వాషింగ్టన్/లండన్: అమెరికా రాజకీయాలను కుదిపివేసిన ఎప్‌స్టీన్ వ్యవహారంలో విచారణకు హాజరవుతామని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింగన్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఓవర్‌సైట్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని వారి న్యాయవాదులు తెలిపారు. క్లింటన్ దంపతులు గతంలో వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని రిపబ్లికన్ పార్టీకి చెందిన జేమ్స్ కోమర్ కాంగ్రెస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి చైర్మన్ హోదాలో హెచ్చరించారు. ధిక్కార నేరం రుజువైతే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. క్లింటన్ దంపతులపై చర్యలు వద్దని వారి న్యాయవాదులు అభ్యర్థించారు.
చిక్కుల్లో బ్రిటన్ నేత
ఎప్‌స్టీన్‌కు సన్నిహితుడిగా వ్యవహరించే బ్రిటన్ నాయకుడు పీటర్ మండెల్సన్ చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయన బ్రిటన్ పార్లమెంటు ఎగువసభ శాశ్వత సభ్యత్వాన్ని వదులుకోక తప్పలేదు. ఎప్‌స్టీన్‌తో సాన్నిహిత్యం వల్ల మండెల్సన్‌ను తొలగించేందుకు చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ఆయననే సొంతంగా రాజీనామా ప్రకటించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వెల్లడైన వివరాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ ఉదంతంలో అమెరికా ప్రభుత్వం తాజాగా 30 లక్షల పేజీల సమాచారాన్ని విడుదల చేసిన విషయం విదితమే.
విడాకులకు కారణమదే: మిలిందా బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో తన వైవాహిక బంధాన్ని ఎప్‌స్టీన్ అంతం చేసినట్లు ఆయన మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో మానసిక క్షోభను అనుభవించినట్లు తెలిపారు. ఈ కారణంగానే విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. బిల్‌గేట్స్‌కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు ఇటీవల ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన క్రమంలో మిలిందా స్పందించారు.
ఈ విషయాలపై సమాధానం చెప్పాల్సినది బిల్‌గేట్స్ అని, తాను కాదని ఆమె అన్నారు. ఎప్‌స్టీన్ బాధిత మహిళలకు న్యాయం లభిస్తుందని ఆకాంక్షించారు. బిల్‌గేట్స్-మిలిందా 2021లో విడాకులు తీసుకున్నారు. మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు సంబంధాలు నచ్చక వీరు విడిపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పట్లో పేర్కొంది. ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోనూ రష్యా మహిళలతో బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలతో ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని, అప్పట్లో తన భార్య మిలిందాకు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని తనను బిల్‌గేట్స్ కోరారని ఎప్‌స్టీన్ రాసుకున్న ఈమెయిల్ బయట పెట్టింది. ఇదంతా అబద్ధమంటూ బిల్ గేట్స్ బృందం పేర్కొంది.
‘ఎప్‌స్టీన’ విచారణకు క్లింటన్ అంగీకారం
- Advertisement -
RELATED ARTICLES


