ప్రత్యేకంగా రుద్రాక్షమాల తెచ్చి ఈయన మెడలో వేశారు. ఆ దండ పైకి కనపడుతుంది కాబట్టి రుద్రాక్ష మాల అంటున్నాం కాని దాని లోపల జానకిరామ చౌదరి గారిపై తనికెళ్ల తన “భరణి”లో దాచిన ప్రేమ ఉంది. ఈ మార్ని జానకిరామ చౌదరి గారికి వారసత్వంగా వచ్చిన ఆస్తి గురించి మనకి తెలియదు కాని, మగధ, మౌర్య, శాతవాహన, చాళుక్య, విష్ణు కుండినులు, కాకతీయ, విజయనగర, మొఘల్ సుల్తాన్, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నాణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నాణాల సేకరణ వేట ఈయనకి హాబీ కాదు… రోజువారీ దినచర్య. “పూర్వ కాలమున నాణములపై తెలుగు లిపి ఉండేది” అని ఎవరైనా అంటే.. “పోదురూ బడాయి” అని ఎదుటి వారు అన్నారనుకోండి… అలా అన్న వారిని అర్జంట్‌గా కాకినాడ తీసుకొచ్చి జానకిరామ చౌదరిగారి ఇంటి ముందు వదిలేయండి. ఆ ఇంట్లో ఆ తెలుగు లిపి ఉన్న నాణాలు చూసి జానకిరామ చౌదరిగారి తెలుగు దెబ్బకు ఆయన్ని మార్ని కాదు… హార్ని అనాలనిపిస్తుంది. నాకు ఆయన్ని కలిసిన ప్రతీసారి ఇలాగే అనిపించింది. అందుకే ఈ నాలుగు మాటలు. సీనియర్ జర్నలిస్టు, 99120 19929


