తాడి ప్రకాష్, 9704541559
“…ఆ కత్తులు దొరికేదాకా నేను పచ్చిమంచినీళ్లు ముట్టను…” అంది ఆమె.
చడీచప్పుడూ లేకుండా, పిడుగు పడినట్టుగా ఉంది ఆమె మాట. 1946 – తూర్పు బెంగాల్లోని మారుమూల కుగ్రామం అది. మతవిద్వేషాలతో మనసులు మసిబారిపోతున్న సమయం…
ఆ విపరిణామాలతో తనకేమీ సంబంధం లేనట్టుగా డిసెంబర్ నెల చలిగాలి రివ్వున వీస్తోంది. చలికి తువ్వాళ్లు, మఫ్లర్లు చెవులకు చుట్టుకున్నవాళ్లు, ఒళ్లంతా దుప్పట్లతో పైపంచెలతో కప్పుకున్నవాళ్లు ఆమె మాటలకి ఉలిక్కిపడ్డారు.
“ఏమన్నారూ…!” … ఖురాన్ పఠనం చేసే కరీం సాహెబ్ నిర్ఘాంతపోయాడు. హష్మతుల్లా లేచి నిలబడ్డాడు. హష్మతుల్లా, కరీం సాహెబ్ ఒకళ్ల ముఖాలు ఒకళ్లు చూసుకున్నారు. హిందువులు తలవంచుకుని ఉన్నారు. ఆమె కళ్లలో ఎక్కడా ద్వేషభావం లేదు. దట్టమైన నల్లని కురులు, మెరుస్తున్న కళ్లలో ఆత్మవిశ్వాసం. రణరంగాన… శిరస్సుని అర్పించే ముహూర్తం ఆగమించినప్ప్పుడు ఒక నిబద్ధ సత్యాగ్రహి కళ్లలో కనిపించే మెరుపు అది.
ఆమె మళ్లీ రెట్టించింది. “మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్లండి. నేను మాత్రం హిందువుల పవిత్ర ఖడ్గాలు మళ్లీ వాళ్లకి చేరేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను.”
ఒక ముస్లిం మహిళ తమకు ఎదురు నిలిచి, కళ్లలోకి చూస్తూ మాట్లాడటమా? పైగా హెచ్చరించడమా? హష్మతుల్లా నమ్మలేకపోతున్నాడు. మిగతా ముస్లింలదీ అదే పరిస్థితి. కరీం సాహెబ్ మతిపోయినంత పనైంది. ఆమె లేచి నిలబడింది.
ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టు అక్కణ్ణించి వచ్చేసింది. ఎవరీవిడ? ఎక్కణ్ణించి వచ్చింది? కొత్తగా వచ్చిన ఎవరో అపనమ్మకం స్వరంతో అడిగారు.
“ఆమె పేరు బీబీ అమ్తుస్సలామ్. పాటియాలా నుంచి వచ్చింది. ఆమె గాంధీజీ శిష్యురాలు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య సమైక్యత స్థాపించడానికి వచ్చింది.
నిజమా ? ఇలాంటి సంఘటన జరిగిందా? ఒక మహిళ… అందునా ఒక ముస్లిం మహిళ ఇలా నిష్కర్షగా మాట్లాడిందా? అగ్ని సముద్రం మీద నిశ్చలంగా నడిచిందా?”… అని ప్రారంభం అవుతుంది బీబీ అమ్తుస్సలామ్ అనే ఈ పెద్ద పుస్తకం. 600 పేజీలున్న ఈ గ్రంథం రాసినాయన పేరు రమణమూర్తి. ‘విజయవిహారం ‘ రమణమూర్తిగా పాపులర్.
III
ఇతనేమన్నా తోపు, తురుంఖాన్ ఐన జర్నలిస్టా?… కాదు. ప్రొఫెషనల్ రైటరా?… కాదు.
మరి భారత స్వాతంత్య్ర పోరాటంలోని ఒక మహత్తర ఘట్టాన్ని ఇంత బాగా ఎలా రాయగలిగాడు?
రాయడం వచ్చు గనక. ఏం రాయాలో తెలుసు గనక.
ఇవి రెండు మాత్రమే కాకుండా మరో సెన్సిబుల్ విషయం ఉంది.
ఇది ప్రేమకథా కాదు. సస్పెన్‌్స థ్రిల్లరూ కాదు. బెస్‌్ట కమర్షియల్ సెల్లరూ కాదు. స్వాతంత్య్ర పోరాటమూ, చరిత్ర, ఒక మహిళ తెగువ అంటే విరగబడి ఈ పుస్తకం కొనేవాళ్లు ఉండరు. నిద్రమానుకుని దీక్షగా చదివేవాళ్లూ ఉండరు.
