బరువుగా కురిసిన మంచును
ముత్యాలుగా మార్చుకొని
లేలేత కిరణాల సూర్యోదయాన్ని
స్వాగతించి మెరుస్తుంది
మార్నింగ్ వాకర్ల కవాతులో
మాటల మర్మాలు వింటుంది
సంతోషాల నవ్వుల పరాష్కాలతో
స్వరాలు కలిపి సంలీనమౌతుంది
అలసిపోయి కూచుంటే
అక్కున చేర్చుకుంటుంది
జీవన యుద్ధాలకు మధ్య
శక్తిని రీచార్జ్ చేస్తూ
శాంతి సరోవరమౌతుంది
ఆకులు రాలిన చెట్ల
ఆందోళన కంటుంది
చిగురించే కొమ్మల్లో కూసే
భవిత కోయిలౌతుంది
తుఫానుల తాకిడికి
తలవంచని ధైర్యమవుతుంది
పడిపోయిన వారిని
లేవనెత్తే ప్రేరణౌతుంది
అన్యాయాల అర్ధరాత్రిలో
ఆశల అగ్నిజ్వాలవుతుంది
బానిస నిశీధి బంధాలు త్రెంచే
వేకువ స్వేచ్ఛా గాలవుతుంది
కన్నీటి కాలువల్లో
కల్లోలం సృష్టించి
అణచివేతల అడవుల్లో
అగ్గిపూలు రగిలించే
విప్లవ వసంతమౌతుంది
ఓడిపోని ఓర్పుతో
ప్రకృతి ఒడిలో వెలిసి
ఉద్యమ ఉద్దానమై నిలిచె
ఉద్యాన గీతమవుతుంది.
వేల్పుల నారాయణ, 9440433475


