Tuesday, November 18, 2025
Homeఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే

ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే

- Advertisement -

. ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు
. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర-సచివాలయం: ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేనని, అధికారులు కాదని సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. సెక్రటరీలకు సూచనలు ఇచ్చినప్పటికీ శాఖలను నడిపించే బాధ్యత మంత్రులదేన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. మరోసారి మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు శాఖలపై పట్టు పెంచుకోవటంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంపై క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. పనిచేయని అధికారులను మందలించాల్సింది కూడా మంత్రులేనన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను మూతపడకుండా కాపాడినట్లు, నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖపట్నాన్ని ముంబై తరహాలో అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుదామన్నారు. రైల్వే జోన్‌, గూగుల్‌ డేటా సెంటర్‌, ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్లాంట్‌ వంటి కీలక ప్రాజెక్టులను విశాఖకు తీసుకొచ్చామని, ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. విద్యుత్‌ టారిఫ్‌ తగ్గింపుపై సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యూనిట్‌కు 13 పైసలు తగ్గించినా ఓనర్షిప్‌ తీసుకోలేకపోయామని విద్యుత్‌ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ఇలాంటి పొరపాట్లు సరిదిద్దుకోవాలని స్పష్టంచేశారు. వైఎస్‌ జగన్‌ అనకాపల్లి పర్యటనపైనా చర్చ జరిగింది. జగన్‌ పర్యటనకు ప్రజల నుంచి స్పందన లేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. రెండు మెడికల్‌ కళాశాలలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నకిలీ మద్యం అంశం ప్రస్తావనకు వచ్చింది. అనధికార బెల్ట్‌షాపులను నియంత్రించాలని స్పష్టంచేశారు. ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటనపైనా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సమావేశాలు మన రాష్ట్రంలోనే ఎక్కువ జరిగినట్టు వివరించారు. ఇక నుంచి మంత్రులు మీడియాకు అందుబాటులో ఉండాలని సూచించారు. జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి లోకేష్‌ సూచించారు. కాగా, ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎస్‌ఐపీబీపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పెట్టుబడుల ప్రోత్సాహకంలో భాగంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని, ఆ తరువాత వారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎంత పెట్టుబడులు వచ్చాయనేది నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఆనందకరమని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. విశాఖ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతం ఇస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రులతో భేటీ సమయంలో మంత్రి లోకేష్‌ నకిలీ మద్యం అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత వరకు నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్ట్‌షాపుల కారణంగానే నకిలీ మద్యం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. అంబేద్కర్‌ విగ్రహం విషయంలోనూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు