కాగితాల రాజశేఖర్
తెలుగు అభ్యుదయ సాహిత్యంలో కె.రా. అనేది ఒక కవి పేరు మాత్రమే కాదు; ఒక కాలానికి ప్రతినిధి అయిన స్వరం. కమ్యూనిస్టు ఉద్యమాల మధ్య జీవించాడు; వాటిని కవిత్వంగా మలిచాడు. అందుకే ఆయన కవిత్వం జీవన సమరాల్లో నుంచి ఉబికి వచ్చింది. విజయవాడ కేంద్రంగా 1970 లలో సాగిన విద్యార్థి, యువజన ఉద్యమాలు, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వేదికలు, ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ సభలు – ఇవన్నీ కె.రా. సాహిత్య ప్రయాణానికి నేపథ్యం. ఆ కాలంలో ఆయన రాసిన కవితలు పత్రికల పేజీలకే పరిమితం కాలేదు. వేదికల మీద, రోడ్ల మీద, ఉద్యమ సభల్లో ప్రత్యక్షంగా పలికాయి. స్పష్టమైన భాష, గంభీర స్వరం, విషయంపై పూర్తి పట్టు ఇవన్నీ కలిసి కమ్యూనిస్టు పార్టీలోనూ, సాహిత్య ప్రపంచంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి. వినేవారికి అది ఒక ఉపన్యాసంగా కాదు; ఒక ఉద్యమ పిలుపులా అనిపించేది. కె.రా. కవిత్వంలో ఉద్యమాలు అలంకారంగా రావు. అవి ఆయన జీవితంలోని సహజ సంఘటనలుగా ప్రవేశిస్తాయి. అందుకే ఆ కవితలు సూటిగా ఉంటాయి; బలంగా ఉంటాయి. సామాన్య ప్రజల భాషనే ఆయన తన కవిత్వానికి ఆధారంగా చేసుకున్నాడు. అతి భావుకత, క్లిష్టమైన ఉపమానాలు ఆయన శైలిలో కనిపించవు. కష్టజీవుల దైనందిన జీవితంలోంచి పుట్టిన మాటలే ఆయన కవితలుగా నిలిచాయి.
ఈ దృక్పథం ఆయన కుటుంబ నేపథ్యంతోనే ముడిపడి ఉంది. విజయవాడ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కాగితాల కృష్ణమూర్తిగారి కుమారుడిగా పెరగడం వల్ల పోరాటాలు, ఉద్యమాలు కె.రా.కు కొత్త కాదు. చిన్నతనం నుంచే చూసిన సమావేశాలు, విన్న చర్చలు, స్వయంగా పాల్గొన్న పోరాటాలే ఆయన కవిత్వానికి మూలధనం. ఆనాటి కమ్యూనిస్టు నేత, కవి గజ్జెల మల్లారెడ్డి ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. ఈ ప్రభావమే ఆయనను యువ వయసులోనే సాహిత్య అధ్యయనానికి, కవితా రచనకు ముందుకు నడిపించింది. 1969 లో, కేవలం 21 ఏళ్ల వయసులోనే, ‘శాంతిశ్రీ’ అనే ఏకపాత్రల సంకలనం రావడం కె.రా. సాహిత్య ప్రయాణంలో ముఖ్య ఘట్టం.
‘నాగాశోకుడు’, ‘మౌర్య అశోకుడు’ వంటి పాత్రలు లోతైన చారిత్రక అవగాహనతో రూపుదిద్దుకున్నాయి. అప్పట్లో బౌద్ధ సాహిత్యం విస్తృతంగా అందుబాటులో లేకపోయినా, ఆయన చేసిన పరిశ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైనప్పటికీ ఆ రచనల్లో పరిపక్వత ఉండటం విమర్శకులను ఆకట్టుకుంది. అభ్యుదయ విమర్శకుడు, ఎర్రజెండా తొలి పాట రచించి ఘనత వహించిన తుమ్మల వెంకట్రామయ్య, ప్రముఖ తత్త్వవేత్త ఏటుకూరి బలరామమూర్తి ‘శాంతిశ్రీ’ రచన చూసి కె.రా.కు రచయితగా మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. 1970 ల ప్రారంభం నుంచి కె.రా. పూర్తిగా ఉద్యమాలతో మమేకమయ్యాడు.