అది రమణమూర్తికీ తెలుసు. అందుకే రొడ్డకొట్టుడు రాజకీయ వ్యాసాల్లాగో, దిన పత్రికల చచ్చు సంపాదకీయాల్లాగో కాకుండా… గోబీ ఎడారిలో చంఘిజ్ ఖాన్ గుర్రాలు రివ్వున పరిగెత్తే శైలిలో ఉరకలెత్తేలా ఆయన రాశారు. అమ్తుస్సలామ్ చరిత్ర చదువుతుంటే… దుమ్ము రేపుతూ తూనీగల్లా దూసుకుపోతున్న గుర్రపు డెక్కల చప్పుడూ, వీరుల విజయధ్వానాలూ చెవుల్లో హోరెత్తుతున్నట్టే ఉంటుంది.
కదిలించే పదాలూ, కెరటాల్లా ఎగసిపడే వాక్యాలూ మనల్ని వేగంగా చదివిస్తాయి.
బీబీ అమ్తుస్సలామ్ గురించి నరమానవుడనే వాడెవడికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె పోరాటం, త్యాగం, అగ్నిపునీతమైన నిజాయితీ – చరిత్రలో ఎక్కడా రికార్డు అయిలేదు. కస్తూర్బా, మీరా బెన్, సరోజిని నాయుడుల గురించి రాసినట్టుగా అమ్తుస్సలామ్ జీవిత విశేషాలు ఎవరూ రాసి ఉంచలేదు. ప్రజల కోసం పోరాడటం తప్ప, ప్రచార ఆర్భాటం కోరుకోని ఆమె నిబద్ధత కూడా ఇందుకు ఒక కారణం. కనుక రమణమూర్తికి ఈ పుస్తకం రాయడం ఒక ఛాలెంజ్.
గాంధీజీ ఆమెకో చిన్న ఉత్తరం రాయడం, ఆమె క్లుప్తంగా సమాధానం ఇవ్వడం, ఆమె కొన్ని పోరాటాల్లో, సత్యాగ్రహంలో పాల్గొనడం, నిరాహార దీక్ష చేయడం… లాంటి కొద్దిపాటి వివరాలు తప్పితే, ఎవరికీ ఏమీ తెలియదు.
విస్తృతమైన సమాచారం, ప్రత్యేక వ్యాసాలు, రచనలూ ఏమీ లేనపుడు ఆమె గురించి 600 పేజీల పుస్తకం రాయడం ఎలా సాధ్యం? ఇది ఒక అసాధారణమైన ఛాలెంజ్… ఏ పెద్ద రచయితకైనా. ఏ చరిత్ర పరిశోధకుడికైనా! రమణమూర్తి దీన్నెలా సాధించినట్టు? ఇక్కడ మేజిక్కులకీ, దొంగవేషాలకీ తావు లేదు. షార్‌్ట కట్ అంటూ లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్కమార్గం అది రాత్రీ, పగలూ తేడాలేని, అంతూపొంతూ లేని అపారమైన అధ్యయనం!
మహాత్మాగాంధీ కలెక్టర్ వర్‌్క్స, కాకా కాలేల్కర్, రామచంద్ర గుహ, డొమినిక్ లాపియర్, లారీ కాలిన్‌్స, సుశీలా నయ్యర్, మేరీ బార్, మార్‌్క లిండ్లే రచనల నుంచి… కల్లూరి భాస్కరం, తదితరుల అనువాదాల దాకా కొన్ని వందల పుస్తకాలు చదివి రమణమూర్తి నోట్‌్స రాసుకున్నారు. ఒక రాక్షస పరిశోధకుడు మాత్రమే చేయగలిగిన పని ఇది. బీబీ అమ్తుస్సలామ్ జీవిత కథ రాయడానికి ‘సంప్రదించిన రచనలు కొన్ని’ అని ఈ పుస్తకం చివరిలో రమణమూర్తి ఇచ్చిన పుస్తకాల జాబితానే అక్షరాలా ఐదు పేజీలు ఉంది. చారిత్రక పత్రాలు, సిద్ధాంత గ్రంథాలూ చదివి, వాస్తవానికి అతి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ అంకెలు, తేదీలు, సంవత్సరాల వివరాలతో అనేక సంఘటనలను ఆసక్తి రేకెత్తించేలా ఒక వరుసలో పేర్చడంలో రమణమూర్తి చాకచక్యం, ప్రతిభ just sష్ట్రశీckఱఅస్త్ర aఅd astశీఅఱsష్ట్రఱఅస్త్ర.
