విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉపరాష్ట్రపతి పదవికి ఏపీ గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ ఎంపిక కానున్నట్లు రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. త్వరలో బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవిని కూడా ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల అస్త్రంగా మలచుకునే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉండటంతో దక్షిణాదికి చెందిన మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి కేటాయించడం ద్వారా ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందని బీజేపీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత… ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ పదవికి బీజేపీలోనే మరో సీనియర్ నేత ఎంపికవుతారని నేతలు తొలుత భావించారు. ఈ పదవికి బీహార్ నుంచి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. మిత్రపక్షంగా ఉన్న నితీశ్ కుమార్‌కు ఇస్తారన్న ఊహాగానాలు కూడా సాగాయి. ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండియా ఐక్యసంఘటన తమ అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మారుతున్న సమీకరణాలతో మోదీ బృందం కొత్త వ్యూహం అమలుకు సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణాది నేతకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలని, అందులోనూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇండియా ఐక్యసంఘటనకు షాక్ ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. దీనివల్ల ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమనే భావనను దేశ ప్రజల్లో పోగొట్టినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.
దీనిలో భాగంగానే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు తెరమీదకు వచ్చింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దేశంలోనే అత్యంత వివాదాస్పద కీలకమైన అయోధ్య తీర్పులోను ఆయన భాగస్వామిగా ఉన్నారు. దీంతో ఆయన 2023 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగింది.
ఉపరాష్ట్రపతిగా ఏపీ గవర్నర్ నజీర్?
- Advertisement -
RELATED ARTICLES