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ‘సమైక్యవాణి’, ‘ఉదయతార’ వంటి ప్రచురణలతో అనుబంధంగా అభ్యుదయ సాహిత్యానికి వేదికగా పని చేశాడు. అదే సమయంలో సీపీఐ కార్యకర్తగా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. దొంగ నిల్వల వెలికితీత ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుపాలవటం ఆయన జీవితంలో కీలక అనుభవం. ఆ అనుభవం నుంచే “ఉక్కు కటకటాల వెనుక ఒక్కడినే మెలకువలో” అనే గేయం పుట్టింది. అది ఒక వ్యక్తిగత అనుభవం కాదు; ఉద్యమ కార్యకర్తల సమష్టి వేదనకు స్వరం. 1975 లో ఆయన రాసిన ‘జనశ్రేణి కదిలింది’ నృత్యనాటిక ఉద్యమ కవిత్వానికి మరో రూపం. కార్మిక- కర్షక ఐక్యతను ప్రతిపాదించిన ఈ నాటిక ప్రజల మధ్య విశేష స్పందన పొందింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ నాటిక పాటలను వాడవాడలా పాడు కున్నారు. విజయవాడలో 1975లో జరిగిన సీపీఐ 10వ జాతీయ మహాసభలో పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రారంభ ప్రదర్శనగా దీన్ని ఎంపిక చేయటం, కేవలం ఒక రచయితకే కాదు – ఉద్యమ సాహిత్యానికే వచ్చిన గుర్తింపు. ఈ నృత్య నాటిక ప్రదర్శనపై నాటి సీపీఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు చేసిన ప్రశంస కె.రా.కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కె.రా. సాహిత్యం ఉద్యమకవిత్వానికే పరిమితంకాలేదు. ఆర్టిస్ట్ మోహన్‌తో కలిసిచేసిన అనువాదాలు, బాలసాహిత్య రచనలు, ‘చిన్నారిలోకం’ మాస పత్రిక సంపాదకత్వం, ‘తీరాలు -కెరటాలు’, ‘ఛాయా గీతం’ నవలలు ఆయన బహుముఖసృజనకు నిదర్శనం. పిల్లలకోసం రాస్తూనే సమాజాన్ని మర్చిపోకుండా ఉండటం కె.రా. ప్రత్యేకత.
కమ్యూనిస్టు పార్టీపై తన విశ్వాసాన్ని ‘నా పార్టీ’ అనే దీర్ఘకావ్యంలో కె.రా. ఆవిష్కరించాడు. ఇది ప్రచార గీతం కాదు; ఒక కార్యకర్త, ఒక కవి హృదయంలో నుంచి వచ్చిన ఆత్మ విశ్లేషణ. 1925 నుంచి పార్టీ సాగించిన పోరాటాలన్నీ ఇందులో సహజంగా, భావోద్వేగంతో, గట్టి విశ్వాసంతో ప్రతిబింబించాయి. 56 ఏళ్ల పాటు సాగిన ఈ సాహిత్య- ఉద్యమ ప్రయాణం 2004 ఫిబ్రవరి 18 న ముగిసినా, కె.రా. కవిత్వం ఇంకా జీవిస్తూనే ఉంది. ఉద్యమాలను కవిత్వంగా మలిచిన అరుదైన కవుల్లో కె.రా. ఒకరు. ఆయన రచనలు చదివినప్ప్పుడు ఒక కవిని కాదు – ఒక కాలాన్ని ఎదుర్కొన్న మనిషిని చూస్తాం.