III
అమ్తుస్సలామ్‌ని జోన్ ఆఫ్ ఆర్‌్క అనీ, అసాధారణమైన ధైర్య సాహసాలు గల ఒక ముస్లింయువతి అనీ ప్రముఖులు అన్నారు. ఆమె గాంధీ యుగంలో ఆవిర్భవించిన మహా యోధ. గాంధీ చెక్కిన ఒక అపురూప శిల్పం – బీబీ అమ్తుస్సలామ్. ఆమె 1906లో పాటియాలా లోని సంప్రదాయ, జమిందారీ ముస్లిం కుటుంబంలో పుట్టింది. తండ్రి అబ్దుల్ అజీజ్ ఖాన్, తల్లి అమ్తుల్ రహమాన్. ఆమె ఆరుగురు అన్నలకి ఏకైక చెల్లెలు. ఆమె పదేళ్ల వయసుకే ఖురాన్ ఉర్దూ అనువాదాన్ని చదివింది. ఆమె జీవితాంతం రోగాలతో, అనారోగ్యంతో పోరాడింది. క్షయ నుంచి ఆస్త్మా, దగ్గు, న్యూమోనియా, మైగ్రేన్ లాంటి ఒక డజను జబ్బులతో సతమతమైంది. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది.
“మానవ సహజమైన ఉద్వేగాలతో, బలహీనతలతో ఉండి తమ అన్వేషణ ద్వారా, ఆత్మ సమీక్ష ద్వారా వాటిని అధిగమించి, మహోన్నతులుగా, ముక్తులుగా… ఎదిగిన వాళ్ల జీవితాలు – మనం అనుసంధానం చేసుకోవడానికీ, నేర్చుకోవడానికీ, మనల్ని మనం దిద్దుకోవడానికీ, మనం ఎదగడానికీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. గాంధీజీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అమ్తుస్సలామ్ వంటి మహనీయుల జీవితాలు ఈ కోవకి చెందినవి” అంటారు రమణమూర్తి.
దేశ విభజన సమయంలో తన కుటుంబం అంతా పాకిస్తాన్ తరలి వెళ్లిపోయినా, తాను ఒక్కతే భారతదేశాన్ని ఎంచుకుని ఇక్కడే ఉండిపోయింది.
మతోన్మాద పిశాచాలు విజృంభించి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఆహుతి అయిపోతున్న విషమ, కల్లోల సమయంలో శాంతి, సమైక్యత కోసం అమ్తుస్సలామ్ 26 రోజుల పాటు కఠిన నిరాహార దీక్ష చేసింది. పరదా సంప్రదాయాల్నీ, మతతత్వ ధోరణుల్నీ ధిక్కరించి, హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన పాటియాలా ధీరవనిత బీబీ అమ్తుస్సలామ్.
“ఆదర్శనీయమైన, త్యాగమయమైన ఆమె జీవితం, భారత ఉపఖండపు మహిళలకి తరతరాలకు సరిపడా ఉత్తేజాన్నివ్వగల మహోజ్వలమైన ఆమె స్ఫూర్తీ – అనామకంగా, విస్మృతంగానే ఉండిపోవడం మహా విషాదం, ప్రజల దురదృష్టం” అన్నారు రమణమూర్తి.
III
‘అసువులర్పించి నశించిన వాళ్లెవరో మీ కోసం
తెలుసుకో లేదే మీరు. కనీసం
మీ నుంచి దూరం వెళ్లేముందు ఈ ఆరోపణ ఉండిపోతుంది నాకు’ – అని ఫిర్యాదు చేసిన షహీద్ అష్ఫాఖుల్లా ఖాన్ కవితని రమణమూర్తి కోట్ చేశారు. అష్ఫాఖుల్లాని ఉరి తీయడానికి మూడురోజుల ముందు దేశ ప్రజలకు రాసిన ఉత్తరంలో ఖాన్ కోట్ చేసిన స్వీయ కవిత ఇది.
III
1931 ఆగస్టు. రౌండ్ టేబుల్ సమావేశం కోసం గాంధీజీ లండన్ వెళ్లబోతున్నారు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. “నేను ముస్లింని. బాపూజీ సైనికురాలిని. హిందూ ముస్లిం ఐక్యత కోసమే నా జీవితాన్ని అంకితం చెయ్యడం సబబుగా ఉంటుంది. అపోహలు పోగొట్టి ఇరువర్గాల్నీ ఒక్క తాటి మీదికి తీసుకొచ్చే లక్ష్యంతోనే నేను శ్రమించాలి. నా జీవితాశయం ఇదే కావాలి” అన్నారు అమ్తుస్సలామ్!
1940 మార్చిలో లాహోర్‌లో దేశ విభజనను డిమాండ్ చేస్తూ, ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించడంతో దేశ చరిత్ర అనూహ్యమైన చీకటి మలుపు తిరిగింది.
జిన్నా మతోన్మాద ప్రవక్తగా ఆవిర్భవించాడు. అయినా 1941 జనవరి చివరి రోజుల్లో అమ్తుస్సలామ్ జిన్నాని కలిసింది.
