ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నట్టే అధికార పక్ష అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్యసంఘటన అభ్యర్థిగా రంగం లోకి దిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా 300 మంది ఓటు వేశారు. సాక్షాత్తు పార్లమెంటు సభ్యులు పాల్గొన్న ఈ ఎన్నికలలో 15 ఓట్లు చెల్లకుండా పోవడం పెద్ద విశేషమే. ఉభయ పక్షాలూ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు ఎలా వేయాలో ఎంపీలకు శిక్షణ లాంటిది కూడా ఇచ్చినా చెల్లని ఓట్లు ఉన్నాయంటే అది ఎంపీలకు ఓటు వేయడం వచ్చి ఉండక పోనైనా పోవాలి. లేదా కావాలనే తమ ఓటు చెల్లకుండా చేసి అయినా ఉండాలి. ఇటీవలి కాలంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇంత ఉత్కంఠగా ఎప్పుడూ జరగలేదు. అధికార పక్షమైన ఎన్డీయేకు గెలవగలిగినంత సంఖ్యా బలం స్పష్టంగా ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడే దాకా అధికారపక్ష అగ్ర నాయకుల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వ్యక్తిత్వమే పోటీ గట్టిగా తయారు కావడానికి కారణం అయింది. అధికార పక్ష అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఆర్‌ఎస్‌ఎస్ కుదురుకు చెందిన వారు. ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ ప్రస్తుత వాతావరణంలో రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతున్నందున రాజ్యాంగ పరిరక్షణకు తనవంతు కర్తవ్యం నిర్వహిం చడానికి ఆయన రంగంలోకి దిగారు. అందుకే ఆయన నాకోసం ఓటు వేయనవసరం లేదు. దేశం కోసం ఓటేయండి, రాజ్యాంగ పరిరక్షణకోసం ఓటు వేయండి అని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక కేవలం ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం కాదు ప్రజాస్వామ్య భవిష్యత్తుకోసం అని ప్రతిపక్ష నాయకులు ఎంత గట్టిగా ప్రచారం చేసినా సంఖ్యాబలం అనుకూలించలేదు. మచ్చలేని సుదర్శన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా ఆయన 300 ఓట్లు సంపాదించగలిగారు. అధికార పక్ష అభ్యర్థి విజయం సునాయాసం అని అంకెలు సూచిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం రాధాకృష్ణన్‌ను గెలిపించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. అధికారపక్ష ఎంపీల కోసం ప్రధాని ఏర్పాటు చేసిన విందులో ఆయన ఎంపీలను ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయంగా కరచాలనం చేయడం అధికార పక్షంలో గూడు కట్టుకున్న ఓటమి భయానికి సంకేతం. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప రాధాకృష్ణన్ విజయం సాధ్యం కాదని మోదీ, షాకు తెలిసిపోయింది. అందుకే హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో పాల్గొనాల్సిన అమిత్ షా ఆఖరి క్షణంలో దిల్లీలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దాలని భావించారు. కేవలం 782 మంది ఓటర్లు పాల్గొనాల్సిన ఎన్నిక కోసం అధికార పక్షం చాలా ప్రయాస పడవలసి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయ కత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్.), ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ (బీజేడీ), అకాలీదళ్ ఈ ఎన్నికలను బహిష్కరించడం. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు అనేక సందర్భాలలో పార్లమెంటులో బీజేపీకి మద్దతిచ్చాయి. ఇప్పుడు బీఆర్‌ఎస్ రైతులకు ఎరువులు అందనందువల్ల ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. అలాగే బీజేడీ మాత్రం తాము అధికారపక్షమైన ఎన్డీయేకు, ప్రతిపక్ష ఐక్య సంఘటన ‘‘ఇండియా’’కు సమాన దూరం పాటిస్తామని చెప్పింది. పంజాబ్‌లో వరదలవల్ల ఏర్పడిన పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నామని అకాలీదళ్ ప్రకటించింది. ఈ మూడు పార్టీల వాదనలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. బీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉంటే బీజేడీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అకాలీ దళ్‌కు ఉన్నది ఒక్క ఎంపీ మాత్రమే. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ‘‘నోటా’’ సదుపాయం ఉంటే తమ ఎంపీలు ఆ సదుపాయాన్ని ఉపయోగించేవారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కలవకుంట్ల తారకరామా రావు చేసిన వాదన నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదు. అసలు కారణం తెలంగాణకు మాత్రమే పరిమితమైన బీఆర్‌ఎస్ ప్రధానంగా కాంగ్రెస్‌తోనే పోరాడాల్సి ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ సమర్థించిన సుదర్శన్ రెడ్డి తెలుగువాడే అయినప్పటికీ బీఆర్‌ఎస్. కనీసం ‘‘తెలుగువారి ఆత్మ గౌరవం కోసం’’ అయినా సుదర్శన్ రెడ్డిని సమర్థించాలనుకోలేదు. చాలా కాలం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ మాత్రం బీజేపీకి అంటకాగింది. ఒడిశాలో గత శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. నవీన్ పట్నాయక్ అలకకు ఇదే ప్రధాన కారణం అయి ఉంటుంది. అందుకే బహిష్కరణ దారి పట్టారు.
ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయం అధికార పక్షాన్ని పీడిరచినందువల్లే కొందరు ఎంపీలను ‘‘బందీలుగా’’ ఉంచడానికి కూడా వెనుకాడ లేదు. క్రాస్ ఓటింగ్ వల్ల ఎన్డీయే అభ్యర్థి ఓటమి పాలవుతారే మోనన్న భయం బీజేపీ నాయకత్వాన్ని తీవ్రంగా పీడిరచింది. సుదర్శన్‌రెడ్డి గెలిచి ఉండకపోవచ్చు కానీ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి కేవలం 150 ఓట్ల ఆధిక్యతతో గెలవడం బహుశ: ఇదే మొదటి సారి కావొచ్చు. 2022లో జగదీప్ ధన్కడ్ ఎన్నికైనప్పుడు ఆయన 528 ఓట్లు సాధిస్తే ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాధాకృష్ణన్ తక్కువ మెజారిటీతో గెలవడం అంటే ప్రతిపక్షాలు బలం పుంజుకోవడానికి నిదర్శనం. పెరుగుతున్న ఈ బలం భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించవచ్చు. ఎన్డీయేకు మద్దతిచ్చే కొందరు ప్రతిపక్ష అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారన్న అంచనా మాత్రం తిరగబడిరది. ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతిస్తారనుకున్న 15 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎన్డీయే పక్షానికి నికరంగా ఉన్నది 427 ఓట్లు మాత్రమే. కానీ 11 మంది ఎంపీలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధికారపక్షానికి మద్దతిచ్చింది. అప్పుడైనా అధికార పక్షానికి 438 ఓట్లు మాత్రమే వచ్చి ఉండాలి. కానీ రాధాకృష్ణన్‌కు 452 మంది ఎంపీల అండ ఉండడం అంటే ప్రతిపక్ష శిబిరం నుంచే క్రాస్ ఓటింగ్ జరిగి ఉండాలి. చెల్లని ఓట్లు కూడా ప్రతిపక్షాలకు మద్దతిస్తారనుకున్న వారివే కావొచ్చు. ప్రతిపక్షాలు అంచనా వేసిన దానికన్నా 15 ఓట్లు తక్కువ వచ్చాయి. గెలుపోటములను పక్కన పెడితే రాజ్యాంగ పరిరక్షణ, సైద్ధాంతిక పోరాటం అన్న వాదనలతో తమ అభ్యర్థిని నిలబెట్టిన ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన మోదీ ఇష్టా రాజ్యం ఇక కుదరదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేయగలిగింది. ప్రతిపక్ష శిబిరం నిరాశ పడవలసిన అగత్యం ఎంత మాత్రం లేదు. స్పష్టంగా ఆర్‌ఎస్‌ఎస్. అభ్యర్థిని ఉపరాష్ట్రపతిని చేయడంలో అధికార పక్షం సఫలమైంది. ఉపరాష్ట్రపతి రాజకీయ మద్దతుతోనే ఎన్నికవుతారు. కానీ ఆ పదవిలోకి వచ్చిన తరవాత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. రాధాకృష్ణన్‌కు నిష్పాక్షికంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు.
ఉపరాష్ట్రపతి గద్దెపై సంఫ్‌ు నేత
- Advertisement -