ఆ సమావేశంలో ఏం జరిగింది?. “నేను ముస్లిం ప్రతినిధిని. గాంధీ హిందువుల ప్రతినిధి” అన్న జిన్నా మాటకి అమ్తుస్సలామ్ సమాధానం ఏమిటి? ఈ భిన్న ధ్రువాల సమావేశంపై గాంధీజీ కామెంట్ ఏమిటి?… అది ఈ పుస్తకంలో చదివితేనే బావుంటుంది.
III
1947 డిసెంబర్ చివరి వారంలో అమ్తుస్సలామ్ ఆమరణ నిరాహార దీక్ష మొదలైంది. అంతర్వాణిని అనుసరిస్తూ, ఆశయం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైంది. “నువ్వు సేవ చేయడానికి బతకాలని ఆశించు. చావడానికి సిద్ధంగా ఉండు” అని అత్యున్నత విప్లవ సూత్రాన్ని ప్రవచిస్తూ, గాంధీజీ ఆమెకి ఉత్తరం రాశారు.
గాంధీజీ మొండితనం మనకి తెలుసు. అమ్తుస్సలామ్ ఎవరి మాటా వినని జగమొండి.
III
ఆమె యావదాస్తిని రాజ్‌పురాలోని కస్తూర్బా సేవామందిర్ కే రాసిచ్చేసింది. చివరిరోజుల్లో అక్కడే నిరాడంబరంగా జీవించింది. ఒక పిచ్చి ఖాదీచీర, నేలమీదే నిద్ర… తలకింద దిండు – ఒక చెక్క ముక్క!
‘హిందుస్థాన్’ అనే ఉర్దూ పత్రిక నడిపింది. బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆమె కార్యకలాపాలు విస్తరించాయి. ఆ ప్రాంతాల్ని సందర్శించింది. స్కూలు చదువు కూడా లేని ఒక సామాన్య స్త్రీ ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, పంజాబీ, గుజరాతీ భాషల్లో ప్రావీణ్యంతో పాటు తమిళం, తెలుగు, ఒరియా, బెంగాలీ భాషల్నీ నేర్చుకుని, ఒక జర్నలిస్టుగా నిలబడగలిగిందంటే… Tష్ట్రat ఱs ఎaస్త్రఱc శీf వీaష్ట్రatఎa!
ఆశయ స్ఫూర్తితో అగ్ని సముద్రాల్ని దాటిన అమ్తుస్సలామ్… అవిశ్రాంత పోరాట జీవితాన్ని ముగించి, 1985 సెప్టెంబర్ 29న మనల్ని వీడి వెళ్లిపోయింది.
III
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని ఇలాంటి కథని వెలికితీయడంలో రమణమూర్తి నిజాయితీ, నిబద్ధత నిరుపమానమైనవి. చరిత్రని రక్తం ఉప్పొంగేలా, నరాలు తెగేలా, గతాన్ని చూసి గర్వపడేలా రాసిన పద్ధతి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
‘బీబీ అమ్తుస్సలామ్’ పుస్తకం కొని చదవండి. రండి.. మన మహోజ్జ్వల చరిత్రను చూసి మురిసిపోదాం. స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి 70మంది ప్రసిద్ధుల జీవితాలకు సంబంధించిన విలువైన సమాచారం క్లుప్తంగా ఇవ్వడం వల్ల ఈ పుస్తకానికి ఒక పరిపూర్ణత చేకూరింది.
III
హైదరాబాద్ గచ్చిబౌలీలో విల్లాలు కొనుక్కోవాలనీ, బంజారాహిల్‌్సలో బిల్డింగులు కట్టుకోవాలనీ తెలియని వెర్రిబాగుల వాళ్లయిన గాంధీ, అమ్తుస్సలామ్ నీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ని చూసి పడీపడీ నవ్వుకోవడం మరిచిపోకండి.
ప్రజలు, దేశం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటూ… వాళ్లెంత దరిద్రంగా బతికారు!
ఆస్తులు, బాంక్ బ్యాలెన్‌్స, దొంగ వ్యాపారాలంటూ మనమెంత దర్జాగా బతుకుతున్నాం!!
III
పుస్తకం కవర్ పేజీ, లోపల పేజీల్లో జీవం ఉట్టి పడే అమ్తుస్సలామ్ రేఖా చిత్రాలు ప్రఖ్యాత ఆర్టిస్టు, శిల్పి బ్రహ్మం వేశారు.
జై భారత్ పబ్లికేషన్‌్స, ఎల్ బీ నగర్. (ఓల్‌్డపోస్‌్ట)
దుర్గారెడ్డి: 98480 19076, రజని: 98490 30089


